Site icon NTV Telugu

Off The Record: ఆ మాజీ ఎమ్మెల్యే పార్టీకి బై చెబుతారా?

Maxresdefault (1)

Maxresdefault (1)

ఆ మాజీ ఎమ్మెల్యే వైసీపీని వీడనున్నారా? | Ntv Off The Record

ఆయన మాజీ ఎమ్మెల్యే. అధికారపార్టీతో టచ్‌ మీ నాట్‌ పొజిషన్‌లోకి వెళ్లిపోయారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికే చూపు మారిందని టాక్‌. అయితే ఆయన ఏ కండువా కప్పుకొంటారు? బనగానపల్లెలో చర్చగా మారిన ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు?

2004 నుంచి నియోజకవర్గానికి దూరం..!
బిజ్జం పార్థసారథిరెడ్డి. గతంలో పాణ్యం ఎమ్మెల్యే. ఉమ్మడి కర్నూలు జిల్లాలో బలమైన కేడర్‌ ఉన్నప్పటికీ.. సొంతం మండలం అవుకులో జరుగుతున్న వైసీపీ కీలక సమావేశాలకు డుమ్మా కొట్టేస్తున్నారు. దీంతో బనగానపల్లె నియోజకవర్గంలో బిజ్జం పాత్ర ఏమిటనే చర్చ జరుగుతోంది. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2004 తర్వాత నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ కండువా కప్పుకొన్నారు. సీఎం జగన్ వస్తేనో లేక ముఖ్య సమావేశాలు ఉంటేనో కనిపించేవారు ఈ మాజీ ఎమ్మెల్యే.

రాజకీయ భవిష్యత్‌పై అనుచరులతో చర్చ
కొంతకాలంగా బనగానపల్లెలో తన వర్గానికి చెందిన సన్నిహితులతో రాజకీయ భవిష్యత్తుపై చర్చిస్తున్నారట బిజ్జం. పార్టీ మారే విషయంపై ఆలోచిస్తున్నారట. అందుకే వైసీపీ మీటింగ్‌కు రాకపోవడంతో అందరి ఫోకస్‌ ఈ మాజీ ఎమ్మెల్యేపైనే ఉంది. ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం క్రమంగా ఊపందుకుంటోంది. 2005లో బిజ్జం-కాటసాని కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ రాజకీయాల వైరం లేకుండా రాజీ జరిగింది. అప్పటి నుంచి బిజ్జం క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. 2014 ఎన్నికల్లో తన బంధువైన టిడిపి అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డికి మద్దతుగా నిలిచారు కూడా. 2019 ఎన్నికల ముందు జరిగిన అనూహ్య పరిణామాలతో ఆయన వైసీపీలో చేరారు.

మళ్లీ పోటీ చేయాలనే ఆలోచనకు వచ్చారా?
2019 ఎన్నికల్లో కాటసాని రామిరెడ్డికి మద్దతుగా బనగానపల్లె ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు బిజ్జం. ఆ తర్వాత వైసీపీ కార్యక్రమాల్లోనూ కొద్దిరోజులు తళుక్కుమన్నారు. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచన వచ్చిందో ఏమో.. వైసీపీకి దూరంగా ఉంటూ టీడీపీకి చేరువ అవుతున్నారనే ప్రచారం మొదలైంది. ఆయన టీడీపీ ముఖ్యనేతలను కలిసినట్టు సమాచారం లేకపోయినా ప్రచారం అయితే ఆగడం లేదు. నంద్యాల ఎంపీగా పోటీ చేసే అంశాన్ని బిజ్జం పరిశీలిస్తున్నారట. బనగానపల్లెలో ఇప్పటికే ఎమ్మెల్యే కాటసాని వర్సెస్‌ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బీసీ జనార్దన్ రెడ్డి అన్నట్టు ఉంది. దీనికితోడు ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో రచ్చ కూడా నియోజకవర్గంలో వాడీవేడీ చర్చగా ఉన్నాయి.

బిజ్జం పోటీ చేస్తే సమీకరణాలు మారతాయా?
ఎన్నికల్లో బిజ్జం పోటీ ఖాయమన్నప్రచారం 2004 నుంచి ఉన్నదే. కానీ.. ఆయన బయట పడిన దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందా? లేక మళ్లీ సైకిల్‌ ఎక్కి అసెంబ్లీకి పోటీ చేస్తారా? లోక్‌సభ బరిలో ఉంటారా అనేది సస్పెన్స్‌. కాకపోతే ఆయన పోటీ చేస్తే సమీకరణాల్లో వచ్చే మార్పుపై చెవులు కొరుక్కుంటున్నారు స్థానిక రాజకీయ నేతలు.

Exit mobile version