కమలంలోనూ గులాబీ రేకలు ఉన్నాయా? మాజీ మంత్రి ఈటల మాటల వెనుక మర్మం ఏంటి? ఇప్పటికే టీకాంగ్రెస్‌లో కోవర్టుల పంచాయితీ నడుస్తుంటే.. ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ BRS మనుషులు ఉన్నారనే ఈటల వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయా? ఆయన ఎందుకు ఈ అంశాన్ని ప్రస్తావించారు.
అన్ని పార్టీల్లోనూ కేసీఆర్ మనుషులు ఉన్నారన్న ఈటల
తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ కమిటీ ప్రకటనపై రేగిన దుమారం.. పార్టీలో అధికార BRSకు కోవర్టులు ఉన్నారనే వరకు వెళ్లింది. ఆ రచ్చ ఓ రేంజ్‌లో సాగింది. ఇంకా చల్లారలేదు. ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. అన్ని పార్టీల్లోనూ సీఎం కేసీఆర్ మనుషులు ఉన్నారని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఈటల ఉద్దేశంలో బీజేపీలో కూడా బీఆర్‌ఎస్ మనుషులు ఉన్నట్టేనా? ఆయన ఆ వ్యాఖ్యలు చేయడం వెనుక ఉద్దేశం అదేనా? అన్ని పార్టీల్లోనూ కేసీఆర్ తన మనుషులను పెట్టి అల్లకల్లోలం సృష్టించాలని చూస్తున్నారని.. వారిని గుర్తిస్తున్నామని ఈటల చెప్పారు. ఇక్కడ నేరుగా బీజేపీ ప్రస్తావన చేయకపోయినా.. ఆ అర్థం వచ్చేలా ఆయన కామెంట్స్ ఉన్నాయని చర్చ సాగుతోంది.
బీజేపీలో బీఆర్‌ఎస్ కోవర్టులను ఈటల గుర్తించారా?
ఈటల రాజేందర్ ఇప్పుడు ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించారు? బీజేపీలో ఆయనకు ఎదురైన అనుభవం ఏంటి? ఒకవేళ బీజేపీలో బీఆర్ఎస్ కోవర్టులు ఉంటే.. వారెవరో ఆయన గుర్తించారా? అదే నిజమైతే ఈటల ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు అన్నారు? ఇలా రకరకాల ప్రశ్నలు కాషాయంపార్టీలో వేడి పుట్టిస్తున్నాయి. బీజేపీలో ఉన్న కోవర్టులు ఎవరని ఆరా తీస్తున్నారట. ఈటల నోటి నుంచి ఆధారాలు లేకుండా ఏదీ రాదని.. ఆయన దగ్గర బీజేపీలోని కోవర్టుల గురించి పక్కా సమాచారం ఉండే ఉంటుందని కొందరు అభిప్రాయ పడుతున్నారట. మాజీ మంత్రి మాటలను కొట్టి పారేయడానికి వీల్లేదని.. సీరియస్‌గా తీసుకోవాలని మరికొందరు వాదిస్తున్నారట.
మునుగోడు ఉపఎన్నికల్లో జరిగిన ఘటనలపై బీజేపీలో చర్చ
పనిలో పనిగా కొందరు ఇటీవల బీజేపీలో జరిగిన కొన్ని పరిణామాలను చర్చకు పెడుతున్నారట. కమలంలో గులాబీ రేకల గురించి ప్రస్తావిస్తూ.. మునుగోడు ఉపఎన్నికల్లో జరిగిన ఘటనలు.. కొన్ని నిర్ణయాలు లీక్ కావడాన్ని ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నారట. బీజేపీలోని కోవర్టుల వల్లే అప్పుడు అలా జరిగిందని ఇంకొందరు చర్చను ముందుకు తీసుకెళ్తున్నారట. ఈటల బీజేపీ గురించి నేరుగా చెప్పకపోయినా.. అన్నీ పార్టీల్లోనూ కేసీఆర్ మనుషులు ఉన్నారనే కామెంట్స్.. రానున్న రోజుల్లో బీజేపీలో ప్రకంపనలు సృష్టించే అవకాశాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
బీజేపీలో ఒకరినొకరు అనుమానంగా చూసుకుంటున్నారా?
ఈ మధ్య కాలంలో బీజేపీలో చేరింది ఎవరు? వారి ప్రవర్తన ఎలా ఉంది? అలాగే సుదీర్ఘకాలం బీజేపీలో ఉన్నప్పటికీ.. కదలికలు అనుమానాస్పదంగా ఉన్నవారు ఎవరు? అని పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఈటల కామెంట్స్ తర్వాత కేసీఆర్ మనుషులు ఎవరో అనే దానిపై బీజేపీలో ఒకరినొకరు అనుమానంగా చూసుకుంటున్నారట. ఈటల రాజేందర్ బీజేపీలో చేరికల కమిటీ ఛైర్మన్. ఆయన బాధ్యతలు చేపట్టాక చాలా మంది బీజేపీలో చేరతారని అనుకున్నారు. కానీ.. అనుకున్న స్థాయిలో పురోగతి లేదు. బహుశా ఆ ప్రయత్నాలు అధికారపార్టీకి తెలిసి.. ముందడగు పడటం లేదని అనుమానించి ఉంటారని.. అదీ బీజేపీలోని కేసీఆర్ మనుషుల వల్లే విషయాలు లీకవుతున్నట్టు ఈటల సందేహించి ఉండొచ్చని చర్చ సాగుతోంది. మరి.. ఏ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈటల ఆ కామెంట్స్ చేశారో కాలమే చెప్పాలి.

