OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?

Otr

Otr

గులాబీ దళంలో యాక్టివ్‌గా ఉన్న ఆ సీనియర్‌ లీడర్‌ ఉన్నట్టుండి తన ఓటు ఎందుకు మార్చుకున్నారు? తమ కుటుంబానికి పట్టున్న, గతంలో భర్త ఎమ్మెల్యేగా పనిచేసిన నియోజకవర్గాన్ని వదులుకుని మరో చోటికి ఎందుకు షిఫ్ట్‌ అయ్యారు? దాని వెనక కూడా భవిష్యత్‌ రాజకీయ వ్యూహం ఉందా? ఎవరా నాయకురాలు? ఏంటా ఓట్‌ షిఫ్ట్‌ కహానీ?

ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో గండ్ర వెంకటరమణారెడ్డికి దంపతులకు మంచి గుర్తింపు ఉంది. కాంగ్రెస్‌లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి తర్వాత బీఆర్‌ఎస్‌కు షిఫ్ట్‌ అయిన ఈ దంపతులకు ముందు చూపు కూడా ఎక్కువేనని అంటారు. ఈ క్రమంలో… తాజాగా…. గండ్ర జ్యోతి హన్మకొండలో తన ఓటు నమోదు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో భర్త వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న భూపాలపల్లి నియోజకవర్గం పరిధి నుంచి మారి… తాను హన్మకొండలో ఓటు హక్కు కోరుకుంటున్నట్టు ఎస్‌ఐఆర్‌ వెరిఫికేషన్‌లో పత్రాలు సమర్పించారామె. దీని చుట్టూనే రకరకాల అనుమానాలు పెరుగుతున్నాయి. ఇది పూర్తిగా భవిష్యత్‌ రాజకీయ కోణంలో చేసిన పనేనని, ఆమె వ్యూహాత్మకంగానే హన్మకొండకు మారినట్టు చెప్పుకుంటున్నారు. గ్రేటర్‌ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం కన్నేసే… జ్యోతి ఓటు మార్చుకుని ఉండవచ్చని అంచనా వేస్తున్నాయి రాజకీయవర్గాలు. వాస్తవానికి 2019 వరకు హన్మకొండలోనే ఓటరుగా ఉన్నారు జ్యోతి. ఇక రమణారెడ్డి కాంగ్రెస్ నుండి బీఆర్‌ఎస్‌లో చేరడంతో… జ్యోతికి 2019లో వరంగల్ రూరల్ జడ్పీ ఛైర్‌పర్సన్‌ అవకాశం దక్కింది. అక్కడే ఓటరుగా ఉండాలన్న రూల్‌ కారణంగా…శాయంపేట మండలం మందారిపేటకు తన ఓటు మార్చుకున్నారు జ్యోతి. మాదారిపేట గ్రామం భూపాలపల్లి నియోజకవర్గంలో ఉండడంతో భూపాలపల్లి జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా కూడా కొనసాగారు జ్యోతి. అక తాజా ఎస్‌ఐఆర్‌లో మాజీ ఎమ్మెల్యే, ఆయన కుమారుడు గౌతమ్ భూపాలపల్లిలో ఓటు హక్కు నమోదు చేసుకోగా… జ్యోతి మాత్రం హన్మకొండ జిల్లాను ఎంచుకున్నారు. అందుకు అనుగుణంగా పత్రాలు సమర్పించారు. కుటుంబం ఒకచోట, తానొక చోట ఎందుకు ఓట్లు నమోదు చేసుకున్నారన్న పాయింట్‌ చుట్టూ రకరకాల ఊహలు, విశ్లేషణలు బయలుదేరాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు త్వరలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ పీఠం మీద గురిపెట్టడం వల్లనే ఓటు విషయంలో ఆమె ఆ నిర్ణయం తీసుకుని ఉండవచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

పరకాల పట్టణానికి చెందిన గండ్ర జ్యోతి 2004 నుంచి రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచే రాజకీయాలు మొదలు పెట్టి… 2005నుంచే వరంగల్‌ మేయర్ సీటును టార్గెట్‌ చేశారు. 2005లో మేయర్ సీటు జనరల్ మహిళకు రిజర్వు అయింది. దీంతో.. హన్మకొండ 3వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారామె. అప్పుడే మేయర్ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించినా…. చివరికి ఆ పదవి ఎర్రబెల్లి స్వర్ణను వరించింది. ఇక ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో గండ్ర దంపతులు పార్టీ మారారు . 2023 ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వెంకటరమణారెడ్డి…ప్రస్తుతం బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్‌గా యాక్టివ్‌గా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో… తన చిరకాల కోరికను నెరవేర్చుకునేందుకే జ్యోతి తన ఓటును హన్మకొండకు షిఫ్ట్‌ చేసుకున్నారన్నది బీఆర్‌ఎస్‌ వాయిస్‌.

అదే సమయంలో కేవలం మేయర్‌ సీటే కాదు, పార్టీ తరపున హన్మకొండ జిల్లాలో ఏ బాధ్యతలు అప్పగించినా తీసుకుంటానని సన్నిహితులతో చెబుతున్నారట ఆమె. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన అంశం కూడా తెర మీదికి వస్తోంది. రేపు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే హన్మకొండ మహిళా కోటాలోకి రావచ్చన్న అంచనాలున్నాయి. ఆ కారణంగానే గండ్ర జ్యోతి ముందు చూపుతో కర్చీఫ్‌ వేసి ఉండవచ్చని కూడా చెప్పుకుంటున్నారు. అదే సమయంలో సీనియర్‌ లీడర్‌ మధుసూదనాచారి ఓవరాక్షన్‌కి చెక్ పెట్టడం కోసం కూడా గండ్ర దంపతులు వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుని ఉంటారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కుదిరితే మేయర్‌, లేదంటే రేపు ఎమ్మెల్యే టిక్కెట్‌ అన్న టార్గెట్‌తో గండ్ర దంపతులు వేస్తున్న అడుగులు ఎంతవరకు ఫలితం ఇస్తాయో చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.