Site icon NTV Telugu

Off The Record: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తలపడుతుందా.. తప్పుకుంటుందా..?

Ycp

Ycp

Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల కోసం కసరత్తు మొదలైంది. వచ్చే సంక్రాంతి తర్వాత మున్సిపాలిటీలు, పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు దశల వారీగా జరుగుతాయి. ఇప్పటిదాకా లోకల్‌ బాడీస్‌ ఎలక్షన్స్‌ బ్యాలెట్ పద్ధతిలోనే జరగ్గా… తొలిసారి ఈవీఎంల వినియోగం గురించి ఆలోచిస్తోంది స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌. దీనిపై పొలిటికల్‌ సర్కిల్స్‌లో విస్తృ చర్చ జరుగుతోంది. మరోవైపు ప్రస్తుతం 80 శాతం స్థానిక సంస్థలు వైసీపీ చేతిలోనే ఉండడంతో వీలైనంత త్వరగా.. ఎన్నికలు జరిపి వాటిని స్వాధీనం చేసుకోవాలన్న ఆతృతలో ఉంది కూటమి. అదే సమయంలో… 2024 జనరల్‌ ఎలక్షన్స్‌ తాలూకూ దారుణ పరాభవం నుంచి కోలుకుని పార్టీని ఫుల్‌ రీఛార్జ్‌ మోడ్‌లోకి తీసుకువచ్చే పనిలో బిజీగా ఉన్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్‌. రాష్ట్ర, జిల్లా విభాగాలతో పాటు అన్నీ అనుబంధ విభాగాల్లో పార్టీ పదవులను దాదాపు భర్తీ చేశారు. ఈ అక్టోబర్ కల్లా బూత్ లెవల్ కమిటీల ఏర్పాటు కూడా పూర్తి చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓటమికి పార్టీ లైనప్ దెబ్బతినటం కూడా ఓ కారణమని భావించిన జగన్… ప్రస్తుతం దానిమీద దృష్టి పెట్టారట. బూత్‌ లెవల్‌ కమిటీల గురించి అప్పుడే ఎందుకు ఆలోచిస్తున్నారన్న డౌట్స్‌ మొదట్లో కొందరు నాయకులకు వచ్చినా… అదంతా స్థానిక ఎన్నికల కోసమేనని ఇప్పుడు అర్ధం చేసుకుంటున్నారు.

Read Also: Vice President Bungalow: ఉపరాష్ట్రపతి బంగ్లా ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఇటీవల వైసీపీ ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా కేడర్ బాగానే బయటకు వస్తున్నారు. అలాగే… జగన్ ఏ ప్రాంతంలో పర్యటకు వెళ్లినా పార్టీ కేడర్ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. గ్రౌండ్ లెవల్ నుంచి పార్టీ కాస్త పుంజుకోవటం వల్లే ఇదంతా సాధ్యమైందన్న లెక్కలేసుకుంటోంది వైసీపీ యంత్రాంగం. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్ని దీటుగా ఎదుర్కొంటామన్న నమ్మకం కుదురుతున్నా….ఇటీవలి పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల ఫలితాలు పునరాలోచనలో పడేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ఫలితాలు అంచనాలకు పూర్తి విరుద్ధంగా రావడంతో… రేపటి పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న కూడికలు, తీసివేతల్ని కూడా వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే.. ఈవీఎంల వల్ల అసెంబ్లీ ఫలితాలు తారుమారయ్యాయని ఇప్పటికే ఆరోపిస్తున్న వైసీపీ… స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆ యంత్రాల వాడకాన్ని సమర్ధిస్తుందా లేక వ్యతిరేకిస్తుందా అన్న అనుమానాలున్నాయట. అదే సమయంలో పార్టీ వర్గాల్లో మరో చర్చ కూడా జరుగుతోంది. ఓటింగ్‌ ప్రాసెస్‌ ఏదైనా…. పెద్ద తేడా ఉండకపోవచ్చని.. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరిగితేనే తమకు న్యాయం జరుగుతుందన్న వాదన సైతం ఉంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల తరహాలో వీటికి కూడా కేంద్ర భద్రతా బలగాల పర్యవేక్షణ ఉంటే.. అప్పుడు ఎలాంటి మెకానిజం తీసుకువచ్చినా ఇబ్బంది ఉండదన్నగి జగన్ అభిప్రాయంగా చెప్పుకుంటున్నారు.

Read Also: Off The Record: కవిత అక్కడ నుంచే సొంత రాజకీయ యాత్ర మొదలవుతుందా..?

బ్యాలెట్ అయినా, ఈవీఎంలైనా రాష్ట్ర పోలీసుల నేతృత్వంలో పోలింగ్‌ జరిగితే… తమకు ఇబ్బంది అన్నది వైసీపీ పెద్దల భావన అట. అందుకే… ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే…విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి సెంట్రల్‌ ఫోర్స్‌ భద్రత అడగాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో మరో ఆసక్తికరమైన వాదన కూడా వినిపిస్తోంది పార్టీ వర్గాల నుంచి. ఒకవేళ ఎన్నికల టైంలో…సెంట్రల్‌ ఫోర్స్‌ మోహరింపునకు గనక కేంద్ర ప్రభుత్వం అంగీకరించకుంటే… ఎన్నికల్లో పాల్గొనే విషయాన్ని పునః సమీక్షించే అవకాశం ఉండవచ్చని అంటున్నారు. కేంద్ర బలగాల సహకారం లేకుండా.. కేవలం రాష్ట్ర పోలీసుల పర్యవేక్షణలో ఎన్నికలు జరిగితే… తాము ఎంతలా పోరాటం చేసినా ఉపయోగం ఉండబోదని, అలా పోటీ చేసి మరో ఘోర పరాజయాన్నిమూటగట్టుకునేకంటే… ఎన్నికలకు దూరంగా ఉండటమే బెటరని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో నోటిఫికేషన్‌ వచ్చాక వైసీపీ గేమ్‌ ప్లాన్‌ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లో సత్తా చాటాలని గట్టిగా నిలబడతారా? లేక కేంద్ర బలగాల సాకుతో బరి నుంచి తప్పుకుంటారా అన్నది ఇంట్రస్టింగ్‌ టాపిక్‌ అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Exit mobile version