Site icon NTV Telugu

Off The Record: మున్సిపల్‌ ఎన్నికలపై బీఆర్‌ఎస్‌లో ఎలాంటి చర్చ జరుగుతోంది..? ఫలితాలపై అంచనాలు ఎలా ఉన్నాయి?

Otr Brs

Otr Brs

Off The Record: బ్యాలెట్‌ బాక్స్‌లు తెరవకముందే తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై ఎవరికి వారు డిసైడవుతున్నారు వివిధ పార్టీల నాయకులు. మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా… బీఆర్‌ఎస్‌లో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయన్న పాయింట్‌ ఆసక్తికరంగా మారింది. తాను అధికారంలో ఉన్నప్పుడు 90 శాతానికి పైగా మున్సిపాలిటీలను దక్కించుకుంది గులాబీ పార్టీ. దీంతో ఇప్పుడ ప్రతిపక్షంగా ఆ పార్టీ లెక్కలు ఎలా ఉన్నాయి? అధిష్టానం మనసులో ఏముందంటూ ఆరా తీస్తున్నారు చాలామంది. ఎన్నికల షెడ్యూలు రాకముందే సమన్వయకర్తలను నియమించి ప్రచార పర్వంలోకి దిగింది బీఆర్ఎస్. ఆ సమన్వయకర్తలు నియోజకవర్గ ఇన్ఛార్జ్‌లను కలుపుకొని వెళ్లాలని సూచించింది. ఆ విధంగా ఇద్దరి సమన్వయంతో పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ఇక అభ్యర్థుల ప్రకటన తర్వాత ఉధృతంగా ప్రచారం చేశారు పార్టీ నాయకులు. ఈ మున్సిపల్ ఎన్నికలను మొదట్లో అంత సీరియస్‌గా తీసుకోలేదు కారు పార్టీ ముఖ్యులు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, వాళ్లు లేనిచోట్ల నియోజకవర్గ ఇన్చార్జ్‌లకే పూర్తి బాధ్యతలు అప్పజెప్పామంటూ రాష్ట్ర స్థాయి నేతలు ప్రచారానికి కూడా పోలేదు. కానీ… రాను రాను పార్టీ వైఖరి మారింది. ప్రచారం ముగింపునకు ఇక కేవలం మూడు రోజులే ఉందనుకుంటున్న టైంలో… బీఆర్‌ఎస్‌ అధిష్టానం అలర్ట్‌ అయింది.

Read Also: Seetha Payanam: బ్రహ్మానందం చేతుల మీదుగా ‘సీతా పయనం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. హైలైట్స్ ఇవే!

అప్పటి వరకు తమ ఉమ్మడి జిల్లాలకు మాత్రమే పరిమితమైన కేటీఆర్, హరీష్‌రావు రాష్ట్ర వ్యాప్త ప్రచారం మొదలుపెట్టి ఉధృతంగా పర్యటించారు. ఆ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సింబల్ లేకపోయినప్పటికీ తమ మద్దతున్న అభ్యర్థులు చాలా సీట్లు గెలుచుకున్నారన్నది గులాబీ నేతల లెక్క. అందుకే ఈ మున్సిపల్ ఎన్నికలను లైట్ తీసుకోవద్దని కేసీఆర్ సూచించడంతో… కేటీఆర్ హరీష్‌రావు ప్రచార తీవ్రత పెంచినట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు సాధిస్తేనే రేపు సాధారణ ఎన్నికలకు లైన్‌ క్లియర్‌ అవుతుందని, కేడర్‌లో నైతిక స్థైర్యం పెరుగుతుందని భావించింది పార్టీ అధిష్టానం. ఇప్పటికే గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్ల నెగెటివిటీ పెరిగిందని, రాష్ట్రంలో పొలిటికల్‌ ఫైట్‌ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న విధంగా మారిపోతోందన్న అంచనాకు వచ్చారు బీఆర్‌ఎస్‌ ముఖ్యులు. దీంతో అలర్ట్ అయి…. చివరి మూడు రోజులు సీరియస్‌గా వర్క్‌ చేసినట్టు చెప్పుకుంటున్నారు. అధిష్టానం ఆదేశాలతో… బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలతోపాటు పార్టీ మారిన వాళ్ళ సెగ్మెంట్స్‌లో కూడా పకడ్బందీగా వర్కౌట్ చేసినట్టు తెలిసింది. ఈ రెండు కేటగిరీల్లోని మున్సిపాలిటీల్లో ఖచ్చితంగా మాదే ఆధిపత్యం అని నమ్ముతున్నారు కారు లీడర్స్‌.

రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్స్‌లో అధికార కాంగ్రెస్ కంటే తక్కువగానే సీట్లు దక్కించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. మున్సిపాలిటీల్లో మాత్రం ఆ పార్టీతో సమానంగా ఉంటామన్నది బీఆర్‌ఎస్‌ వాయిస్‌. మరోవైపు తమ పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్స్‌ వేరే పార్టీలకు మద్దతు ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యతను నియోజకవర్గ ఇన్చార్జ్‌లు, సమన్వయకర్తలకు అప్పగించింది అధిష్టానం. ఫలితాలు రాగానే చైర్మన్స్‌, మేయర్ల ఎన్నిక ఉంటుంది కాబట్టి అప్పటివరకు వారిని కాపాడుకుంటే చాలని అంటున్నారు పార్టీ నాయకులు. తెలంగాణ భవన్‌ అంచనాల ప్రకారం చూసుకుంటే…. తమకు 50 కి పైగానే మున్సిపాలిటీలు దక్కుతాయని అంటున్నారు. అయితే… ఇక్కడే మరో వెర్షన్‌ కూడా వినిపిస్తోంది. పైకి గట్టిగా 50అంటున్నా… ఆఫ్ ద రికార్డ్‌లో మాత్రం మాకు గట్టిగా 20 నుంచి 25 మున్సిపాలిటీలు వస్తాయని చెబుతున్నారట బీఆర్‌ఎస్‌ లీడర్స్‌. అంచనాలు, ఊహాగానాలు ఎలా ఉన్నా…. గౌరవప్రదమైన సంఖ్యలో కౌన్సిలర్స్‌ని గెలిపించుకుంటేనే… ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా నిలబడే అవకాశం ఉంటుందని భావిస్తోంది అధిష్టానం.

Exit mobile version