Site icon NTV Telugu

Off The Record: ములకలచెరువు నకిలీ మద్యం విషయంలో జనసేన వైఖరి ఏమిటి?

Mulakalacheruvu

Mulakalacheruvu

Off The Record: ఆంధ్రప్రదేశ్‌ పాలిటిక్స్‌ను ఓ కుదుపు కుదిపేస్తున్న నకిలీ మద్యం ఎపిసోడ్‌ ఇప్పుడు కూటమిలో కూడా కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు. దాని గురించి ఆ స్థాయి రచ్చ అవుతున్నా… వైసీపీ ఒంటికాలి మీద లేస్తూ టార్గెట్‌ చేస్తున్నా… జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు నోరు తెరవడం లేదన్న డౌట్స్‌ వస్తున్నాయట కూటమి సర్కిల్స్‌లో. అంటే నకిలీ మద్యం వ్యవహారాన్ని కేవలం టీడీపీ సమస్యగానే డిప్యూటీ సీఎం చూస్తున్నారా? వాళ్ళు వాళ్ళు తేల్చుకుంటారు, మధ్యలో మనకెందుకు అనవసరమైన దురద అని పవన్ భావిస్తున్నారా అన్న కోణాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ విషయంలో పవన్ నోటి నుంచి ఒక్కటంటే ఒక్క మాట కూడా రాలేదు. అంటే… అది మొత్తం కూటమి ప్రభుత్వ సమస్యగా కాకుండా… కేవలం టీడీపీ తలనొప్పి అన్న ఫీలింగ్‌లో జనసేన ఉందా అన్నది క్వశ్చన్‌ అట. విపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వ మద్యం విధానం, మాఫియా, ఎక్సైజ్ అవినీతి అంటూ తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోసేవారు పవన్‌.

Read Also: Fire Break : దూలపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం

అదే సమయంలో తప్పు ఎవరు చేసినా… ప్రశ్నిస్తానని, నిలదీస్తానని చెప్పేవారు. అలాంటిది ఇప్పుడు నకిలీ మద్యం తయారీలో టీడీపీ నేత పేరు బయటికి రావడం, పార్టీ ఆయన్ని సస్పెండ్‌చేయడం లాంటివి జరిగినా… డిప్యూటీ సీఎం మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా మౌనం పాటించడం రాజకీయ సందేహాలకు తావిస్తోందట. అంత పెద్ద ఇష్యూ నడుస్తుంటే… పాజిటివో, నెగెటివో… ఏదో ఒకటి రియాక్ట్‌ అవకుండా ఉప ముఖ్యమంత్రి అలా నిశ్శబ్దం పాటించడం కరెక్ట్‌ కాదనే వారు సైతం ఉన్నారు. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మల్చుకుంటూ… చివరికి ఆయన్నే టార్గెట్‌ చేస్తోంది వైసీపీ. అప్పట్లో అంతలా చెలరేగిపోయిన పవన్‌…ఇప్పుడు తన సొంత ప్రభుత్వంలో, భాగస్వామ్యపక్ష నేత ఏకంగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తుంటే… ఏం మాట్లాడకపోవడం ఏంటి? అంటే.. ఆ చర్యల్ని ఆయన సమర్ధిస్తున్నారా అంటూ రివర్స్‌లో ప్రశ్నిస్తోంది విపక్షం. మద్యం మాఫియా ప్రజల ప్రాణాలు తీస్తుంటే… ప్రభుత్వం ఏం చేస్తోందని అప్పట్లో రచ్చ రచ్చ చేసిన పవన్‌… ఇప్పుడు తన చేతిలో అధికారం ఉంచుకుని కూడా సైలెంట్‌గా ఉండటం ఏంటో అర్ధంకావడం లేదంటున్నారు వైసీపీ లీడర్స్‌.

అంటే… కూటమి ప్రభుత్వ హయాంలో మద్యం మాఫియా తయారు చేసే నకిలీ మద్యానికి జనం ప్రాణాలు పోవా? వాళ్ళు బాటిల్స్‌లో నింపేదేమన్నా అమృతమా? అంటూ సెటైరికల్‌గా ప్రశ్నించే నేతలు సైతం పెరుగుతున్నారు. మద్యం మాఫియా వెనక రాజకీయ రక్షణ ఉందని అప్పట్లో అన్న జనసేనాని…ఇప్పుడు అలాంటిది లేదని భావిస్తున్నారా..? ఒకవేళ అలా అనుకుంటే… అదే విషయం పబ్లిక్‌గా చెప్పవచ్చుకదా అన్నది ఫ్యాన్ పార్టీ లీడర్స్‌ ప్రశ్న. సామాజిక బాధ్యతతో ముందుకు సాగే నాయకుడని ఇమేజ్ సొంతం చేసుకున్న పవన్… నకిలీ మందుపై స్పందించకుంటే… మౌనం అర్ధాంగీకారం అనుకోవాల్సి వస్తుందన్నది ఇంకొందరి మాట. కాస్త లేట్‌గానైనా… డిప్యూటీ సీఎం స్పందిస్తారా? లేక జరిగేదేదో జరుగుతుందనుకుంటూ… ఈ మౌనాన్ని కొనసాగిస్తారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Exit mobile version