తుని నియోజకవర్గం ఒకప్పుడు టిడిపికి కంచుకోట. ఈ నియోజకవర్గంలో 2009లో తొలిసారి యనమల రామకృష్ణుడు ఓడిన తర్వాత పరిస్థితి మారిపోయింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో యనమల తమ్ముడు కృష్ణుడు బరిలో ఉన్నప్పటికీ టీడీపీకి ఓటమి తప్పలేదు. ఇప్పుడు యనమల దృష్టంతా వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఉంది. గత వారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో నర్మగర్భంగా తన మనసులో మాట చెప్పేసారు యనమల. యువతకు 40 శాతం సీట్లు కేటాయిస్తేనే గెలుస్తామని టీడీపీ అధినేతకు చెప్పానన్నారు. ఎప్పుడూ లేనిది రామకృష్ణుడు టోన్ మార్చారేంటని కేడర్ గందరగోళంలో పడింది. యనమల రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పితే నియోజకవర్గాన్ని శాసించిన తమ్ముడు కృష్ణుడుకి.. అన్నయ్య స్వరంలో వచ్చిన మార్పు షాక్ ఇచ్చింది. ఎవరు ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా తునిలో మూడుసార్లు ఓడిపోయామని.. దానిని బట్టి అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని యనమల చెప్పడంతో తమ్ముడికి తత్వం బోధపడిందట. అన్నయ్య తనకు హ్యాండిచ్చేసారని అర్థం చేసుకున్నారట. ఇలాగే ఉంటే రాజకీయంగా మనుగడ ఉండదని గ్రహించి కొత్త ఎత్తులు వేస్తున్నారు కృష్ణుడు.
Read Also: Off The Record: గుమ్మనూరు చుట్టూ వివాదాలు
కొంతకాలంగా రామకృష్ణుడు తుని క్యాడర్‌కి బాగా దూరం అయ్యారు. అయితే కాకినాడ లేదంటే అమరావతి అన్నట్టు ఉంది ఆయన తీరు. దాంతో తమ్ముడు పార్టీ కేడర్‌తో బాగా ర్యాపో మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇంతలో కుమార్తె దివ్యను యనమల తుని బరిలో దింపుతారనే సంకేతాలు రావడంతో కృష్ణుడు అలెర్ట్ అయ్యారు. కార్యకర్తలతో నేరుగా టచ్‌లోకి వెళ్తూ తన రాజకీయం తాను చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఉనికి కాపాడుకునే పనిలో పడ్డారు తమ్ముడు. ఇప్పటి వరకు అన్న కోసమే తాను అన్నట్టు ఉన్న కృష్ణుడు.. తనను బలి పశువుని చేసి అందరూ సేఫ్ జోన్ లోకి వెళ్లిపోతున్నారని అర్ధం చేసుకున్నారట. అన్నయ్య అన్నిసార్లు గెలవడంలో నేను లేనా? ఇప్పుడు ఓటములకు తనను బాధ్యుడిని చేయడం ఏంటని మథన పడుతున్నారట.
స్వయంగా టీడీపీ కేడర్‌కు కృష్ణుడు ఫోన్ చేసి ‘యాదవ సంఘంలో 30 వేల ఓట్లు ఉన్నాయి. నేను లేకపోతే ఎవరు చూడబోరని చెబుతున్నారు. యనమల కుమార్తె దివ్య ఇంట్లోనే ఉంటుందని.. ఆమెకి ఎవరు ఓటు వేస్తారు అని ప్రశ్నిస్తున్నారు. తనకు సీటు ఇవ్వక్కర్లేదు.. అలాగని దివ్యకు ఇవ్వొద్దని యనమలకు చెప్పాలని కార్యకర్తలకు తమ్ముడు నూరిపోస్తున్నారట. పైగా తనకు సీటు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో దాడిశెట్టి రాజా మళ్లీ నెగ్గుతారని అందరూ అంటున్నట్టుగా ప్రచారం చేయాలంటున్నారట కృష్ణుడు. తమ్ముడు కష్టపడితే కుమార్తెకు సీటు ఇస్తారా అని యనమలను నిలదీయాలని సూచిస్తున్నారట. ఊరికి 40 మంది కలిసి వెళ్లి ఈ అంశాలపై యనమలను ప్రశ్నించాలని.. లేకపోతే తునిలో టీడీపీ ఉండబోదని కూడా చెప్పాలంటున్నారట కృష్ణుడు. మొత్తానికి తునిలో అన్నదమ్ముల మధ్య రాజకీయం రంజుగా మారింది. తనను బూచిగా చూపి యనమల సేఫ్ జోన్ లోకి వెళ్లి కూతురికి టికెట్ ఇప్పించుకుంటున్నారని కృష్ణుడికి తత్వం బోధపడింది. తొలిసారి స్వరం పెంచి ఓపెన్ అయిపోయారు. మరి పసుపు పార్టీ పెద్దలు తునిలో సైకిల్ కిల్ కాకుండా ఏ విధంగా ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తారో చూడాలి.