OTR : రంగంలోకి బొత్స వారసురాలు..! అనూష పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర చర్చ..!!

Anusha

Anusha

ఉత్తరాంధ్ర పొలిటికల్‌ స్క్రీన్‌ మీద మరో కొత్త సీన్‌ కనిపించబోతోందా? గల్లీ నుంచి ఢిల్లీ దాకా… పలుకుబడి ఉన్న తండ్రి వారసత్వాన్ని అందుకోవడానికి కుమార్తె సిద్ధమయ్యారా? ప్రాధమిక కసరత్తు మొత్తం పూర్తయి, కేడర్‌లో కూడా సానుకూలత పెంచుకుని… ఇక నాయకత్వ నిరూపణకు సిద్ధమవుతున్నారా? ఎవరామె? ఏంటా ఇంట్రస్టింగ్‌ పొలిటికల్‌ జర్నీ? ఉత్తరాంధ్ర రాజకీయాల్లో యువతరం దూసుకొస్తోంది. టీడీపీ నుంచి చింతకాయల విజయ్, అదితి గజపతి, గౌతు శిరీష ఇప్పటికే ఛాన్స్‌ కొట్టేశారు. వారసత్వ రాజకీయాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న టైంలోనే…. ఇప్పుడు అందరి కళ్ళు బొత్స కుటుంబం వైపు మళ్ళాయి. తండ్రి చాటు బిడ్డగా ఇన్నాళ్ళు చీపురుపల్లి నియోజకవర్గంలో వ్యవహారాలు చక్కబెట్టిన బొత్స అనూష… ఇటీవల పొలిటికల్ ఎక్స్‌పోజర్ పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. ఈ మధ్య కాలంలో వైసీపీ నిర్వహిస్తున్న నిరసనలు, ఆందోళనల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న అనూష… ముఖ్యంగా జెన్ జీని ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారట. దీంతో… తన పొలిటికల్‌ ఎంట్రీకి ఆమె లైన్‌ క్లియర్‌ చేసుకుంటున్నారా అన్న చర్చలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఉత్తరాంధ్ర కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా, ఆ తర్వాత వైసీపీలో కూడా దాదాపు అదే రోల్‌ పోషిస్తున్నారు బొత్స. సమకాలీనులు చాలా మందే వున్నా… ఈ కాపు నేత ప్రస్ధానం సంథింగ్ డిఫరెంట్ అంటారు పొలిటికల్‌ పండిట్స్‌. నాలుగు దశాబ్దాల పొలిటికల్‌ జర్నీలో… ఉమ్మడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారాయన. సీనియర్ మంత్రిగా, ఎంపీగా సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం కాగా…. 2019-24మధ్య జగన్‌ కేబినెట్‌లో కీలక శాఖల బాధ్యతలు చూశారు.

ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లా స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీగా, శాసన మండలి ప్రతిపక్ష నేతగా, పార్టీకి బలమైన గొంతుకగా కనిపిస్తున్నారు బొత్స. నిరాధార ఆరోపణలను నిర్ద్వంద్వంగా ఖండించడం, తప్పు ఎవరు చేసినా తప్పేనని బహిరంగంగా చెప్పడం లాంటి కారణాలతో కొందరు ప్రత్యర్థుల్లో కూడా ఆయన పట్ల సానుకూలత కనిపిస్తుంటుందని అంటారు. ఇక సత్తిబాబుతో పాటు ఫ్యామిలీ మొత్తం పాలిటిక్స్‌లోనే ఉంది. ఆయన భార్య బొత్స ఝాన్సీ రెండు సార్లు ఎంపీగా పనిచేశారు. సోదరుడు అప్పలనర్సయ్య గజపతినగరం నుంచి గతంలో ఎమ్మెల్యే అయ్యారు. ఇక మేనల్లుడు చిన్న శ్రీను, ఇతర బంధువర్గం విజయనగరం జిల్లా పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. ఈ క్రమంలో.. ఇప్పుడు కొత్త తరం పొలిటికల్ ప్రవేశానికి కూడా రంగం సిద్ధమవుతోందట. బొత్స సత్యనారాయణ కొడుకు సందీప్, కుమార్తె అనూష ఇద్దరూ డాక్టర్లే. అయితే… సందీప్ వృత్తి పరమైన బిజీలో ఉండగా… అనూష తండ్రితో కలిసి రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ముఖ్య నేతల మీటింగ్స్‌, నియోజకవర్గ కార్యకర్తల సమావేశాలకు అటెండ్‌ అవుతున్నారామె. అనూష వ్యవహారశైలితో వైసీపీ కేడర్‌లో కూడా సానుకూలత వ్యక్తం అవుతోందని అంటున్నారు. ఇన్నాళ్ళు బొత్స అందుబాటులో లేనప్పుడు నియోజకవర్గాల్లో సమస్యలపై దృష్టి సారించేవారు ఝాన్సీ. 2024 ఎన్నికల్లో సత్తిబాబు చీపురుపల్లి నుంచి పోటీ చేస్తే…. పార్టీ అధిష్టానం పట్టుబట్టి ఝాన్సీని విశాఖ రాజకీయాల్లోకి దించింది. బలమైన కుంటుంబ నేపథ్యం, కాపు ఫ్యాక్టర్ కీలకంగా పనిచేస్తాయని భావించినా… కూటమి వేవ్‌లో అవేమీ పని చేయలేదు. ఇక ఓటమి తర్వాత కూడా ఫ్యామిలీ మొత్తం క్రియాశీలకంగానే వ్యవహరిస్తోంది. అనూష విశాఖలో వుంటూ రాజకీయంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారట. కుటుంబ పరంగా బలమైన పొలిటికల్‌ ప్లాట్‌ఫామ్‌ వున్నప్పటికీ…అది అక్కడికే పరిమితం అవుతుందని, దానికి అతీతంగా స్వతంత్రంగా ఎదగగలిగితేనే నిలదొక్కుకోగలుగుతారన్నది బొత్స ఆలోచన అట. అందుకే… ఆ కోణంలోనే కుమార్తెకు పొలిటికల్‌ గైడెన్స్‌ ఇస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో రాబోయేది స్ధానిక సంస్ధల ఎన్నికల హడావిడి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొ రేషన్, జిల్లా పరిషత్‌లను గెలుచుకోవడం అధికార పక్షం కంటే వైసీపీకి చాలా ముఖ్యం. అందుకే సమర్ధతతో పాటు ఆర్థికంగా బలమైన అభ్యర్థులు కావాలని చూస్తోంది ఫ్యాన్‌ పార్టీ. ఈ తరుణంలో బొత్స అనూష పొలిటికల్ జర్నీ ఎలా ప్రారంభిస్తారు? ఎక్కడ నుంచి ఆరంగేట్రం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.