పిలుపు రావడమే ఆలస్యం.. తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు హస్తిన బాట పట్టారు. ఎందుకు రమ్మన్నారో తెలియదు. కాకపోతే అమిత్ షా పిలిచారని చెప్పడంతో ఒకింత ఉత్కంఠ నెలకొంది. మోటా భాయ్ ఎందుకు పిలిచారు.. మీకేమైనా తెలుసా అని ఒకరినొకరు ఆరా తీసుకుంటున్నారు. బీజేపీ నేతలకు ఢిల్లీలో షాక్ ట్రీట్మెంట్ తప్పదా.. అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు ఢిల్లీ రావాలని పిలుపు
అసెంబ్లీ ఎన్నికలు.. స్ట్రీక్ కార్నర్ మీటింగ్స్‌తో బిజీగా ఉన్న తెలంగాణ బీజేపీ నేతలకు.. ఢిల్లీలోని పార్టీ పెద్దల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఉన్నపళంగా హస్తిన రావాలని చెప్పడంతో రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు కీలక నాయకులు. వాస్తవానికి స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ల ముగింపు సభను మంగళవారం ఘనంగా నిర్వహించాలని.. ప్రతి నియోజకవర్గంలో సభలు పెట్టాలని ముందుగా అనుకున్నారు. ఈ సభలకు బీజేపీ ముఖ్య నేతలు హాజరయ్యేలా షెడ్యూల్ కూడా ఖరారైంది. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకున్నారు లీడర్స్. అంతా ఈ హడావిడిలో ఉండగా.. ఢిల్లీ నుంచి వచ్చిన ఒకే ఒక్క ఫోన్ కాల్ మొత్తం సీన్ మార్చేసింది.
ఢిల్లీ మీటింగ్‌పై బీజేపీ వర్గాల్లో ఊహాగానాలు
ఇంతకీ బీజేపీ ముఖ్య నేతలను ఢిల్లీ రావాలని ఎందుకు పిలిచారు? అజెండా ఏంటి? ఏం మాట్లాడతారు? అసెంబ్లీ ఎన్నికలకు కీలక సూచనలు చేస్తారా? ఢిల్లీ పెద్దలు సొంతంగా నిర్వహించిన సర్వే ఫలితాల ఆధారంగా రణతంత్రం ఉంటుందా? లేక తలంటుతారా? ఇలా తెలంగాణ కమలనాథులు రకరకాలుగా ఊహించుకుంటున్నారు. లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ తరుణంలో అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలను ఢిల్లీ పిలిచారని కొందరు భావిస్తున్నారు. ఆ కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలో కూడా ఉండటంతో.. రాష్ట్రంలో ఎదురయ్యే పరిస్థితులు.. వాటిని ఫేస్ చేయడంపై చర్చిస్తారని మరికొందరి అభిప్రాయం.
అసెంబ్లీ ఎన్నికలపై చర్చిస్తారా?
ఇటీవల అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు బీజేపీ ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. అప్పుడే మరోసారి మనం భేటీ కావాలని ఆయన్ను నేతలు అడిగారట. దానికోసమే పిలిచారన్నది కొందరి మాట. ఇటు చూస్తే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. కీలక నేతలు సమన్వయంతో పనిచేయాల్సి ఉండటంతో.. నాయకుల మధ్య ఉన్న గ్యాప్ తగ్గించే పని చేస్తున్నారని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల వరకు బండి సంజయ్యే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అని ఇటీవల ఓ ప్రకటన చేసినా.. ఆ అంశంపై కూడా చర్చ ఉండొచ్చని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయట.
అందరినీ రావాలని చెప్పడంతో ఉత్కంఠ
ఈ మధ్య ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రెండు రోజులు ఢిల్లీలోనే ఉండి పార్టీ అగ్రనేతలను కలిసి వచ్చారు. ఏదైనా సమాచారం కావాలంటే ఒకరో ఇద్దరు నాయకులను హస్తిన పిలిపించుకుని మాట్లాడుతున్నారు కూడా. ఈ దఫా అలా కాకుండా ముఖ్య నేతలందరినీ ఢిల్లీ రావాలని చెప్పడంతో ఎక్కడలేని ఉత్కంఠకు దారితీస్తోంది. మొత్తానికి ఢిల్లీ అజెండా ఏంటో.. ఏమో, అమిత్‌షా సమావేశం కానుండటంతో అందరి దృష్టీ హస్తినపై పడింది.

