ఈ సీటు నాదే… ఆ జడ్పీ నాదేనంటూ…. ఇన్నాళ్ళు గల్లాలెగిరేసిన నేతల గొంతుల్లో ఇప్పుడు పచ్చి వెలక్కాయలు పడ్డాయి. చూస్తో నా తడాఖా అని తొడలు కొట్టిన వాళ్ళకు ఆ వాపు తప్ప ఇంకేం మిగల్లేదట. ఎక్కడుందా పరిస్థితి? ఏ జిల్లాలోని నాయకులు తీవ్ర నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొంతమంది నేతల పరిస్థితి దారుణంగా మారిందట. జడ్పీ ఎన్నికల్లో మాదే పీఠం..నాకే టికెట్ అంటూ ఇన్నాళ్లు ఉవ్విళ్లూరిన వాళ్ళకు మారిన రిజర్వేషన్స్ గట్టి ఝలక్ ఇచ్చాయి. కొందరికి జడ్పీటీసీ రిజర్వేషన్ కలిసొచ్చినా… జడ్పీ పీఠం మాత్రం అనుకూలించ లేదట. ఇంకొందరు జనరల్ లీడర్స్ పోటీ చేద్దామనుకున్న స్థానాలు బీసీ, ఎస్సీ, లేదా మహిళలకు రిజర్వ్ కావడంతో… ఆశలు గల్లంతయ్యాయని ఆవేదనగా ఉన్నారట చాలామంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ నేత ముందు నుంచి జడ్పీ పీఠం పై గురి పెట్టారు. తీరా చూస్తే జిల్లాలోని 20 జడ్పిటీసీ స్థానాలకుగాను రెండే జనరల్ అయ్యాయి. అందులో కూడా ఒకటి జనరల్ మహిళగా ఉంది. అదే సమయంలో జడ్పీ ఛైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు అయింది. దాంతో ఛైర్మన్ అయిపోదామనుకున్న ఆ నాయకుడికి ఇప్పుడు ఏడుపే తక్కువ అట. ఇలా బీజేపీలో ఒకరు, కాంగ్రెస్‌లో మరొకరు, బీఆర్ఎస్‌లో ఇంకొకరు అందరిదీ అదే సమస్యగా చెప్పుకుంటున్నారు.
బరిలో మేమే సీటు మాదేనని అనుకున్న వాళ్ళ ఆశల మీద రిజర్వేషన్స్ మార్పు నీళ్ళు చల్లిందని చెప్పుకుంటున్నారు. దాంతో… జనరల్ కేటగిరీకి చెందిన నాయకులు ఇప్పుడు జనరల్ మహిళలకు కేటాయించిన సీట్లలో తమ కుటుంబ సభ్యులను దింపాలనుకుంటున్నట్టు సమాచారం. ఆదిలాబాద్ జిల్లాలోని 20 జడ్పిటీసీ స్థానాలకుగాను… 8 బీసీలకు, 8ఎస్టీలకు 2 ఎస్సీలకు,2 జనరల్ అయ్యాయి. గతంలో అయితే జనరల్ స్థానాలే ఎక్కువగా ఉండడంతో ఆ సామాజికవర్గాల నేతలకు విపరీతమైన అవకాశాలు వచ్చాయి. ఇక మంచిర్యాల జడ్పీ స్థానం బీసీ మహిళకు కేటాయించారు. ఇక్కడ ఆర్థికంగా బలంగా ఉన్న సామాజికవర్గం నాయకులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. గతంలో ఎస్సీ మహిళకు రిజర్వు కాగా ఈసారి తమకే అనుకూలంగా వస్తుందని ఇతర సామాజికవర్గాలు అంచనాలు వేసుకున్నారు. కనీసం జనరల్ మహిళకు వచ్చినా తమ వాళ్లను నిలబెడదామని అనుకున్నారట. కానీ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో వాళ్ళు కూడా నిరాశగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్క బెల్లంపల్లి నియోజకవర్గంలోని 7 మండలాల్లోనే 14 నుంచి 18మంది నేతల పదవుల ఆశలకు గండిపడ్డాయట. తమలో ఎవ్వరికీ రిజర్వేషన్లు అనకూలించలేదనే బాధలో ఉన్నారట వాళ్లంతా. ఇన్నాళ్ళు ఎమ్మెల్యేకు దగ్గర అనుకుని, జడ్పీ పీఠం మనదేనని అనుకున్న వాళ్ళు కూడా ఇప్పడు ఇక చేసేదేముందని పెదవి విరుస్తున్నారట.
ఇక కొమురం భీం జిల్లాలో బీఆర్ఎస్ నుంచి మర్సకోల సరస్వతి ఈసారి ఎస్టీ కోటాలో జడ్పీ పీఠం తమదే అన్నట్లుగా ముందునుంచే ప్లాన్ చేశారట. పైగా జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండడం జిల్లాలో బీఆర్ఎస్ బలంగా ఉందని భావించి గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ… జడ్పీ పీఠం బీసీ జనరల్‌కు కేటాయించడంతో…ఉసూరుమంటున్నట్టు సమాచారం. కాంగ్రెస్, బీజేపీల్లో కూడా చాలా మంది నాయకులు ఎందుకిలా మా ఖర్మ కాలిపోయింది అని సాంగులు సింగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అటు నిర్మల్ జిల్లాలో సైతం ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఉందట. దీంతో ఇన్నాళ్ళు ఆశలు పెట్టుకున్న వాళ్ల పరిస్తితి కక్కలేక, మింగలేక అన్నట్టుగా ఉందని అంటున్నారు. ఇన్నాళ్ళు జిల్లాలో జనరల్ క్యాటగిరికి చెందిన నేతల పెత్తనం సాగగా… ఇప్పుడు ఆ సీట్లలో మెజార్టీ బీసీలకు రిజర్వ్ అయ్యాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, అలాగే మహిళలకు 50 శాతం సీట్ల కేటాయింపుతో మొత్తం ముఖచిత్రమే మారిందంటున్నారు విశ్లేషకులు. కొత్త రిజర్వేషన్లతో చాలామంది నేతల గురి తప్పగా… ఎవరు ఎక్కువ సీట్లు సాధిస్తారోనన్న ఆసక్తి మాత్రం పెరుగుతోంది.
