Off The Record: కుప్పం పాలిటిక్స్ అంటే.. కేరాఫ్ సీఎం చంద్రబాబు నాయుడు. నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలంటే… ఆయన అడ్డా అది.1989 నుంచి మొదలుపెట్టి ఇప్పటి దాకా ఓటమి ఎరగని నేతగా అక్కడ కొనసాగుతున్నారాయన. అలాంటి చోట 2019 ఎన్నికల తర్వాత పెద్ద జర్క్ వచ్చింది. ఇక కుప్పంలో టీడీపీ పని అయిపోయిందన్న ప్రచారాన్ని పెద్ద ఎత్తున జనంలోకి తీసుకేళ్ళే ప్రయత్నం చేసింది వైసీపీ. కట్ చేస్తే… ఇప్పుడు అదే పార్టీ అదే గడ్డ మీద క్లిష్టపరిస్థితుల్లో ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కుప్పం నుంచే 2024లో మళ్ళీ గెలిచి చంద్రబాబు సీఎం సీట్లో కూర్చుంటే…. నియోజకవర్గంలో వైసీపీకి నాయకుడు లేని పరిస్థితి దాపురించిందని చెప్పుకుంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్‌గా పెత్తనం చెలాయించిన ఎమ్మెల్సీ భరత్ ఏమైపోయారంటూ పార్టీ కేడర్ కాగడాలు పెట్టి వెదుకుతోందట. గడిచిన ఏడాదిన్నరలో ఆయన రెండు మూడు సార్లు తప్ప నియోజకవర్గం ముఖం చూడకపోవడం, అధికారం ఉన్నప్పుడు మా అంతటి వాళ్ళు లేరన్నట్టు బిల్డప్‌లు ఇచ్చిన కొందరు స్థానిక నాయకులు కూడా సైలెంట్‌గా సైడైపోవడంతో…. ఏం చేయాలో అర్ధంగాక దిక్కులు చూస్తోందట కేడర్.
సిసలైన నాయకులంటే… ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కదా అండగా నిలబడాలి. మరి వీళ్ళంతా ఇప్పుడిలా ముఖం చాటేస్తే… మన సంగతేంటంటూ తమలో తాము ఫీలవుతున్నారట కుప్పం వైసీపీ కార్యకర్తలు. అధికారంలో ఉన్నప్పుడు కుప్పం విషయంలో చాలా పెద్ద స్కెచ్చే వేసింది వైసీపీ అధిష్టానం. అప్పటి స్థానిక ఎన్నికల్లో తిరుగులేని ఆధిపత్యం సాధించడంతో… ఈసారి కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని గట్టిగా ప్రచారం చేశారు వైసీపీ నాయకులు. నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప కూడా కుప్పం మీదే గట్టిగా దృష్టి పెట్టారు. అదే టైంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్‌గా ఉన్న భరత్‌కు అనూహ్యంగా ఎమ్మెల్సీ దక్కింది. తర్వాత ఆయన్ని చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిని చేశారు. నాటి సీఎం జగన్ కుప్పం పర్యటనకు వచ్చిన ప్రతిసారీ…. ఈసారి భరత్‌ను గెలిపిస్తే మంత్రిని చేస్తానంటూ స్వయంగా చెప్పేవారు. వై నాట్ 175 నినాదాన్ని కూడా కుప్పం నుంచే మొదలెట్టారు జగన్. ఎన్నికలకు ముందు హంద్రీనీవా నీటిని విడుదల చేయడం, 65 కోట్ల నిధులతో పనులు ప్రారంభించడం లాంటి కార్యక్రమాలతో కుప్పంలో ఏదో జరిగిపోతోందంటూ ఒక రకమైన వాతావరణాన్ని సృష్టించింది వైసీపీ. దీనిద్వారా….. చంద్రబాబు డిఫెన్స్‌లోపడి సొంత నియోజకవర్గం మీదే ఎక్కువగా దృష్టి పెడతారని, తాము మిగిలిన చోట్ల బాగా లాభపడవచ్చని అప్పట్లో వైసీపీ వ్యూహంగా చెప్పుకున్నారు.
ఒకటైంలో… చంద్రబాబు నియోజకవర్గంలోకి ఎంటర్ అవకుండా… అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఆ సందర్భంగా గొడవలు అవడంతో అక్కడ అసలేం జరుగుతోందన్న టెన్షన్ అప్పట్లో ఉండేది. కట్ చేస్తే…. గత ఎన్నికల్లో ఆ పాచికలేవీ పారలేదు. ఇక్కడ వైసీపీ ఎత్తులన్నీ చిత్తవగా….. ఫలితాల తర్వాత టీడీపీ నాయకులు దూకుడు పెంచడంతో…. కుప్పం వైసీపీ నాయకులు చాలామంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కొందరు సైకిలెక్కితే… ఇంకొందరు చెల్లాచెదురయ్యారు. కీలకమైన నియోజకవర్గ నాయకులు,
మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట. కుప్పం వైసీపీలో కీలక నేతలైన విద్యాసాగర్, సెంథిల్ కూమార్ లాంటి వాళ్ళు కేరాఫ్ బెంగళూర్ అని చెప్పుకుంటున్నారు. అప్పట్లో మాటకు ముందు కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని సవాల్ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిధున్ రెడ్డి సైతం ఇప్పుడు అటువైపు వెళ్ళడం లేదట. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ కేడర్‌కు అండగా ఉండాల్సిన నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఎమ్మెల్సీ భరత్ మాత్రం నాకేం సంబంధం లేదనట్టు హైదరాబాద్, బెంగుళూరు ట్రిప్స్‌తో టైంపాస్ చేస్తున్నారన్నది స్థానిక కార్యకర్తల ఆవేదన. మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి నిరసనగా ఇటీవల నిర్వహించిన సంతకాల సేకరణను సైతం ఆయన పట్టించుకోకపోవడంతో కార్యకర్తలే మమ అనిపించినట్టు తెలిసింది.
సార్…. రాకపోతే పోయారు…. కనీసం మా మీద పెడుతున్న కేసుల గురించి అయినా పట్టించుకోవాలి కదా? మా బాధలు చెప్పుకోవడానికి ఫోన్లు కూడా తీయకపోతే ఎలాగంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది కేడర్. అప్పుడేమో… మీకెందుకు నేనున్నానని భరోసా ఇచ్చి రెచ్చగొట్టి… తీరా ఇప్పుడు కేసులు పడుతుంటే కనీసం మాటవరసకి కూడా నేనున్నానని చెప్పకుండా గాలికి వదిలేశారన్నది కుప్పం వైసీపీ కేడర్ ఆవేదన. ఒకవేళ పొరపాటున ఫోన్ ఎత్తినా… చూసుకోండి ఇంకా టైం ఉంది కదా… మళ్లీ మాట్లాడదాం అంటూ సైలెంట్ గా తప్పించుకుంటున్నారట ఎమ్మెల్సీ భరత్. పరిస్థితి ఇలానే ఉంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు కూడా ఇంతే ఉంటాయంటూ రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు కార్యకర్తలు. సీఎం నియోజకవర్గం విషయంలో వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.
