Site icon NTV Telugu

Off The Record: వైసీపీ కమ్మ రాగాన్ని కొత్త శృతిలో పాడబోతోందా..? ఇంతకీ ఏం చేయబోతుంది పార్టీ..?

Ysrc Kamma

Ysrc Kamma

Off The Record: తర్క వితర్కాలు, పెద్ద పెద్ద చర్చోపచర్చలతో నిమిత్తం లేకుండానే…. ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో పాటు వివిధ వర్గాల్లో ఒక స్థిరమైన అభిప్రాయమైతే ఉంది. అదే… వైసీపీలో కమ్మ కులానికి అంత ప్రాధాన్యం ఉండదని. అలాగే ఆ సామాజికవర్గంలో ఎక్కువ మంది అదే విషయాన్ని నమ్ముతారు కూడా. వాళ్ళతో మాకెలాంటి విభేదాలు లేవని వైసీపీ అధిష్టానం ఒకటికి పదిసార్లు చెప్పినా… అనుమానాలు మాత్రం తొలిగిపోలేదన్నది నిష్టుర సత్యం. అలా ఖచ్చితంగా ఆ సామాజికవర్గానికి, పార్టీకి మధ్య పెద్ద అగాధమే ఉందన్నది విస్తృతాభిప్రాయం. అందుకే ఆ అగాధాన్ని పూడ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టిందట వైసీపీ అధిష్టానం. ఆ ప్రోగ్రామ్‌ని కమ్మ క్యాస్ట్‌ ప్రభావవంతంగా ఉండే ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచే మొదలుపెట్టాలనుకుంటున్నట్టు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కమ్మలకు గతంలో కంటే ఎక్కువ సీట్లు ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. టీడీపీకి, వైసీపీకి మధ్య ఉండే సహజ వైరాన్ని కొందరు కమ్మ కులం మొత్తానికి ఆపాదించి మాట్లాడ్డం వల్లే…. గ్యాప్‌ ఆ స్థాయిలో పెరిగిపోయిందని నిర్ధారించుకున్న ఫ్యాన్‌ పెద్దలు ఆ దిశగా ప్యాచ్‌ వర్క్‌ మొదలుపెట్టారట. గత ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణాజిల్లాలో వైసీపీ అస్సలు ఖాతా తెరవలేదు. మొత్తం 16 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాల్లోనూ ఓడిపోయింది.

అంతకు ముందు 2019లో ఇక్కడ 4 ఎమ్మెల్యే టిక్కెట్స్‌ను కమ్మ సామాజిక వర్గానికి కేటాయించింది వైసీపీ. అందులో ఇద్దరు మాత్రమే గెలిచారు. అప్పట్లో విజయవాడ ఎంపీ సీటును కూడా కమ్మ సామాజిక వర్గానికి కేటాయించినా పరాజయమే పలకరించింది. అయితే.. అప్పుడు అధికారంలోకి వచ్చాక కొడాలి నానికి మంత్రి పదవి ఇచ్చారు. అదే సమయంలో మూడు రాజధానుల నిర్ణయంతో పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా రేగాయి. అమరావతి విషయంలో వైసీపీ వైఖరిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరిగి…ఆ పార్టీ కమ్మ సామాజికవర్గానికి వ్యతిరేకమన్న అభిప్రాయం విస్తృతంగా ప్రచారమైంది. తమకు అలాంటి ఉద్దేశ్యాలు లేవని, అందరూ సమానమేనని పార్టీ నాయకులు పదే పదే చెప్పినా.. పరిస్థితిలో మార్పు రాలేదనేది పొలిటికల్ వర్గాల మాట. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఈ గ్యాప్‌ను తగ్గించటానికి నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టబోతోందట ఫ్యాన్‌ అధిష్టానం. కమ్మ సామాజిక వర్గానికి, తమ పార్టీకి మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారంపై సీఎం పోస్ట్‌లో ఉండగానే స్పందించారు జగన్‌. తన క్యాబినెట్‌లో అదే సామాజిక వర్గానికి చిందిన కొడాలి నాని మంత్రిగా ఉన్నారని, అన్ని వర్గాలు ఓట్లేస్తేనే తాము అధికారంలోకి వచ్చామని కూడా అప్పట్లో చెప్పారన్న విషయాన్ని ఇప్పుడు మళ్లీ గుర్తు చేస్తున్నారు వైసీపీ నేతలు. 2024 ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ ఈస్ట్ నుంచి దేవినేని అవినాష్, గుడివాడ నుంచి కొడాలి నాని, గన్నవరం నుంచి వంశీ పోటీ చేశారు.

అయితే… ఇప్పుడు ఆ సంఖ్యను ఐదుకు పెంచాలని నిర్ణయించారట. అంటే… జిల్లాలో ఈసారి వైసీపీ తరపున కమ్మ సామాజిక వర్గానికి మరో రెండు టిక్కెట్స్‌ అదనంగా ఇస్తారన్న మాట. ఇప్పటికే పెనమలూరు నుంచి దేవభక్తుని చక్రవర్తి, జగ్గయ్యపేట నుంచి తన్నీరు నాగేశ్వర రావులను ఇంచార్జ్‌లుగా నియమించారు. వీటికి అదనంగా విజయవాడ ఎంపీ స్థానాన్ని కూడా గతంలో మూడు సార్లు కమ్మ వారికే ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈసారి కూడా ఎంపీ టిక్కెట్‌ కమ్మ నాయకుడికే ఇవ్వటం ద్వారా మొత్తం ఆరు సీట్లు ఇచ్చినట్టు అవుతుందని, ప్రాధాన్యం ఇస్తున్నామనడానికి అదే నిమగర్శనమని చెప్పాలనుకుంటున్నారట. అలాగే…ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దేవినేని అవినాష్ నియామకం కూడా ప్రయారిటీలో భాగమేనంటున్నారు ఆ పార్టీ నేతలు. మరి మిగతా జిల్లాల్లో, పార్టీ పదవుల్లో ప్రాధాన్యతలు ఎలా ఉంటాయో, కమ్మ సామాజికవర్గం రియాక్షన్‌ ఏంటో చూడాల్సి ఉందని అంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.

Exit mobile version