Off The Record: వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి మౌత్ పీస్‌ల్లాగా మారి… నోటికొచ్చిందే మాట అన్నట్టుగా నాటి ప్రతిపక్షాల మీద చెలగేరిపోయిన సీనియర్స్ కూటమి సర్కార్ వచ్చాక కామ్ అయిపోయారు. కొందరు కంప్లీట్‌గా మ్యూట్ మోడ్ లోకి వెళ్లిపోతే.. మరికొందరు అసలు గాయబ్ అయ్యారు. అసలే ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ.. ఆపైన మాట్లాడే మొనగాళ్ళు ఎవ్వరూ అందుబాటులో లేకపోవడంతో.. గడిచిన ఏడు నెలల్లో వైసీపీకి ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. పార్టీ అధినేత జగన్ మాత్రమే ముందుగా ఓటమి భారం నుంచి బయటకు వచ్చి సమీక్షలతో మొదలు పెట్టి నిరసన కార్యక్రమాల వరకూ ప్లాన్ చేసి పార్టీని ట్రాక్ ఎక్కించే ప్రయత్నంలో ఉన్నారు. సరిగ్గా ఇదే టైంలో కొందరు సీనియర్స్ అన్ మ్యూట్ బటన్ నొక్కడం ఇప్పుడు పార్టీకి కలిసి వచ్చే అంశం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇన్నాళ్ళు స్తబ్దుగా మారిన పార్టీ వాతావరణం తిరిగి సెట్ అవుతోందని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఇటీవలి కాలంలో జిల్లా సమీక్షా సమావేశాల్లో స్పష్టమైన ఆదేశాలిచ్చారట జగన్. సీనియర్స్ అంతా ముందుకు వచ్చి ప్రభుత్వ వైఫల్యాలపై గొంతు విప్పాలన్న ఆదేశాలు మెల్లిగా అమలవుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు.
అదే సమయంలో తొలి ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో… ఎలాంటి కేసులు పెడుతుందోనని భయపడ్డ నేతలంతా… ఇప్పుడు ఇప్పుడిక కుదుటపడుతున్నారని, వాళ్ళలో భయం పోయినట్టు కనిపిస్తోందన్న చర్చ నడుస్తోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. మాజీ మంత్రి అంబటి రాంబాబు రెగ్యులర్‌గా ఏదో ఒక రకంగా యాక్టివ్‌గానే కనిపిస్తున్నారు. పార్టీ తరపున కూటమి ప్రభుత్వానికి ఏ కౌంటర్ ఇవ్వటానికైనా రెడీ అయిపోతున్నారాయన. ఇక ఫైర్ బ్రాండ్ లీడర్ రోజా కూడా వెకేషన్ మూడ్ నుంచి బయటకు వచ్చినట్టే కనిపిస్తోందని అంటున్నాయి వైసీపీ వర్గాలు. ఈ మధ్య కాలంలోనే తన వాయిస్ వినిపించడంతో పాటు…అవసరమైన సందర్భాల్లో పార్టీ సెంట్రల్ ఆఫీస్‌తో టచ్‌లో ఉంటున్నారట. ఇక గత ప్రభుత్వ హయాంలో కీలకంగా ఉన్న ఆల్ నానీస్‌లో… ఒక నాని ఇప్పటికే పార్టీ వదిలి వెళ్ళిపోగా.. మరొకరు ఇంకా అజ్ఞాతం వీడలేదు. ఇక పేర్ని నాని మాత్రం ఓవైపు ఆయనపై కేసుల హడావుడి నడుస్తున్నా.. అవసరం అనుకున్నప్పుడు తనకు సంభందించిన అంశాలతో పాటు పార్టీ లైన్‌ను కూడా ప్రస్తావిస్తున్నారు.
అటు గుడివాడ అమర్నాథ్, కాకాణి గోవర్ధన్ రెడ్డి లాంటి నాయకులు అవసరమైన సమయాల్లో తమ ఏరియా నుంచే వాయిస్ రెయిజ్ చేస్తున్నారు. వీరితో పాటు మేరుగు నాగార్జున, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, కారుమూరు నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ లాంటి మాజీమంత్రులు కూడా మెల్లిగా లైన్‌లోకి వచ్చేస్తున్నారట.
ఇక మొదట్నుంచి యాక్టివ్‌గానే ఉంటున్న శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సంగతి సరేసరి. ఇలా…మెల్లిగా పార్టీ రీ ఛార్జ్ మోడ్‌లోకి వస్తున్నట్టు కనిపిస్తోందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. గడిచిన ఆరు నెలల్లో కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా, కొన్నిచోట్ల క్యాడర్ గ్రామాలను విడిచి వెళ్తున్నా స్పందించని నియోజకవర్గ ఇంచార్జ్‌లు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు అనూహ్యంగా తిరిగి తెరపైకి వస్తున్నారంటూ హ్యాపీగా ఉందట వైసీపీ అధిష్టానం. ఇక కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పిరియడ్ ముగిసిపోయిందని, ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలును ఆలస్యం చేస్తున్నారంటూ గట్టిగా ప్రచారం చేయడం ద్వారా.. ప్రజల్లో కూడా ఆ భావనను పెంచాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ముఖ్య నేతలు మెల్లిగా మౌనం వీడుతుండటం బాగా ప్లస్ అని భావిస్తున్నారట పార్టీ పెద్దలు. ఇప్పటికే యాక్టివ్ అయిన నేతల సౌండ్‌కు ప్రజల్లో అసంతృప్తి తోడైతే ఇక రీ సౌండ్‌లో మోగిపోతుందని, పార్టీకి నలభై శాతం ఓట్లు వేసిన వాళ్ళని కాపాడుకోవడంతో పాటు…దూరమైన ఇతర వర్గాలను తిరిగి దగ్గర చేసుకునేందుకు దూకుడుగా వెళ్ళాలనుకుంటున్నట్టు సమాచారం. ఈ సౌండ్స్, రీ సౌండ్స్ పార్టీని ఎంతవరకు గాడిన పెడతాయో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.