వంగవీటి మోహనరంగా కుమార్తె ఆశాకిరణ్ అసలు వ్యూహం ఏంటి? ప్రజల్లో ఉంటానంటారు, రాజకీయాల్లోకి రానంటారు. తన తండ్రికి సరైన గుర్తింపు దక్కలేదంటూ ఇన్నేళ్ళ తర్వాత వాదన వినిపిస్తున్నారు. ఇంతకీ ఏం కోరుకుంటున్నారు ఆశాకిరణ్? తాను గందరగోళంలో ఉన్నారా? లేక వ్యూహాత్మకంగా ఎదుటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? ఆశాకిరణ్…దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా కుమార్తె. ఆమె వ్యవహారశైలి ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశమైంది. ఇక నుంచి ప్రజల్లోనే ఉంటానని రెండు నెలల క్రితం ప్రకటించారామె. రాధా రంగా మిత్ర మండలి సలహాలతో ముందుకు నడుస్తానని కూడా చెప్పారు. ఇప్పుడే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని చెప్పడమైతే చెప్పారుగానీ…. తన పర్యటనల్లో అన్ని పార్టీలను టార్గెట్ చేస్తుండటంపై అనుమానాలు పెరుగుతున్నాయి. 2024 ఎన్నికల టైంలో… ఆమె వైసీపీలో చేరి విజయవాడ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా… ఆచరణలోకి రాలేదు. ఇక ఎన్నికలు ముగిసిన ఏడాదిన్నర తర్వాత సడన్‌గా బయటికి వచ్చి ఇక నుంచి ప్రజల్లో ఉంటానని ఆమె ఎందుకు ప్రకటించారు? ఒకవేళ రావాలనుకున్నా… క్లారిటీ మిస్ అయిందా అన్న చర్చలు మొదలయ్యాయి బెజవాడ రాజకీయవర్గాల్లో. వంగవీటి రంగా వారసుడిగా ఆశాకిరణ్ సోదరుడు రాధా 20 ఏళ్ళ క్రితం రాజకీయాల్లోకి వచ్చి ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారాయన. అయినా… ఆశాకిరణ్ మాత్రం ఇన్నాళ్ళుగా పెద్దగా ఇటువైపు ఇంట్రస్ట్ చూపలేదన్నది సన్నిహితుల మాట. ప్రజల్లో ఉంటానని ఇప్పుడామె ప్రకటనలు చేస్తున్నప్పటికీ ప్రధాన టార్గెట్ మాత్రం పొలిటికల్ ఎంట్రీనే అయి ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా.
అదే సమయంలో తన పొలిటికల్ ఎంట్రీ ఇప్పుడే లేదని ఆశాకిరణ్ చెప్పటం గందరగోళానికి దారి తీస్తోంది. అదే సమయంలో పలు వేదికలపై మాట్లాడుతూ… వంగవీటి రంగాకి ఏ రాజకీయ పార్టీ సరైన గుర్తింపు ఇవ్వలేదని అనడం ఆసక్తికరంగా మారుతోంది. ఆ విషయంలో టీడీపీ,జనసేన, వైసీపీ మూడు పార్టీలను కలిపే అంటున్నారు రంగా కుమార్తె. అలాగే… రంగా పేరు చెప్పి ఓట్లు అడుగుతున్న పార్టీలు జిల్లాకు ఆయన పేరు పెట్టలేదని చేసిన వ్యాఖ్యల చుట్టూ రకరకాల ప్రశ్నలు పెరుగుతున్నాయి. వైసీపీ హయాంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి పేర్లు పెడుతున్న సమయంలో రంగా పేరు డిమాండ్ కొన్ని వర్గాల నుంచి వచ్చింది. అప్పుడు ఏ మాత్రం స్పందించని, మాట్లాడని ఆశాకిరణ్…ఇప్పుడెందుకు ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నారన్నది కొందరి క్వశ్చన్. ఇక విశాఖ రంగానాడు సభ లొకేషన్ మూడు సార్లు మార్చారని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని సభకు వచ్చే వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారంటూ టీడీపీని టార్గెట్ చేశారామె.
కానీ… తన సోదరుడు రాధా కూడా అదే పార్టీలో ఉన్నారనే సంగతి మర్చిపోయారా అంటూ ప్రశ్నిస్తున్నారు కొందరు. అసలు ఏక కాలంలో టీడీపీ, వైసీపీ, జనసేనల్ని విమర్శిస్తూ… ఆశా కిరణ్ ఏం ఆశిస్తున్నారో అర్ధం కావడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. రాజకీయ వ్యవహారాల పరంగా ఆమె గందరగోళంలో ఉన్నారా? పొలిటికల్‌గా తన దారి ఎటో తేల్చుకోలేకపోతున్నారా అన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. రాజకీయాల్లోకి వస్తున్నారా అంటే నో అన్నదే సమాధానం. మరి ఇన్నేళ్ళ తర్వాత వంగవీటి రంగాకి గుర్తింపు ఇవ్వాలంటూ చేస్తున్న ప్రకటనల ద్వారా ఆశాకిరణ్ ఏం ఆశిస్తున్నారన్న చర్చలు నడుస్తున్నాయి. ఆమె కన్ప్యూజన్‌లో ఉన్నారా, లేక తాను క్లారిటీగానే ఉండి…. వ్యూహాత్మకంగా అవతలి వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారా అన్నది తేలాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.
