ఆయన ఎంపీగా గెలిచి నాలుగేళ్లు అయినా ఇప్పటికీ నల్లపూసే. నియోజకవర్గ పరిధిలోని కీలక సమస్యలకు స్పందించరనే అభిప్రాయం ఉంది. సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో సఖ్యత లేదన్నది మరో విమర్శ. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆ ఎంపీ విషయంలో పార్టీ అధిష్ఠానం ఓ ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.
గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శ
కోటగిరి శ్రీధర్. ఏలూరు ఎంపీ. ఒకప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పిన కోటగిరి విద్యాధరరావు కుమారుడే శ్రీధర్. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఏలూరు లోక్‌సభ సభ్యుడిగా గెలిచినా.. జనాలతో అటాచ్‌మెంట్ తక్కువ. సొంత పార్టీ ఎమ్మెల్యేలతోనూ అంతంత మాత్రంగానే ఉంటారని చెబుతారు. అందుబాటులో ఉండరనేది మరో పెద్ద విమర్శ. ఎంపీగా గెలిచిన తర్వాత ఏలూరు పార్లమెంట్ పరిధిలో శ్రీధర్ పర్యటించిన సందర్భాలను.. పరిష్కరించిన సమస్యలను వేళ్లమీద లెక్కపెట్టొచ్చని వైసీపీ వర్గాలే కామెంట్స్ చేస్తుంటాయి. ఒకవేళ పర్యటనలకు వెళ్తే అక్కడ గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తారనేది స్థానిక ఎమ్మెల్యేల అభ్యంతరం.
అప్పుడప్పుడూ చింతలపూడి, పోలవరమే వెళ్తున్నారా?
ఏలూరు పార్లమెంట్ పరిధిలో చింతలపూడి, పోలవరం, ఏలూరు, ఉంగుటూరు, నూజివీడు, కైకలూరు, దెందులూరు నియోజకవర్గాలు ఉన్నాయి. ఎంపీ శ్రీధర్ మాత్రం చింతలపూడి లేదా పోలవరం నియోజకవర్గాల్లోనే అప్పుడప్పుడూ కనిపిస్తారనే విమర్శ ఉంది. అదీ కూడా అక్కడ ఆయనకు అనుకూలంగా ఉన్న కొద్దిమందితో మాట్లాడి వెళ్లిపోతారట. ఈ పర్యటనలే గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నాయనేది అక్కడి ఎమ్మెల్యే మాట. ఫలితంగా చింతలపూడి, పోలవరం ఎమ్మెల్యేలు, ఎంపీ మధ్య కోల్డ్‌వార్ నడుస్తోందనేది చర్చ. ఈ సమస్య పార్టీ పెద్దల దృష్టికి వెళ్లడంతో అంతా కలిసి సాగాలని సూచించారట. కానీ.. ఎవరి దారి వారిదే కావడంతో విభేదాలు శ్రుతి మించాయి. ఇప్పుడు వైసీపీ అధిష్ఠానం కూడా సీరియస్‌గా ఉందట. వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి మార్పు తప్పదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యే అభ్యర్థుల్నే మార్చేస్తారని శ్రీధర్ శిబిరం కౌంటర్
ఎంపీ అభ్యర్థి మార్పు ప్రచారానికి కౌంటర్‌గా శ్రీధర్ వర్గం కూడా కొత్త ప్రచారం మొదలు పెట్టినట్టు సమాచారం. ఎంపీతో వైరం పెట్టుకుంటున్న ఎమ్మెల్యేలనే మార్చేస్తారని చర్చకు పెడుతున్నారు. వాటిల్లో చింతలపూడి, పోలవరం మస్ట్‌గా ఉన్నాయని కవ్విస్తున్నారట. పైగా ఎంపీ శ్రీధర్ చెప్పిన వాళ్లకే అక్కడ ఎమ్మెల్యే టికెట్స్ ఇస్తారని ప్రచారం చేస్తున్నారట. దీంతో ఏలూరు పార్లమెంటు పరిధి వైసీపీలో ఎంపీ ఎమ్మెల్యేల మధ్య మొదలైన అంతర్గత కుమ్ములాటలకు ఇప్పట్లో బ్రేక్ పడేలా కనిపించడంలేదు. ఇప్పుడు వైనాట్ 175 అనే లక్ష్యంతో ముందుకెళ్తున్న అధిష్ఠానం.. ఎంపీ సీట్లపైనా ఫోకస్ పెడితే ఏలూరులో అభ్యర్థి మారిపోతారని అనుకుంటున్నారు. అదే జరిగితే శ్రీధర్‌ను ఎక్కడ అకామిడేట్ చేస్తారు? అసలు టికెట్ ఇస్తారా లేదా అనే ప్రశ్నలు ఉన్నాయి.