Off The Record : వెంకటగిరి వైసీపీలో వర్గపోరు.. ఇన్‌చార్జ్‌కు నేతల సహకారం కరువు?

  • వైసీపీ ఇన్ఛార్జ్‌ నేదురుమల్లికి సొంత నేతల సహాయ నిరాకరణ..
  • టచ్‌ మీ నాట్‌ అన్నట్టుగా ఒకరిద్దరు పార్టీ సీనియర్స్‌..
  • వెంకటగిరి రాజా సర్వజ్ఞ యాచేంద్ర దూరం దూరం..
  • మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ భానుప్రియ వర్గం కూడా సైలెంట్‌..
  • వెంకటగిరి రాజాకు మైనింగ్‌ వ్యాపారాలు..
  • యాచేంద్ర ఎంపీ వేమిరెడ్డికి సన్నిహితంగా ఉంటున్నారా?..
  • మంత్రి ఆనంతో భానుప్రియ వర్గానికి సాన్నిహిత్యం?..
  • యాచేంద్రను టీడీపీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు?..
  • వైసీపీ అధిష్టానం పట్టించుకోవడం లేదని రామ్‌కుమార్‌రెడ్డి ఫ్రస్ట్రేషన్‌ ..
Otr Ysrcp Venkatagiri

Otr Ysrcp Venkatagiri

Off The Record: సింహపురి రాజకీయాలు ఎప్పుడు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. ఒక పార్టీలో ఉండగానే… మరో పార్టీ టిక్కెట్ కోసం ఖర్చీఫ్‌ వేసేవాళ్లు ఇక్కడ ఎక్కువేనని అంటారు. సొంత పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటూ.. అధికారంలో ఉన్నవాళ్ళకు దగ్గరయ్యే బ్యాచ్‌ కూడా స్పెషల్‌. ప్రస్తుతం వెంకటగిరి వైసీపీలో ఇలాంటి పరిస్థితే ఉందట. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఓడిపోయారు. ప్రస్తుతం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్‌గా ఉన్నారాయన. అయితే నేదురుమల్లికి సొంత పార్టీ నేతలే సహకరించట్లేదన్న ప్రచారం జరుగుతోంది. ఫ్యాన్ కింద ఉంటూనే.. కనీసం పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదట కొందరు. పార్టీ అధ్యక్షుడు జగన్‌కు రామ్‌కుమార్‌రెడ్డి దగ్గరగా ఉంటారన్న పేరుంది. అందుకే…గత ఎన్నికల్లో ఓటమి తరువాత.. ఆయనకే నియోజకవర్గ బాధ్యతలు అప్పగించినట్టు చెబుతారు.ఈ క్రమంలో పార్టీకి దూరంగా ఉండేవారిని కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నా.. ఒకరిద్దరు నేతలు ఆయనతో టచ్‌ మీ నాట్‌ అన్నట్టు ఉంటున్నారట.
అదే సమయంలో ఇన్ఛార్జ్‌ సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న విమర్శలు సైతం ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో… ఇన్ఛార్జ్‌కు ఝలక్‌ ఇస్తున్నారట ఒకరిద్దరు సీనియర్స్‌. వెంకటగిరి రాజా… సర్వజ్ఞ యాచేంద్రతో పాటు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ నక్కా భాను ప్రియ వర్గం దూరంగా ఉంటోందట. రాజు కుటుంబీకులు నేదురుమల్లితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ.. తాము ఇప్పుడే పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేమని, కొంత టైం కావాలని చెప్పినట్టు తెలిసింది.

అయితే వాళ్ళు తమ రీజన్‌ తాము చెబుతూనే…. సొంత వర్గాన్ని తయారు చేసుకుంటున్నారన్న చర్చ ఫ్యాన్ పార్టీలో జరుగుతోంది. వెంకటగిరి రాజా కుటుంబానికి మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయి. ఆ ప్రభావంతో వారు టీడీపీ ఎంపీ వేమిరెడ్డితో టచ్‌లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఎంపీ చెప్పడం వల్లే యాచేంద్ర కుటుంబీకులు ఫ్యాన్ పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు హాజరు కావడం లేదన్న ప్రచారం వెంకటగిరిలో గట్టిగానే జరుగుతోంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న చిన్న రాజా వారు…. స్థానిక వైసీపీ నేతలతో కలిసి ప్రైవేట్ కార్యక్రమాలకి మాత్రం హాజరవుతున్నారట. ఓవైపు టిడిపి నేతలకు టచ్‌లో ఉండటం.. మరోవైపు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండటం లాంటివి ఇన్ఛార్జ్‌ నేదురుమల్లికి నచ్చడం లేదట. అటు భానుప్రియ వర్గం కూడా వైసీపీకి దూరంగా ఉంటూ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నట్టు సమాచారం. మున్సిపల్ ఛైర్‌పర్సన్‌పై అధికార పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు రామ్ కుమార్ రెడ్డి సీరియస్‌గా తీసుకుని అది వీగిపోయేలా పావులు కదిపారని, ఆ వర్గానికి ఆ మాత్రం విశ్వాసం కూడా లేకుండా పోయిందంటూ ఇన్ఛార్జ్‌ సన్నిహితులు మాట్లాడుకుంటున్నారు. ఇలా…. నియోజకవర్గంలో పార్టీ ముఖ్య నేతల సహకారం లేకపోవడంతో రాంకుమార్ రెడ్డి తీవ్రంగా ఫ్రస్ట్రేట్‌ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు ఆ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశాలు లేవనేది స్థానికంగా వినిపిస్తున్న మాట.

ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే.. పార్టీ జిల్లా నాయకత్వం.. సర్వజ్ఞ యాచేంద్రను టీడీపీలోకి ఆహ్వానించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆయన కూడా వైసీపీ కార్యక్రమాలకి దూరంగా ఉండటం, టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం లాంటివి వ్యూహంలో భాగమే అయి ఉండవచ్చంటున్నారు. ఇంత జరుగుతున్నా.. పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్న వారిని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయడం లేదట వైసీపీ పెద్దలు. వాళ్ళు ఎక్కడికి పోతారులే….. కొద్ది రోజులు కామ్‌గా ఉంటారు, మళ్ళీ యాక్టివ్‌ అవుతారన్నట్టు లైట్ తీసుకుంటోందట. అదే నియోజకవర్గానికి చెందిన ఒకరిద్దరు నేతలు డిస్టర్బ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా…వైసీపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకోవడం లేదట. దీంతో నేతల ప్రవర్తనపై ఇన్చార్జ్ రామ్‌కుమార్ రెడ్డిలో అసహనం పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. ఇలాగే వదిలేస్తే దీని ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల మీద పడుతుందన్నది వైసీపీ కేడర్‌ భయం.