OTR: పెనుకొండ వైసీపీలో పీక్స్‌కు చేరిన వర్గపోరు

Otr2

Otr2

ఆ నియోజకవర్గంలో పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చే పరిస్థితులు కనిపిస్తున్నాయా? వైసీపీ మాజీ మంత్రులు ఇద్దరి మధ్య ఇగో, ఆధిపత్య పోరు టీడీపీకి బాగా కలిసివచ్చే అవకాశాలున్నాయా? ఇద్దరూ కలిసి స్థానిక ఎన్నికల్లో పార్టీ ప్రయోజనాల్ని పణంగా పెట్టే అవకాశం ఉందా? గట్టి పోటీ ఇవ్వాలని వైసీపీ అధిష్టానం చెబుతుంటే… అసలుకే ఎసరొచ్చేలా ఉందంటున్న ఆ నియోజకవర్గం ఏది? పెద్దలు చెప్పినా వినే అవకాశం తక్కువ అంటున్న ఆ నేతలు ఎవరు?

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల అగ్గి గట్టిగా రాజుకుంటోంది. ఒకవైపు అన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్ ఆదేశించినా…, క్షేత్రస్థాయిలో సీన్ వేరేలా ఉందంటున్నారు. నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్, మరో మాజీ మంత్రి శంకరనారాయణ వర్గాల మధ్య రెండున్నరేళ్ళుగా నడుస్తున్న ఆధిపత్య పోరు.. ఇప్పుడు పీక్స్‌ చేరుతోందట. దీంతో… పెనుకొండ వైసీపీలో అధినేత ఆదేశాల కంటే నేతల మధ్య పంతాలే డామినేట్‌ చేస్తున్నాయని అంటున్నారు. ఇద్దరు మాజీ మంత్రుల ఆధిపత్య పోరు ఇప్పుడు పెనుకొండలో పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోందని కేడర్‌లో ఆందోళనగా ఉంది.

పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్తగా, పూర్తి స్థాయి ఇన్‌ఛార్జ్‌గా మ ఉషాశ్రీ చరణ్ వ్యవహరిస్తున్నారు. అయితే స్థానికంగా మాజీ మంత్రి శంకరనారాయణ వర్గం కూడా ఉంది. దీంతో… నియోజకవర్గంపై పట్టు కోసం ఈ ఇద్దరు నేతల మధ్య తీవ్ర స్థాయిలో అంతర్గత పోరాటం సాగుతోంది. ఏ కార్యక్రమం జరిగినా ఇరు వర్గాలు విడివిడిగానే పాల్గొనడం, పరస్పరం అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకోవడం లాంటివి చాలానే జరిగాయి. గతంలో శంకరనారాయణను నియోజకవర్గంలోకి రాకుండా ఉషాశ్రీ చరణ్ వర్గం పలుమార్లు అడ్డుకునే ప్రయత్నం చేసింది. ప్రోటోకాల్, రాజకీయ ప్రాధాన్యతల విషయంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. అటు శంకరనారాయణ కూడా వెనక్కి తగ్గకుండా, తన వర్గం బలాన్ని చూపిస్తూ గట్టిగానే ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య సఖ్యత కుదిర్చేందుకు గతంలో అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలితం ఇవ్వలేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా, ఇద్దరూ అదే ధోరణితో ఉన్నారు తప్ప… ఏకతాటిపైకి వచ్చే అవకాశం కనిపించడం లేదంటున్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ల నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల వరకు అభ్యర్థుల ఎంపిక అత్యంత కీలకం. అయితే ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఉషాశ్రీ చరణ్ తన అనుచరులకే టికెట్లు ఇచ్చుకుంటే, క్షేత్రస్థాయిలో ఉన్న శంకరనారాయణ వర్గం సహకరిస్తుందా అన్నది పెద్ద ప్రశ్న. ఒకవేళ తమ వర్గానికి ప్రాధాన్యత దక్కకపోతే శంకరనారాయణ వర్గం అసమ్మతి రాగం పాడటం ఖాయంగా కనిపిస్తోంది.

నేతల మధ్య ఉన్న ఇగోలతో క్షేత్రస్థాయిలో ఉన్న సామాన్య కార్యకర్తలు ఎటు వైపు ఉండాలో తెలియక అయోమయంలో పడ్డారట. ఎన్నికల వేళ ఈ వర్గ విభేదాలు ఇలాగే కొనసాగితే పార్టీని దెబ్బతీసే ప్రమాదం ఉందంటున్నారు. మరోవైపు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ పరిస్థితిని పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉందట. పెనుకొండ నియోజకవర్గంలోని అన్ని స్థానాలను గెలిచి, తన రాజకీయ బలం ఏంటో నిరూపించుకోవాలని మంత్రి సవిత పట్టుదలతో ఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే కూటమి శ్రేణులను సమాయత్తం చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారామె. ప్రతిపక్ష ఓట్లు చీలిపోవడం, లేదా వైసీపీ క్యాడర్ నిరుత్సాహంతో ఎన్నికలకు దూరంగా ఉండటం వంటి పరిణామాలు ఇక్కడ కూటమికి ఏకపక్ష విజయాన్ని అందించినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం బలంగా ఉంది. దీనికి తోడు మంత్రి సవితకు ఉషాశ్రీ చరణ్‌ ఇబ్బందికరంగా మారారాన్న అభిప్రాయం ఉంది.

ప్రతి విషయంలోనూ సవితను టార్గెట్ చేసుకుంటూ ఉషా విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలవేళ అన్ని స్థానాలు గెలుచుకోగలిగితే ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టినట్టు అవుతుందని భావిస్తున్నారట సవిత. మొత్తం మీద పెనుకొండలో మాజీ మంత్రుల ఆధిపత్యపోరు కూటమికి బాగా కలిసొచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా…ఇద్దరూ ఇగోలు పక్కనబెట్టి కలిసి పనిచేస్తారా అన్నది అనుమానమేనని వైసీపీ వర్గాలే అంటున్నాయి.