OFF The Record: వనపర్తిలో కాంగ్రెస్ రాజకీయం రోడ్డున పడింది. కాంగ్రెస్ సీనియర్ నేతకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగుతున్నారు పార్టీ నాయకులు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌కే.. క్రమశిక్షణ లేదని ఆందోళనకు దిగారు. ఇంతకీ ఎందుకీ రచ్చ? వనపర్తి కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది?
కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డికి ఎర్త్ పెడుతుంది ఎవరు? చిన్నారెడ్డికి అంతకోపం ఎందుకు వచ్చింది? రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే చిన్నారెడ్డికి అసలేమైంది? వనపర్తిలో గడిచిన కొన్నిరోజులుగా సీనియర్ కాంగ్రెస్ నేత చిన్నారెడ్డికి.. స్థానిక నాయకుల మధ్య పొసగడం లేదు. వనపర్తిలో 8సార్లు పోటీ చేసిన చిన్నారెడ్డి.. ఎవరినీ పట్టించుకోవడం లేదనేది స్థానిక కాంగ్రెస్ నాయకుల ఆవేదన. పేరుకు పెద్ద నాయకుడైన నియోజకవర్గాన్ని.. నాయకుల్ని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డేక్కేశారు. చిన్నారెడ్డి వనపర్తి వదిలి వెళ్లాలని డిమాండ్ చేసే వరకు పరిస్థితి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో కొత్త నాయకుడిని బరిలో నిలపాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ దశలో చిన్నారెడ్డికి వ్యతిరేకంగా వనపర్తిలో నాయకుల వాయిస్ పెంచారు. దీంతో చిన్నారెడ్డి తన చేతిలో ఉన్న క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పదవిని వాడేశారు. ఎదురు తిరిగిన మాజీ డిసిసి అధ్యక్షుడు శంకర్ ప్రసాద్ పై వేటు వేశారు. ఇంతటితో సమస్య సద్దుమణుగుతుందని చిన్నారెడ్డి భావించారో ఏమో.. ఇప్పుడే అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. వివాదం గాంధీభవన్ మెట్ల మీద ఆందోళన చేసే వరకు వెళ్లింది.
వనపర్తిలో రాజకీయం వేడెక్కడానికి అసలు కారణం ఏంటనేది ప్రస్తుతం చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో చిన్నారెడ్డికి పోటీగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి కూడా పని చేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన చిన్నారెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లో ఇకపై పోటీ చేయబోనని గతంలో ప్రకటించారు. దీంతో వనపర్తిలో శివసేనారెడ్డి పాగా వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. స్థానిక నాయకత్వానికి కలుపుకొని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదికాస్తా నియోజకవర్గంలో చిన్నారెడ్డి ఆధిపత్యాన్ని ప్రశ్నించే స్థాయికి వెళ్లింది. చిన్నారెడ్డికి ఈ వ్యవహారం చూసి చిర్రెత్తుకొచ్చింది. శివసేనారెడ్డిని కట్టడి చేయాలని ఆయన రంగంలోకి దిగినట్టు సమాచారం. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన నాయకులపై వేటు వేయాలని డిసైడ్ అయ్యారు. మాజీ డిసీసీ అధ్యక్షుడు శంకర్ ప్రసాద్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఇక్కడే సమస్య ముదురు పాకాన పడింది.
గాంధీభవన్‌కు చేరుకున్న వనపర్తి వివాదం
శంకర్ ప్రసాద్‌పై ఫిర్యాదు చేసింది.. నోటీసులు ఇచ్చిందీ చిన్నారెడ్డే. చివరకు క్రమశిక్షణ కమిటీ సమావేశం లేకుండానే ఛైర్మన్ హోదాలో శంకర్ ప్రసాద్ ను పార్టీ నుంచి బహిష్కరించింది కూడా ఆయనే. ఇదే రచ్చకు దారితీసింది. శంకర్ ప్రసాద్ వివరణ ఇచ్చినా చైర్మన్‌గా తాను సంతృప్తి చెందలేదని చెబుతూ పార్టీ నుంచి బహిష్కరించారు చిన్నారెడ్డి. ఈ చర్యలపై మాజీ మంత్రి వ్యతిరేకవర్గం తీవ్రంగా మండిపడుతోంది. పార్టీ నిబంధనలు పాటించకుండా ఇలా చర్యలు తీసుకోవడం ఏంటనేది వారి ప్రశ్న. చిన్నారెడ్డికి ఉన్న అధికారం ఏంటని నిలదీస్తూ ఆయన వ్యతిరేకవర్గం గాంధీభవన్ మెట్లు ఎక్కింది.
టీకాంగ్రెస్‌లో వనపర్తి హీట్
వనపర్తిలో ప్రస్తుతం చిన్నారెడ్డి వర్సెస్ శివసేనరెడ్డిగా రాజకీయం మారిపోయింది. శంకర్ ప్రసాద్ పై వేటువేసి ప్రత్యర్థికి అవకాశం ఇచ్చినట్టు అయిందనేది పార్టీలో టాక్. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ లో వనపర్తి పాలిటిక్స్ హీట్ ని పెంచాయి. ప్రస్తుతం సమస్య పీసీసీ దృష్టికి వెళ్లింది. రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. సొంత జిల్లాలో పంచాయితీకి ఎలా ఫుల్‌స్టాప్ పెడతారో చూడాలి.
