అక్కడ అధికార కూటమి ప్రజా ప్రతినిధులు పేకాట మీద బాగానే పోగేసుకుంటున్నారా? కార్డ్స్, టేబుల్స్ అన్నిటినీ వాళ్ళ అనుచరులే దగ్గరుండి మరీ… నడిపిస్తున్నారా? అక్కడికి తామేదో సమాజ సేవ చేస్తున్నట్టు… ఇందులో బలవంతం ఏం లేదు, నచ్చిన వాళ్ళు వచ్చి ఆడుకోండంటూ బంపర్ ఆఫర్స్ ఇస్తున్నారా? అంతలా బరితెగించి అక్కడి వ్యవహారాలు నడుస్తుంటే లోకల్ పోలీసులు ఏం చేస్తున్నట్టు? కాయ్ రాజా కాయ్…. కొయ్ రా బాబూ కొయ్….. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఏ మూలకు వెళ్ళినా ఇలాంటి మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయట. మునుపటికంటే భిన్నంగా…. పూర్తిస్థాయి పకడ్బందీగా ఇక్కడ పేకాట శిబిరాలను జోరుగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. టేబుల్స్ ఏర్పాటు చేయడానికి లోకల్ ఎమ్మెల్యేల అనుమతి తప్పనిసరి చేశారట. దాంతో… కొందరు శాసనసభ్యుల అనుచరులే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారన్నది లోకల్ టాక్. అందుకోసం యాపారాన్నిబట్టి డైలీ, వీక్లీ, మంత్లీ పేమెంట్స్ ఫిక్స్ చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు…. టేబుల్ మీద జరిగే ట్రాన్సాక్షన్‌ను బట్టి రేటు డిసైడ్ చేస్తున్నారట. ఎక్కడా.. ఏ మెలికా లేకుండా సాగిపోవాలంటే ఎమ్మెల్యేల చుట్టూ ఉండే వారితో ముందే డీల్ కుదుర్చుకోమని సందేశాలు పంపి మరీ…..ఆటాడిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. డీల్ కుదిరి.. ఆల్‌సెట్ అనుకున్న శిబిరాలవైపు పోలీసులు కన్నెత్తి కూడా చూడడం లేదని చెబుతున్నారు. ఇక్కడ కేటగిరీని బట్టి ట్రీట్‌మెంట్ ఉంటుందట. వీఐపీలు ఆడే పేకాట అయితే ఒకలాగా, మామూలోళ్ళకైతే మరో రేటు ఉంటుందని చెప్పుకుంటున్నారు. కొన్ని చోట్ల అయితే పెద్ద పెద్ద బిల్డింగులు రెంటుకు తీసుకుని మరీ… క్లబ్ లాగా నిర్వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో ఈ జోరు ఒక రేంజ్‌లో ఉందట. శిబిరాల నిర్వాహకులు ప్రతిరోజూ లక్షల రూపాయలు ముందుగా సమర్పించేసుకుంటేనే అంతా సవ్యంగా జరిగేది. పేమెంట్ ఒక్కరోజు లేట్ అయితే దాని ఇంఫాక్ట్ వెంటనే పడిపోతుందని గుసగుసలాడుకుంటున్నారు. మండలాలు, డివిజన్ల వారీగా ఈ వ్యవహారాన్ని డీల్ చేయడానికి అనుచరుల్ని ఫిక్స్ చేసేశారట ముఖ్య నాయకులు.
ఆ రోజు ఎంత వ్యాపారం జరిగింది? మనకు ఎంత ఇస్తారంటూ లెక్కలు చూసుకుని కప్పం వసూలు చేయడమే… ఆ సామంతరాజుల మెయిన్ వర్క్. పేకాట అంటే…. ఏదో, చిల్లర పెంకుల గేమ్‌లా కాకుండా పక్కా ప్రొఫెషనల్‌గా జరుగుతుందట ఇక్కడ. ఈ శిబిరాల్లో… ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కార్డ్స్ మడతలు పెట్టేవాళ్ళకు కొదవే లేదని అంటున్నారు. ముక్క ముక్కకి ఆ కిక్కే వేరంటూ ఎగబడేవాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో… నిర్వాహకులకు కూడా ఈ మధ్య పని బాగా ఈజీ అయిపోయిందని చెప్పుకుంటున్నారు. కొన్ని చోట్ల అయితే లాడ్జిల్లో కూడా పర్మినెంట్ రూములు వాళ్ల పేరుతో ఉంచేసుకుంటున్నట్టు తెలిసింది. దానికి కూడా కోడింగ్ ఉంటుందట. అలాంటి సీక్రెట్ ప్లేస్‌లలో ఏం జరిగినా ఎవరికీ వినపడదు కనపడదని అంటున్నారు. అదేంటి…? పేకాటను ఎమ్మెల్యేలే ఎంకరేజ్ చేయడం ఏంటని ఎవరైనా ప్రశ్నిస్తే…. దిమ్మతిరిగే రిప్లై ఇస్తున్నారట వాళ్ళ అనుచరులు. మీరొచ్చి పాడైపోండని మనం ఎవరినైనా పిలుస్తానా ఏంటి? జస్ట్… ఫెలిసిలీస్ కల్పిస్తున్నాం. దానికో రేట్ ఫిక్స్ చేస్తున్నాం. నచ్చిన వాళ్ళు వచ్చి ఆడుకుంటున్నారు. వ్యాపారం జరిగినప్పుడు ఆమాత్రం లాభం ఆశించడం తప్పా ఏంటి..? గుండె మీద చెయ్యేసుకుని మీరే చెప్పండని అంటూ గడుసు మాటలు మాట్లాడుతున్నారట. ఒకవేళ వద్దని మనం ఆపితే మాత్రం… ఆడే వాళ్ళు ఆగిపోతారా ఏంటి? మన దగ్గర కాకుంటే మరో చోటికి వెళ్తారంటూ వీర కవరింగ్‌లు ఇచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకే… ఏదో…. అలా చూసీ చూడనట్టు వదిలేస్తున్నాం, వాళ్ళకు ఆనందం, మాకు ధనం అంటూ ప్రజాప్రతినిధుల సామంతరాజులు చెబుతున్న మాటలు విని అవాక్కవడం తప్ప…మరో మాట మాట్లాడ్డానికి ఎవరికీ నోరు రావడం లేదట. ఎమ్మెల్యేలకు అతి దగ్గరగా ఉన్న వాళ్లే ఇటువంటి వ్యవహారాలను చూస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎవరంటే వాళ్లు ఇన్వాల్వ్ అయితే… రచ్చ పెరిగిపోతుందన్న అంచనాతో వాళ్లు కూడా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారట. ఇక పేక ముక్కల చుట్టూనే కావాల్సిన అన్ని రకాల సదుపాయాలను కొన్నిచోట్ల ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. జేబులో డబ్బుల కట్టలు ఉంటే చాలు కొండ మీది కోతి కూడా పేకాట శిబిరంలోకి వచ్చి వాలిపోతోందన్నది కాకినాడ వాయిస్. జిల్లాలో చాలాచోట్ల పేకాట ఒక రేంజ్‌లో జరుగుతూ…. పైకి అంతా సాధారణంగానే కనిపించినప్పటికీ లోపల మాత్రం పొలిటికల్ ఫ్లేవర్ తగలడంతో అంతా గప్ చుప్ అన్నట్టు ఉండిపోతున్నారట. అంచా ఎమ్మార్పీ టైప్…. నీకెంత? నాకెంత? దగ్గరే ఉన్నారు తప్ప కంట్రోల్ చేయాలన్న ధ్యాస ఎవరికీ ఉండకపోవడంతో… 30 టేబుళ్లు, 60 ఆటలుగా సాగిపోతోందట కాకినాడ చతుర్ముఖ పారాయణం.

