ఆ ఎమ్మెల్యే తీరు పదే పదే ఎందుకు వివాదాస్పదం అవుతోంది? చీటికి మాటికి చిల్లర గొడవలతో ఎందుకు వార్తలకెక్కుతున్నారు? ఎమ్మెల్సీతో ఆధిపత్య పోరు ఉంటే… ఆ స్థాయిలోనే చూసుకోవాలిగానీ…గ్రామ స్థాయికొచ్చి కొట్లాడితే ఏం ఉపయోగం అనిపించుకుంటున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఎందుకలా చేస్తున్నారు?
భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ముష్టి ఘాతాలు?
వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. అలాగని అదేదో… జనానికి మంచి చేసికాదు. వాళ్ళని ఇబ్బంది పెడుతూ తానేదో హీరో అనిపించుకోవాలనుకుంటున్నారట ఆయన. ఇటీవల ఎమ్మెల్యే చేస్తున్న పనులు గ్రామాల్లో అసహనాన్ని పెంచుతున్నాయట. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయ విరోధం ఉంది. దానికి తోడు స్థానిక భద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో నేతల మధ్య గొడవ జరిగింది. హారతి సమయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని చేతితో నెట్టి వేసే ప్రయత్నం చేశారట. దాంతో ఇద్దరూ కాసేపు రోడ్‌సైడ్ తోపులాట స్థాయిలో తలపడ్డారట.
పని అడిగిన గ్రామస్తుల్ని ఎమ్మెల్యే బెదిరిస్తున్నారా?
కొంత కాలంగా పల్లె పల్లెకు పైలెట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. అందులో భాగంగా బషీరాబాద్ మండలం మైలవరంలో రోహిత్ రెడ్డి వ్యవహార శైలి గ్రామస్థులకు ఆగ్రహం తెప్పించిందట. స్థానిక అక్కలమ్మ చెరువు తూము పనులు నిలిచిపోవడంతో సాగు చేయడం లేదని… సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారని ఎమ్మెల్యేని ప్రశ్నించారట గ్రామస్తులు. అయితే పరిష్కారం
చెప్పకుండా, ప్రశ్నించిన వారిని స్టేజి దిగిపోవాలని వార్నింగ్ ఇవ్వడం, పోలీసులను పురమాయించి మరీ కిందికి దింపడంపై కోపంతో ఉన్నారట గ్రామస్తులు. నిరుడు కూడా ఇలాంటి ఘటనే జరిగింది.ఇదే మండలంలోని క్యాద్గిర సర్పంచ్ ను ప్రజల మధ్యలోనే ఎమ్మెల్యే బెదిరించారు. అభివృద్ధికి అడ్డుపడితే చూస్తూ ఊరుకోను అంటూ చిందులు వేశారు. పీడీ యాక్ట్ పెట్టిస్తానంటూ బెదిరించారట ఎమ్మెల్యే.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య బహిరంగ సవాళ్ళు
అటు తాండూరు బీఆర్ఎస్‌లో రోజు రోజుకు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మధ్య వర్గ పోరు పెరుగుతోంది. నువ్వెంత అంటే నువ్వెంత అని వేదికల మీదే కొట్లాడుకుంటున్న ఘటనలు ఉన్నాయి. బయటికి రా చూసుకుందాం అంటూ ఒకరికొకరు సవాళ్ళు విసురుకుంటున్నారు. గొట్టిగఖుర్దులో పల్లె పల్లెకు పైలెట్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి… సమావేశంలో ఎమ్మెల్సీ వర్గానికి చెందిన గ్రామ ఉప సర్పంచ్‌కు స్టేజీ మీద కుర్చీ ఇవ్వలేదని సర్పంచే ఆగ్రహం వ్యక్తం చేశారట. బహిరంగంగా ఎమ్మెల్యే ముందే స్థానిక నాయకులు తిట్టుకుంటూ బయటికి వచ్చేశారట. దీంతో కార్యక్రమం ప్రారంభించకుండానే ఎమ్మెల్యే వెళ్ళిపోయారట. రోహిత్‌రెడ్డి చేసిన పనికి స్థానిక నాయకులు కొట్టుకుని చొక్కాలు చించుకున్నారట. కక్షపూరితంగానే ఎమ్మెల్యే వర్గీయులు ఎమ్మెల్సీ మనుషులను అవమానిస్తున్నారని , ప్రోటోకాల్ పాటించడం లేదని అసహనంగా ఉన్నారట మహేందర్‌రెడ్డి వర్గీయులు.
ప్రచారం కోసమే ఎమ్మెల్యే అలా చేస్తున్నారా?
నియోజకవర్గంలో జరుగుతున్న వరుస సంఘటనలు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రచారం కోసం చేయిస్తున్నారా? లేక కాకతాళీయంగా జరుగుతున్నవా అన్నది అర్ధం కావడం లేదని వాపోతున్నారట స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు. ఇది పార్టీకి నష్టం చేస్తుందని టెన్షన్ పడుతున్నారట. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మీద పైచేయి సాధించాలంటే… వేరే మార్గాలున్నాయని, ఇలా గ్రామ స్థాయిలో సిల్లీగా గొడవలు పెట్టుకుంటే నష్టమే తప్ప ఏం ఉపయోగం అంటున్నారట పార్టీ నేతలు.

