రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న బీఆర్‌ఎస్ అగ్ర నేతలు కేటీఆర్, హరీష్‌రావు ఆ ఉమ్మడి జిల్లాలో మాత్రం ఎందుకు అడుగుపెట్టడం లేదు? కేడర్ కోరుకుంటున్నా… అటువైపు చూడకపోవడానికి కారణాలేంటి? మిగతా జిల్లాల్లో కీలకమైన మీటింగ్స్ నిర్వహిస్తున్న ఇద్దరూ రాజకీయ ప్రాముఖ్యం ఉన్న ఆ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడం వెనక ప్రత్యేక కారణం ఉందా? ఏదై ఉమ్మడి జిల్లా? ఏంటా కారణం?
తెలంగాణ వ్యాప్తంగా కార్యకర్తల సమన్వయ సమావేశాలు నిర్వహిస్తోంది బీఆర్‌ఎస్. నియోజకవర్గాల వారీగా మీటింగ్స్ పెడుతూ…. ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలను పిలుస్తున్నారు. వీటికి జిల్లా పార్టీ నాయకులతో పాటు రాష్ట్ర నేతలు కూడా హాజరవుతున్నారు. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు జిల్లాల్లో పర్యటిస్తూ నియోజకవర్గ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు దాదాపు 60 కి పైగా నియోజకవర్గాల్లో సమావేశాలు జరిగాయి. కానీ…ఈ ఇద్దరు అగ్ర నేతలు ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం అడుగు పెట్టలేదు. ఈ పరిధిలోని ఏ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కూడా పాల్గొనలేదు. దీంతో….. ఎందుకిలా జరుగుతోంది? అగ్ర నాయకులు ఇద్దరూ నల్గొండ జిల్లా కార్యకర్తల సమావేశాల్లో ఎందుకు పాల్గొనడం లేదన్న చర్చ పార్టీ వర్గాల్లోనే మొదలైంది. కొందరైతే ఓ అడుగు ముందుకేసి…. కారణం ఏమై ఉంటుందబ్బా అంటూ ఆరా తీస్తున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఆనుకుని ఉన్న ఖమ్మం, మహబూబ్ నగర్‌లో కూడా పర్యటించిన
కేటీఆర్, హరీష్‌రావు ఈ జిల్లా వైపు మాత్రం ఎందుకు చూడ్డం లేదన్నది ఇక్కడి కార్యకర్తల ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానంగా… ఎప్పటినుంచో ఇక్కడ పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడమే అసలు కారణం అన్న మాటలు వినిపిస్తున్నాయి. జిల్లాకు చెందిన మాజీ మంత్రికి కొందరు మాజీ ఎమ్మెల్యేలకు అస్సలు పొసగడం లేదని చెప్పుకుంటున్నారు. ఆ మాజీ మంత్రి కారణంగానే… గత ఎన్నికల్లో ఓడిపోయామని కొందరు మాజీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే విమర్శించారు. మరి కొందరు మాజీ ఎమ్మెల్యేలైతే…. మా దగ్గర మేం సొంతంగానే పార్టీని బలోపేతం చేస్తాం, వేరే నియోజకవర్గాల నేతలు వేలు పెట్టకూడదంటూ అధిష్టానానికి క్లియర్‌గా చెప్పినట్టు తెలుస్తోంది. ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సమన్వయం లేదనడానికి మరొక ఉదాహరణ కూడా చెబుతున్నారు బీఆర్‌ఎస్ నేతలు. ఇటీవల నల్గొండలోనే పెద్ద ఎత్తున జరిగిన బహిరంగ సభ వేదిక మీద నుంచే కేసీఆర్‌తో పాటు పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రికి కౌంటర్‌గా తెలంగాణ భవన్ లో వేర్వేరుగా మీడియా సమావేశాలు నిర్వహించారు ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు. ఉదయం పూట ఒక వర్గం మీడియా సమావేశం పెడితే మధ్యాహ్నం తర్వాత మరొక వర్గం నిర్వహించింది. అలా ముఖ్యమంత్రిని విమర్శించడం కోసమే ఏకంగా పార్టీ హెడ్డాఫీస్‌లోనే ఒకే జిల్లా నేతలు వేర్వేకుగా ప్రెస్‌మీట్స్ పెట్టడం ఏంటన్న చర్చ జరుగుతోంది. అందుకే ఈ ఉమ్మడి జిల్లాను సమన్వయం చేయడం కోసం పార్టీ ముఖ్యనేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు.
ప్రస్తుతం ఆయన నేతృత్వంలోనే సమన్వయ సమావేశాలన్నీ జరుగుతున్నాయి. ఈసారి అధికారంలోకి రావాలని గట్టిగా చూస్తున్న బీఆర్‌ఎస్ అధిష్టానం…. చిన్న చిన్న విభేదాలు ఉన్న చోట్ల నాయకులను కలపాలని చూస్తోంది. అందులో భాగంగానే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవన్నీ కొలిక్కివచ్చి పార్టీ అగ్రనేతలంతా తమ జిల్లాలో పర్యటించాలని కోరుతున్నారు కారు కార్యకర్తలు.

