Site icon NTV Telugu

Off The Record: ఆ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే… పార్టీ లైన్‌లోనే ఉన్నారా? లేక సరిహద్దులు దాటేశారా?

Yennam Srinivas Reddy

Yennam Srinivas Reddy

Off The Record: మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తాజాగా తెరపైకి తెచ్చిన డిమాండ్ కాంగ్రెస్‌ పార్టీలో కలకలం రేపుతోంది. ప్రతి నియోజకవర్గానికి అభివృద్ధి కోసం యేడాదికి 25 కోట్లు ఇవ్వాలని ఆయన స్వరం పెంచడం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో పాలమూరు ఎమ్మెల్యేది స్వపక్షమా? లేక విపక్షమా? అన్న డౌట్స్‌ సైతం వస్తున్నాయట కొందరికి. గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం ఎమ్మెల్యేల చేతిలో చిల్లి గవ్వ లేకపోవడం ఇబ్బందిగా మారిందని, పెళ్ళిళ్ళకో, పరామర్శలకో తప్ప…ఊళ్ళకు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు వెళ్ళే పరిస్థితి లేకుండా పోయిందని అంటున్నారాయన. చిన్న చిన్న బడ్జెట్‌లతో పనులు చేయమని ఎవరన్నా వస్తే… ఆయా శాఖలకు ప్రతిపాదనలు పంపడం… తప్ప ఇంకేం చేయలేకపోతున్నామన్నది ఎమ్మెల్యే ఆవేదన. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతున్నా… గ్రామాలకు చేరుతున్న నిధులు మాత్రం శూన్యం అంటున్నారు పాలమూరు ఎమ్మెల్యే యెన్నం. అందుకే… ప్రతి నియోజకవర్గానికి యేటా 25 కోట్లు కేటాయిస్తే … అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకోవడంతో పాటు… పంచాయతీరాజ్, వైద్య , విద్యా శాఖల్లో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసి వత్తిడి తగ్గించుకుంటామంటున్నారు.

25 కోట్ల నిధుల అంశాన్ని యెన్నం శ్రీనివాసరెడ్డి తెరపైకి తేగానే…జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు ఆయనకు కోరస్‌ పాడేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అయితే…, ఓ అడుగు ముందుకేసి యెన్నం వాదనతో ఏకీభవించడమే కాకుండా… ఇదే అంశాన్ని పలువురు ఎమ్మెల్యేలకు వివరించి… వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా మంత్రుల నియోజకవర్గాలకు ఎక్కువ నిధులు వెళ్తున్నాయనేది జడ్చర్ల ఎమ్మెల్యే వాదన. అందుకే… ఆయన ఖమ్మం, నల్లగొండ నేతలే నిధులు ఎక్కువగా తీసుకెళ్తున్నారు… దీనిపై లెక్కలు తేలాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఈ నిధుల అంశాన్ని లేవనెత్తడంతో… ఇప్పుడు ప్రతిపక్షానికి గట్టి అస్త్రం దొరికిందని అంటున్నారు విశ్లేషకులు. కానీ… ఎమ్మెల్యేలు మాత్రం మేం పార్టీ లైన్ లోనే ఉన్నాం. క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మాత్రమే నిధులు అడుగుతున్నామని… ఇందులో రాజకీయాలు లేవని చెప్పుకొస్తున్నారు. వాళ్ళేం చెప్పినా… బయటికి మాత్రం అది నిరసన స్వరంలాగే వినిపిస్తోందని చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాయని, ఆ అప్పులకు వడ్డీలు కడుతూ ప్రభుత్వాన్ని నడుపుతున్నామని సర్కార్ పెద్దలు చెప్పుకొస్తున్న పరిస్థితుల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఇలా నిధుల డిమాండ్ తెరపైకి తేవడం కచ్చితంగా సర్కార్‌ను ఇబ్బంది పెట్టడమేనని మాట్లాడుకుంటున్నాయి రాజకీయవర్గాలు.

కానీ… ఇదేమీ పట్టించుకోకుండా…. ఈ విషయంలో ఎమ్మెల్యేలందర్నీ కూడగట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు యెన్నం శ్రీనివాసరెడ్డి సిద్ధమవుకున్నట్టు సమాచారం. ఇక ఇదే సమయంలో అసలు యెన్నం పార్టీ లైన్‌లోనే ఉన్నారా లేక బోర్డర్‌ క్రాస్‌ చేశారా అన్న చర్చకు బీజం పడింది. ప్రస్తుతం పాలమూరు పొలిటికల్‌ సర్కిల్స్‌లో ఇదే దీని గురించే రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆయన చేసిన ఏడాదికి 25 కోట్ల డిమాండ్‌ కంటే… అసలు పార్టీ లైన్‌లో ఉన్నారా లేదా అన్నదే ప్రధానంగా తెరపైకి వస్తోంది. సొంత ప్రభుత్వాన్నే ఇరుకున పెట్టేలా ఉందని కొందరు విశ్లేషిస్తుండగా …. పాలమూరు జిల్లాకు చెందిన సియం రేవంత్ రెడ్డిని తరచు కలిసి జిల్లా సమస్యలు, నిధుల గురించి చర్చించే యాక్సెస్ ఉందని , వడ్డించే వారు మనోడు కాబట్టే పెట్టే మొదటి ముద్ద జిల్లాకే దక్కాలని భావించడంలో తప్పేముందని జిల్లాకే చెందిన మరో ఎమ్మెల్యే అనడం ఆసక్తిగా మారింది. ఈ ఎపిసోడ్ పై కాంగ్రెస్‌ పెద్దలు ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.

Exit mobile version