NTV Telugu Site icon

Off The Record: వలస నేతల్లో ముదురుతున్న రచ్చ

Mingle

Mingle

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో వలస నేతలపై ముదురుతున్న రచ్చ..! | OTR | Ntv

వాళ్లంతా వలస నేతలు. సొంత పార్టీని వదిలి రాజకీయ భవిష్యత్‌ కోసం మరో జెండా పట్టుకున్నారు. కొత్త చోట కీలక పదవులు చేపట్టినా.. రోజులు గడుస్తున్నా మింగిల్‌ కావడం లేదట. వాళ్లు ఇబ్బంది పడుతున్నారో.. లేక ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారో ఏమో.. తరచూ చర్చల్లోకి వస్తున్నారు? ఇంతకీ ఎవరా నాయకులు?

రెండు పార్టీలలోనూ పాత టీడీపీ నేతల చుట్టూ చర్చ
తెలంగాణలో టీడీపీ పెద్దగా ఉనికిలో లేకపోయినా.. ఒకప్పుడు ఆ పార్టీలో రాజకీయంగా ఎదిగి.. ప్రస్తుతం అధికార బీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్‌ పార్టీల్లో ఉన్నారు పలువురు నేతలు. పరిస్థితులు అనుకూలించి కొందరు తమ ఎమ్మెల్యే పదవులను కాపాడుకుంటే.. మరికొందరికి పార్టీ, ప్రభుత్వాల పరంగా రాజకీయంగా పదోన్నతి దక్కింది. ప్రస్తుతం తాము ఉన్న పార్టీలో మంచి పొజిషన్‌లో ఉన్నప్పటికీ ఇమడలేని పరిస్థితి కొందరిది. అక్కడి పరిణామాలు అనుకూలించడం లేదో.. లేక రాజకీయ వ్యూహాలు బెడిసి కొడుతున్నాయో కానీ చర్చల్లో వ్యక్తులుగా మారుతున్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతున్న రచ్చంతా ఒకప్పటి టీడీపీ నేతల చుట్టూనే కావడంతో.. వారిపై ప్రత్యేక ఫోకస్‌ పడుతోంది.

కాంగ్రెస్‌లో అసలు, వలస నేతల మధ్య విభజన రేఖ
టీ కాంగ్రెస్‌లో తాజా రగడంతా టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారనే. ఓపెన్‌గానే ఆ విషయంపై కామెంట్స్‌ చేస్తున్నారు పాత కాంగ్రెస్‌ సీనియర్లు. ఇటీవల పీసీసీ కమిటీలలోనూ వలస నేతలకే పదవులు ఇచ్చారని అభ్యంతరాలు తెలిపారు. ఆ విమర్శలకు నోచ్చుకున్నారో ఏమో.. మా వల్లే సమస్య అనుకుంటే.. ఆ పదవులు వద్దని టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన 12 మంది తమ పోస్టులకు రాజీనామా చేశారు. టీడీపీ నుంచి వచ్చినా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేసి గెలిచినవాళ్లు.. ఓడిన వాళ్లు ప్రస్తుతం కాంగ్రెస్‌ నేతలుగా చెలామణి అవుతున్నా వలస నేతలు అనే విభజన రేఖ అలాగే ఉండిపోయింది. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పటికీ అదే రగడ.

బీఆర్‌ఎస్‌లో తిట్టుకుంటున్న నేతలు ఒకప్పటి టీడీపీవాళ్లే..!
అధికారపార్టీ బీఆర్‌ఎస్‌లోనూ ఇదే తంతు. తాజాగా మంత్రి మల్లారెడ్డిపై ముప్పేటదాడి చేసిన ఎమ్మెల్యేలలో అత్యధికులు టీడీపీ నుంచి వచ్చి గులాబీ కండువా కప్పుకొన్న నేతలే. మల్లారెడ్డి సైతం దేశం గూటి నుంచి వచ్చిన నాయకుడే. దీంతో గులాబీ శిబిరంలోని పాత టీడీపీ నేతల తీరు చర్చల్లోకి వస్తోంది. మంత్రి మల్లారెడ్డిపై అసమ్మతి గళం విప్పిన ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, మాధవరం కృష్ణారావు, వివేక్‌గౌడ్‌, అరికెపూడి గాంధీలు ఒకప్పుడు టీడీపీలో కలిసి పనిచేసినవారే. అధికారపార్టీలో టీడీపీ నుంచి వచ్చినవాళ్లు అనే విభజన రేఖ లేదు. కాకపోతే ఓపెన్‌గా గళమెత్తిన నాయకులు పూర్వాశ్రమం పసుపు శిబిరం కావడం.. ఇదే సమయంలో టీ కాంగ్రెస్‌లోనూ పదవుల రగడ చర్చకు రావడంతో వీళ్లకేమైంది? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నింటిలోనూ టీడీపీ నుంచి వచ్చిన నాయకులు ఉన్నారు. కానీ.. ఈస్థాయిలో వాళ్లు చర్చల్లోకి వచ్చిన సందర్భం ఇదే. మరి.. రెండు ప్రధాన పార్టీలు ఈ కల్లోల్లానికి నేర్పుగా తెరదించుతాయో.. లేక జగడం మరింత ముందుకు వెళ్తుందో కాలమే చెప్పాలి.