సూటిగా… సుత్తి లేకుండా మాట్లాడుతున్నానని ఆ ఎమ్మెల్యే గొప్పలకు పోవచ్చుగానీ… అవే మాటలు సొంత ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయా? నేనింతే అన్నట్టు ఉంటున్న ఆయన వైఖరి ప్రతిపక్షాలకు పవర్ఫుల్ అస్త్రాలను అందిస్తోందా? సొంత ప్రభుత్వాన్ని ఉద్దేశించే… ఆమరణ నిరాహారదీక్ష వ్యాఖ్యలు చేస్తున్న ఆ శాసనసభ్యుడు ఎవరు? అది పబ్లిసిటీ స్టంటా? లేక ఆయన నైజమే అంతా? జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వ్యవహారం ఎప్పటికప్పుడు వివాదాస్పదం అవుతూనే ఉంది. ముఖ్యంగా వివిధ అంశాలకు సంబంధించి ఆయన చేసే వ్యాఖ్యలు కేరాఫ్ కాంట్రవర్శీ అవుతున్నాయి. కొన్ని కామెంట్స్ మంచిపేరు తెచ్చినా… ఎక్కువ శాతం మాత్రం వివాదాస్పదమే అవుతున్నాయి. తొండ ముదిరి ఊసరవెల్లి అయిందన్నట్టు ఎమ్మెల్యే వ్యాఖ్యలు రానురాను సొంత ప్రభుత్వాన్నే ఇరుకుకున పెడుతున్నాయట. ప్రభుత్వంలో, మంత్రుల దగ్గర అంతర్గతంగా చర్చించి చేయించుకోవాల్సిన పనుల గురించి కూడా…. బహిరంగ వేదికలపై మాట్లాడుతున్నారు. దీంతో ఆయన కామెంట్స్ అటు సర్కార్‌ను ఇరుకున పడేయటంతో పాటు… విపక్షాలకు మంచి కంటెంట్‌గా మారుతున్నాయని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అనిరుధ్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులకే డీజీపీని కలిసి తనకు నియోజకవర్గంలో ఎస్కార్ట్ వద్దని వినతిపత్రం ఇచ్చి వార్తల్లో నిలిచారు. అంత వరకు ఓకే అనుకున్నా… తర్వాత రెవెన్యూలో జరిగే అవినీతిపై పోరాటం చేయాలని నిర్ణయించడం రాష్ట్రవ్యా ప్తంగా సంచలనం రేపింది. ప్రభుత్వ పెద్దలు కలుగజేసుకుని..ఆ విషయంలో ఆయనకు సర్దిచెప్పారు. అదే క్రమంలో తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు అమోదించకుంటే సీఎం చంద్రబాబు నాయుడిని తెలంగాణలో తిరగ నివ్వబోమని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి.
ఇక తెలంగాణలో ఆంధ్రా కాంట్రాక్టర్స్ అంటూ… పలుమార్లు బహిరంగంగానే మాట్లాడుతున్నారాయన. పవన్‌కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలు, సినీ ప్రముఖుల డ్రగ్స్ టెస్టుల అంశాలతో ఫిల్మ్ ఇండస్ట్రీ లోనూ చర్చనీయంశం అయ్యాయి. తన నియోజకవర్గంలో కాలుష్య కారక పరిశ్రమలను తగులబెడతానని ఇచ్చిన అల్టిమేటంతో న్యూస్ కంటెంట్‌గా మారిన అనిరుథ్…. ఒకసారి ఎమ్మెల్యే అయ్యానని, రెండు సార్లు గెలిస్తే సీఎం కూడా అవుతానని ప్రకటించుకుని అటెన్షన్ తనవైపునకు తిప్పుకున్నారు. ఇక రాష్టంలో నల్గొండ, ఖమ్మం నేతలే నిధులన్నీ తీసుకుపోతున్నారని, మంత్రులైతేనే నిధులా అంటూ…. ఆయా మంత్రుల నిధుల లెక్కలు తేల్చాలనడం ఆమాత్యుల సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. ఇక ఇప్పపువ్వు సారాను ఆమోదించి.. బ్రాండింగ్ చేయాలని అసెంబ్లీ సాక్షి గా ప్రస్థావించారాయన. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు. చాలాసార్లు వివిధ అంశాలపై సంచలన వ్యాఖ్యల చేశారు జడ్చర్ల ఎమ్మెల్యే. ఓవైపు ప్రభుత్వాన్ని, సర్కార్ పెద్దలని ఇరుకున పెట్టేలా కామెంట్స్ చేస్తూనే.. మరోవైపు పార్టీపై, ప్రభుత్వం పై, సీఎం రేవంత్‌రెడ్డిపై గొప్పగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి.. అప్పుడే విమర్శించి.. అంతలోనే గొప్పగా చెప్పడం కూడా ఆయనకే చెల్లిందని అంటారు. ఇక ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నిధుల విషయంలో దూకుడుగానే వ్యవహరిస్తున్న అనిరుథ్‌రెడ్డి….. తాజాగా రోడ్లు, భవనాల శాఖ నుంచి బిల్లులు రాకపోవడాన్ని లేవనెత్తుతూ… నిధులు ఇవ్వకుంటే 30వేల మందితో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.
తాను చచ్చిపోతేనే నిధులు వస్తాయంటే చావడానికి సిద్ధమని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నాగర్‌కర్నూలు జిల్లాలో ఒక ఆర్అండ్బీ కాంట్రాక్టర్ చనిపోయిన తర్వాత బిల్లులు ఇచ్చారని, తాను కూడా చనిపోయిన తర్వాత 40 కోట్ల రూపాయల బిల్లులపై నిర్ణయం తీసుకుంటారా? అని సర్కార్‌ను నిలదీశారు. మంత్రుల నియోజకవర్గాలకు బిల్లులు ఇస్తూ.. మిగతా వాటిని పట్టించుకోకపోవడం ఏమిటని తనదైన శైలిలో ప్రశ్నిస్తున్నారాయన. ఆయన తీరు పూర్తిగా… సర్కార్‌ను విపక్ష ఎమ్మెల్యే ప్రశ్నించినట్టే ఉందని పొలిటికల్ సర్కిల్స్ విశ్లేషస్తుండగా… తమ సర్కార్ పాలన, నిధుల అంశాలు, వైఫల్యాలను ఆ పార్టీ ఎమ్మెల్యే నే ఎండగడుతున్నారంటూ…. ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. అనిరుధ్ వ్యాఖ్యల్ని ఉదాహరణగా చూపిస్తూ… సర్కార్‌ను ఎండగడుతున్నారు. అయితే…. అనిరుథ్ రెడ్డి ప్రణాళికా బద్దంగా వార్తల్లో నిలవడంతో పాటు, తను చెప్పాలనుకున్న అంశం సంచలనం కావాలన్న ఉద్దేశ్యంతో కూడా… ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు కొందరు. అయితే… అనిరుద్ రెడ్డి ముక్కుసూటి మనిషి అని , ఆయన ఏదైనా కుండబద్దలు కొట్టినట్లే మాట్లాడతారంటూ వెనకేసుకుని వస్తున్నారు ఆయన సన్నిహితులు.ఇక ఇదే సమయంలో జడ్చర్ల ప్రాంత అభివృద్ధి నిధుల కోసం పలుమార్లు మంత్రులను అడిగి భంగపడ్డాకే అలా మాట్లాడి ఉండొచ్చన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి. మొత్తం మీద సొంత పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యల వ్యవహారం మాత్రం కాంగ్రెస్ సర్కార్ ను ఇరకాటంలో పెడుతోందని అంటున్నారు పరిశీలకులు.

