నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలే సుప్రీం. ఇది అధికారపార్టీ BRS ఆదేశం. కానీ.. ఆ సెగ్మెంట్‌లో ఎమ్మెల్యే బొమ్మ లేకుండా పోస్టర్లు వెలిశాయి. కులం కార్డును బయటకు తీస్తున్నారు నాయకులు. కళ్ల ముందు ఏం జరుగుతున్నా ఎమ్మెల్యే మౌనం వీడటం లేదు. అధికారపార్టీలో చర్చగా మారిన ఆ నియోజకవర్గం ఏంటి?
ప్రొటోకాల్ పదవుల్లో ఉన్న నేతల మధ్యే జగడం
గద్వాల అసెంబ్లీ సెగ్మెంట్‌లో రాజకీయం ప్రతిరోజు హాట్‌హాట్‌గా ఉంటుంది. పలు సందర్భాల్లో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలితే.. మరికొన్నిసార్లు అధికార పక్షంలోనే వర్గపోరు బట్టబయలైన ఉదంతాలు ఉన్నాయి. తాజాగా బీఆర్‌ఎస్‌లో OC వర్సెస్ BC అన్నట్టుగా రాజకీయం ఉంది. గద్వాలలో వెలిసిన పోస్టర్లు ఆ చర్చకు కారణంగా మారాయి. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి, జడ్పీ ఛైర్‌పర్సన్ సరితా తిరుపతయ్యలకు మొదటి నుంచి సఖ్యత లేదు. కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నా.. పైపైనే నవ్వులు. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి పోటీ చేయాలనేది జడ్పీ ఛైర్‌పర్సన్ దంపతుల ఆలోచనట. ఇది సహజంగానే ఎమ్మెల్యేకు రుచించడం లేదు. ఇద్దరూ ప్రొటోకాల్ పదవుల్లో ఉండటంతో ఎవరి ఎత్తుగడలు వాళ్లవే.
ఎమ్మెల్యే ఫొటో లేకుండా పోస్టర్లు
ప్రస్తుతం చర్చగా మారిన పోస్టర్లు ఇవే. వీటిల్లో జడ్పీ ఛైర్‌పర్సన్ దంపతులు, శాట్స్ ఛైర్మన్ ఆంజనేయులు గౌడ్, మున్సిపల్ ఛైర్మన్ కేశవ్, జడ్పీ మాజీ ఛైర్మన్ బండారి భాస్కర్ ఫొటోలు మాత్రమే కనిపిస్తున్నాయి. మిస్ అయ్యిందల్లా ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఫొటోనే. ఇది కావాలని చేశారా లేక ఇంకేదైనా వ్యూహం ఉందా అనేది పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఈ ఎపిసోడ్‌లో మరో ప్రత్యేకత కూడా ఉంది. పోస్టర్లలో కనిపిస్తున్న వాళ్లంతా బీసీ సామాజికవర్గాలకు చెందిన నాయకులు. ఎమ్మెల్యేపై రాజకీయ వైరం ఉండటంతో.. బీసీ కార్డును ఆయుధంగా చేసుకుని బీఆర్‌ఎస్‌లోని మిగతా నేతలను పోగేసినట్టుగా చర్చ సాగుతోంది. దీంతో గద్వాల అధికారపార్టీలో ఓసీ వర్సెస్ బీసీ అన్నట్టుగా నేతల వైరం శ్రుతి మించిందని అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం పార్టీలో ఏ ఇద్దరు కలిసినా దీనిపైనే చర్చ.
పార్టీలోని ప్రత్యర్థుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం
పోస్టర్లపై ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అండ్ టీమ్ కారాలు మిరియాలు నూరుతోందట. తాను అన్ని కులాలను సమానంగా చూస్తుంటే.. ఈ జగడాలేంటని ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారట. నేతల మధ్య దూరం తీసుకురావడానికి కొందరు విఫలయత్నం చేస్తున్నారనేది ఆయన ఆరోపణ. ఇతర పార్టీలతో టచ్‌లో ఉన్న బీఆర్‌ఎస్ నాయకులు ఎవరో తనకు, ప్రజలకు తెలుసని చురకలు వేస్తున్నారు ఎమ్మెల్యే. ఈ రగడపై జడ్పీ ఛైర్‌పర్సన్ దంపతులు కూడా స్పందించారు. ఎమ్మెల్యే ఫొటో లేకుండా పోస్టర్లు వేసింది ఎవరో తమకు తెలియదని చెబుతున్నారు. ఎమ్మెల్యే వర్గం చూపంతా సరితా తిరుపతయ్య మీదే ఉందట. మొత్తానికి ఎన్నికల వేళ గద్వాల గులాబీ తోటలో కులం కార్డుల ప్రయోగం కలకలం రేపుతోంది.
