ఆ పదవికి అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. ఉన్నత స్థానాల్లో పని చేసిన సీనియర్ IASలే ఆ కుర్చీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మాజీ CSలు సైతం ఎవరికి వారుగా లాబీయింగ్ చేస్తున్నారు. ఇంతకు ఏంటా పదవి? ఆ కుర్చీకి ఉన్న ప్రాధాన్యం ఏంటి? ఆ కుర్చీ ఖాళీగా ఉండటం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులేంటి?
రెరా ఛైర్మన్ పదవి కోసం దరఖాస్తుల వెల్లువ
ఆ పదవి మరేదో కాదు.. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ – రెరా ఛైర్మన్. ఒక్క ఛైర్మనే కాదు.. రెరాలోని సభ్యుల నియామకం కోసం కూడా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. చైర్మన్ పదవి కోసమైతే రిటైర్డ్ సీనియర్ IAC అధికారులు క్యూ కట్టారు. సభ్యులుగా తమకు అవకాశం వస్తుందన్న ఆశతో రిటైర్మెంట్‌కు దగ్గర పడ్డవాళ్లు సైతం ఓ కర్చీఫ్ వేస్తున్నారు. రెరా పదవులకు దరఖాస్తులు చేసుకునే గడువు ఫిబ్రవరి 17తోనే ముగిసింది. తాజాగా ఆ గడువును మార్చి 3 వరకు పొడిగించారు. రాష్ట్రంలో 2017 నుంచి అమల్లోకి వచ్చిన రెరా చట్టానికి పూర్తిస్థాయి అథారిటీని నియమించలేదు. ప్రస్తుతం రెరా చైర్మన్‌తోపాటు ఇద్దరు పూర్తిస్థాయి డైరెక్టర్ల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
రెరా తొలి ఛైర్మన్‌గా ఉన్న రాజేశ్వర్ తివారీ..!
ప్రస్తుతం చైర్మన్ పదవికి మాజీ సీఎస్‌లతోపాటు పలువురు మాజీ IASలు పోటీపడుతున్నారు. వారిలో ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ ప్రభుత్వ సలహాదారు ఎస్‌కె జోషి, మాజీ సిఎస్ సోమేష్‌కుమార్, ప్రస్తుతం ఎంఏయూడి డైరెక్టర్ పనిచేస్తున్న సత్యనారాయణ గట్టి లాబీయింగే చేస్తున్నారట. రెరా చట్టానికి 2016లో ఆమోద ముద్ర పడగా.. జూలై 2017 నుంచి తెలంగాణ ప్రభుత్వం దీనిని అమల్లోకి తీసుకొచ్చింది. తొలుత రెరా చైర్మన్‌గా రాజేశ్వర్ తివారీ, సభ్యుడిగా విద్యాధర్‌రావులను ప్రభుత్వం నియమించింది. రాజేశ్వర్ తివారీ రిటైరైన తరువాత సుమారు మూడేళ్లపాటు ఈ పోస్టులో సోమేష్‌కుమార్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. గత ఏడాది అక్టోబర్ వరకు రెరాలో 19 వేల పైచిలుకు ప్రాజెక్టులు నమోదు కాగా 2 వేల 4వందల 48 ఏజెంట్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
అనుమతుల్లేని చోట చర్యలు నిల్..!
స్థిరాస్తి కొనుగోలుదారుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని.. పలు భవన నిర్మాణ సంస్థలు ఇప్పటికీ బేఖాతర్ చేస్తున్నాయి. స్థిరాస్తి నియంత్రణ అథారిటీ అనుమతి తప్పనిసరైనా పట్టించుకోవడం లేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టులు మినహా ఇతరచోట్ల యజమానులు ఆసక్తి కనబర్చడం లేదు. హైదరాబాద్… చుట్టుపక్కలతోపాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పలు జిల్లా కేంద్రాల్లో రెరా అనుమతి లేకుండానే పెద్దసంఖ్యలో అపార్ట్‌మెంట్‌లు, లేఅవుట్లు పుట్టుకొస్తున్నాయి. వరంగల్ నగరపాలక సంస్థ పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టుల్లో 10 శాతం కూడా రెరా అనుమతి పొందడం లేదు. కరీంనగర్, నిజామాబాద్ సహా పలు ప్రధాన పట్టణాలు, జిల్లా కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. రెరా అమలులోకి వచ్చాక వేల వెంచర్లు వేసినా ఇప్పటివరకూ నమోదైనవి సుమారు ఐదు వేలు మాత్రమే. అనుమతి లేని ప్రాజెక్టులపై చట్టంలోని సెక్షన్ 59 ప్రకారం చర్యలు తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మినహా భారీ జరిమానాలు విధించిన దాఖలాలు లేవు. దీంతో చాలామంది బిల్డర్లు, రియల్టర్లు రెరాను పట్టించుకోవడం లేదు. రెరా చట్టాన్ని కఠినంగా అమలు చేసి ప్రజలకు మేలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం నిబంధనలు అతిక్రమించిన కొన్ని సంస్థలకు నెలరోజులుగా రెరా నోటీసులు ఇస్తుండడంతో అందరూ అలర్ట్ అయ్యారు.
కీలక పదవి కావడంతో మాజీ ఐఏఎస్‌ల ఆశ
కీలక అనుమతులకు ఇచ్చేది రెరానే కావడంతో.. రిటైర్డ్ ఐఏఎస్‌లు ఛైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ పెద్దలతో తమకున్న పరిచయాలను దృష్టిలో పెట్టుకుని పావులు కదుపుతున్నారు. ఫలానా మాజీ అధికారికి ఓకే అయినట్టు ప్రచారం జరుగుతున్నా.. స్పష్టత లేదు. ఇటు ఛైర్మన్ లేక.. అనుమతులు లభించక వేల దరఖాస్తులు రెరా ఆఫీసులో పెండింగ్‌లో ఉన్నాయని రియాల్టర్లు గగ్గోలు పెడుతున్నారు. మరి.. పదవుల పందేరంలో ఎవరు రెరా ఛైర్మన్‌గా కొలువు తీరతారో చూడాలి.
