ఆమె పెద్ద పదవిలో ఉన్నారు. ఆ పదవి రాజ్యాంగ బద్ధమైనది కూడా. కానీ ఆమెకు ఆ పదవి తప్ప పెత్తనం లేదట. ఇందుకు నియోజకవర్గంలో నెలకొన్న సమీకరణాలే కారణమని అధికారపార్టీ వర్గాల వాదన. బలమైన నేత ఎమ్మెల్యేగా ఉండటంతో పెత్తనం లేని పదవిలో ఉన్నారని టాక్ నడుస్తోంది. అదెక్కడో.. ఆ మహిళా నేత ఎవరో.. ఈ స్టోరీలో చూద్దాం.
ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా జకియా ఖానం
జకియా ఖానం. ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్. ఉమ్మడి కడప జిల్లా రాయచోటికి చెందిన జకియాకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ దక్కింది. ఆపై అధిష్ఠానం పెద్దల ఆశీసులతో రాజ్యాంగ బద్ధ పదవి కూడా వరించింది. రాయచోటి నియోజకవర్గంలోని ముస్లింలకు తగిన గుర్తింపు ఇస్తానని గతంలో ఇచ్చిన హామీ మేరకు జకియా ఖానంను ఎమ్మెల్సీని చేశారు సీఎం జగన్. జకియా భర్త అఫ్జల్‌ఖాన్ గతంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్. అఫ్జల్‌కే పదవి ఇస్తారని అనుకున్నా.. ఆయన ఆకస్మిక మరణంతో అఫ్జల్ భార్య జకియాకు పిలిచి పదవి ఇచ్చారు. ఇదంతా బాగానే ఉన్నా.. చేతిలో రాజ్యాంగ పరమైన పదవి ఉన్నా.. జకియా రాజకీయంగా యాక్టివ్‌గా లేరట. స్థానిక వైసీపీ నేతలతో కలిసి నడవాల్సిందే తప్ప.. సొంతంగా ఆమె వ్యవహరించే పరిస్థితి లేదనే వాదన ఉంది.
రాయచోటిలో పెత్తనం అంతా ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిదే..!
రాయచోటి వైసీపీ ఎమ్మెల్యేగా గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు. అధికార పార్టీలో ఆయన హోదా ఏంటో స్థానికంగా అందరికీ తెలుసు. ఆయన్ను కాదని స్థానికంగా వైసీపీలో ఇంకెవరూ దూకుడుగా వెళ్లే పరిస్థితి లేదు. జకియా ఖానం కూడా దానికి మినహాయింపు కాదని చెబుతారు. అలా అని జకియా.. శ్రీకాంత్‌రెడ్డి మధ్య వైరం ఉందని కాదు. కలిసి సాగుతారు.. కలిసి కార్యక్రమాల్లో కనిపిస్తారు. పెత్తనం మాత్రం శ్రీకాంత్‌రెడ్డిదే. పేరుకు శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ అయినా జకియా.. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిని దాటి వెళ్లే సాహసం చేయలేరు. ఈ అంశాన్ని రాయచోటి వైసీపీలోని ముస్లిం నేతలు పైకి ప్రశ్నించకపోయినా.. ప్రైవేట్ సంభాషణల్లో మాత్రం ప్రస్తావిస్తూ ఉంటారట. తమకు పదవి ఇచ్చి ఉపయోగం ఏంటి? అందులోనూ మహిళా నేతకు పిలిచి పదవిస్తే రాజకీయంగా సొంతంగా ఎదిగే పరిస్థితి ఉండదా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారట.
జిల్లా కేంద్రంలో పవర్ షేరింగ్ కోరుతున్న ముస్లిం నేతలు
రాయచోటి ప్రస్తుతం జిల్లా కేంద్రం. ఇక్కడ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. దీంతో పవర్ షేరింగ్‌లో తమకూ వాటా కావాలని ముస్లిం నేతలు కోరుతున్నారట. అయితే జకియాకు పదవి ఇవ్వడం ద్వారా ఆ కుటుంబానికి ఇచ్చిన హామీని నెరవేర్చారు తప్పితే.. ముస్లిం సామాజికవర్గానికి ఇంకే చేశారని మైనారిటీలలోని మరో వర్గం సన్నాయి నొక్కులు నొక్కుతోందట. ఈ విషయాలు తన దృష్టికి వచ్చినా.. స్థానిక రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సైలెంట్‌గా ఉండిపోతున్నారట జకియా. వచ్చేది ఎన్నికల సమయం కావడంతో పవర్ షేరింగ్ విషయంలో రాయచోటిలోని ముస్లిం సామాజికవర్గం గట్టిగానే ఆలోచన చేస్తోందట.