Site icon NTV Telugu

Off The Record: ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి అతుకుల బొంతల మారుతుందా..?

Gnt Ysrcp

Gnt Ysrcp

Off The Record: ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి దారుణంగా ఉందంటున్నారు. బలం ఉన్న చోట కూడా దాన్ని చాటుకోలేకపోతున్నామంటూ జిల్లా నేతల మీద కేడర్‌లో అసహనం పెరిగిపోతోందట. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం మున్సిపాలిటీలతోపాటు గుంటూరు కార్పొరేషన్‌ను తన ఖాతాలో వేసుకుంది. అటు ఎంపీటీసీ, జడ్పీటీసీలదీ అదే పరిస్థితి. కార్పొరేషన్ పరిధిలో 57 డివిజన్లు ఉంటే… అందులో 46 డివిజన్స్‌ని దక్కించుకుంది వైసీపీ. ఇక ఉమ్మడి జిల్లా మొత్తం 57 జడ్పీటీసీ స్థానాలుంటే వాటిలో 53 ఫ్యాన్‌ పార్టీ ఖాతాలో పడ్డాయి. దీంతో కొల్లిపర నుంచి గెలిచిన కత్తెర హెనీ క్రిస్టినా జడ్పీ ఛైర్‌పర్సన్‌ అయ్యారు. అయితే అదంతా గతం. ఇక ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మొత్తం 17 అసెంబ్లీ, మూడు ఎంపీ సీట్లను స్వీప్‌ చేసేసింది కూటమి. ఇక అప్పటి నుంచి జిల్లా వైసీపీకి కష్టాలు మొదలయ్యాయి.

ఎమ్మెల్యే ఎంపీ సీట్లు గెలవలేకపోయారు సరే… ఉన్న పదవులను అయినా కాపాడుకోగలుగుతున్నారా అంటే అదీ లేదు. గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో వైసీపీకి పూర్తిబలం ఉన్నా మేయర్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. మేయర్ కు, నాయకులకు మధ్య సమన్వయ లోపం, ఎవరికి వారు మాకెందుకులే అని చేతులెత్తేయడంతో మేయర్‌ పీఠం కూటమికి దక్కింది. పైకి మాత్రం పోరాడుతున్నట్లు కలరింగ్ ఇచ్చిన జిల్లా వైసీపీ నేతలు…. తీరా టైం వచ్చినప్పుడు పట్టించుకోకుండా కాడి పడేయడంతో… మెజార్టీ కార్పొరేటర్స్‌ టీడీపీ పంచన చేరారు. ఇదే సమయంలో మేయర్‌గా ఉన్న కావటి మనోహర్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో టీడీపీకి తేలిగ్గా లైన్‌ క్లియర్‌ అయినట్టయింది. అప్పట్లో దీని గురించి వైసీపీలో చాలా పెద్ద చర్చే జరిగింది. ఇక జిల్లా పరిషత్‌ విషయానికి వస్తే… ఛైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా ఎన్నికలకు ముందే టీడీపీ గూటికి చేరిపోయారు. ఇక ఎలక్షన్‌ తర్వాత వైసీపీ జడ్పీటీసీలు కనీసం జిల్లా పరిషత్‌ మీటింగ్స్‌కు కూడా వెళ్లకుండా దూరంగా ఉన్నారు. దాంతో కోరం లేక మూడు సార్లు సమావేశాలు వాయిదా పడ్డాయి. జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, వైసీపీ సభ్యులు ఉన్నచోట్ల బిల్లులు మంజూరు చెయ్యడంలేదన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారాన్ని జిల్లా అధ్యక్షుడితో పాటు పార్టీలో కీలకంగా ఉన్న నాయకుల దృష్టికి తీసుకువెళ్లి అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదట. ఎన్నికలకు ముందే 12మంది జడ్పీటీసీలు టీడీపీలో చేరారు.

దీంతో జిల్లా పరిషత్‌లో వైసీపీ బలం 41కి తగ్గింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినవారిపై అవిశ్వాసం పెట్టాలంటే నాలుగేళ్లు పూర్తవ్వాలన్న నిబంధన ఉంది. ఆ లెక్కన చూసుకున్నా… సెప్టెంబర్ 25తో నాలుగేళ్లు పూర్తయ్యాయి. కూటమి నేతలు ఇతర జిల్లాల్లో పలు చోట్ల అవిశ్వాసాలు పెట్టి పీఠాలు దక్కించుకున్న క్రమంలో… గుంటూరులో మనం కూడా అదే పని చేద్దామని కొందరు వైసీపీ జడ్పీటీసీలు భావించారట. రొంపిచర్ల జడ్పీటీసీ ఓబుల్ రెడ్డి అయితే…అవిశ్వాసం పెడతామని ఓపెన్‌గా ప్రకటించారు కూడా . సాధారణంగా… అవిశ్వాసం పెట్టాలంటే… తీర్మానంపై సభ్యుల్లో టూ థర్డ్ సంతకాలు చేయాల్సి ఉంటుంది. గుంటూరు జడ్పీలో వైసీపీకి 41మంది సభ్యులున్నారు. ఆ లెక్కన అవిశ్వాస తీర్మానంపై 36మంది సంతకాలు చేస్తే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ బలమే ఉన్నా… పార్టీ నాయకులు వెనకడుగు వేయడం కొందరు సొంత జడ్పీటీసీలకే నచ్చడం లేదట. అలా ఎందురు నాన్చుతున్నారంటే… జిల్లాలో ఉన్న కొంతమంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సపోర్ట్‌ చేయడం లేదన్నది సమాధానం. నాయకుల మధ్య సమన్వయలోపమే అసలు సమస్య అంటున్నాయి వైసీపీ శ్రేణులు. పార్టీ మారిన ఛైర్మన్‌ను దెబ్బకొట్టాలని జడ్పీటీసీల్లో బలంగా ఉన్నా జిల్లా నాయకుల వైఖరితో వాళ్ళు ముందడుగు వేయలేకపోతున్నారట. దీంతో గుంటూరు జిల్లా పరిషత్‌లో మనది బలమా బలహీనతా అని మాట్లాడుకుంటోంది వైసీపీ కేడర్‌.

Exit mobile version