NTV Telugu Site icon

Off The Record: దుర్గగుడిలో చెల్లుబాటు కాని మంత్రి మాట..! మాజీ మంత్రిదే పెత్తనం..!

Durga Temple

Durga Temple

Off The Record: తిరుమల మినహా ప్రభుత్వ అధీనంలోని ఇతర ఆలయాలన్నీ ఏపీలోని దేవాదాయశాఖ మంత్రి అజమాయిషీలోనే ఉంటాయి. మినిస్టర్‌గా ఆ ఆలయంలో పనిచేసే అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేయొచ్చు. కానీ.. డిప్యూటీ సీఎం హోదాలో దేవాదాయశాఖ చూస్తోన్న కొట్టు సత్యనారాయణ పరిస్థితి మాత్రం వేరే విధంగా ఉంది. తిరుమలలోనే కాదు.. ఏపీలోని మరో ఆలయంలో కూడా కొట్టు మాట చెల్లుబాటు కావడం లేదట. అదే బెజవాడ కనకదుర్గ ఆలయం. ఈ గుడిలో మంత్రి కొట్టు సత్యనారాయణ పెత్తనానికి మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ కత్తెర వేస్తున్నారని ఆ శాఖలో జరుగుతున్న చర్చ. వెలంపల్లి శ్రీనివాస్‌ బెజవాడ పశ్చిమ ఎమ్మెల్యే. ఆయన నియోజకవర్గ పరిధిలోనే కనకదుర్గ ఆలయం ఉండటం.. గతంలో దేవాదాయశాఖ మంత్రిగా అధికార దర్పం చెలాయించడంతో.. దుర్గమ్మ సన్నిధిలో మరొకరి పెత్తనాన్ని సహించడం లేదు ఎమ్మెల్యే. అదీ ఎంతదాకా వెళ్లిందంటే.. ప్రస్తుతం దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న కొట్టు సత్యనారాయణకు కూడా నో ఎంట్రీ చెప్పేస్తున్నారట.

Read Also: Off The Record: సీడబ్ల్యూసీలో చోటు దక్కే ఆ ఒక్క కాంగ్రెస్‌ నేత ఎవరు?

గత ఏడాది దసరా ఉత్సవాల సందర్భంగానే మాజీ మంత్రి వర్సెస్‌ సిట్టింగ్‌ మంత్రి అనే వివాదం దుమారం రేపింది. అప్పట్లో దుర్గగుడిలో దసరా ఏర్పాట్లు చేయాలంటే తాను చెప్పిన విధంగా చేయడానికి మంత్రి కొట్టుకు తల ప్రాణం తోకకు వచ్చిందట. తానో.. మాజీ మంత్రి వెలంపల్లో తేల్చుకోవాలనే పట్టుదలకు కొట్టు వెళ్లారని చెబుతారు. ఒకానొక సమయంలో వీళ్ల మధ్య రచ్చ సీఎం జగన్‌ వద్దకు కూడా చేరింది. అధినేత ఎవరి పని ఏంటో స్పష్టం చేసినా.. మంత్రికి.. మాజీ మంత్రికి మధ్య గ్యాప్‌ తగ్గలేదని.. ఇంకా దూరం పెరిగిందని టాక్‌. దుర్గగుడిలో ఏం జరిగినా.. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నా మంత్రిగా కొట్టుకు ఎలాంటి ప్రాధాన్యం దక్కడం లేదు. తాజాగా ఈ చర్చ మరో రూపంలో మళ్లీ తెర మీదకు వచ్చింది.

Read Also: Ponguleti Srinivas Reddy: పదవులు ఎవరికీ శాశ్వతం కాదు.. ప్రజల్లో ప్రేమాభిమానాలు ఉంటే అవే వస్తాయి..

ఇటీవల దుర్గ గుడి పాలకమండలి ఛైర్మన్‌కు ప్రత్యేకంగా కార్యాలయాన్ని కేటాయించింది దేవస్థానం. గతంలో అదే గదిలో పాత ఛైర్మన్‌ ఉన్నప్పటికీ.. కొత్త పాలకమండలి లేక మూసేశారు. తాజాగా మరమ్మతులు చేయించి.. అందులోకి కొత్త ఛైర్మన్‌ ప్రవేశాన్ని అట్టహాసంగా నిర్వహించాలని అనుకున్నారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకు దేవాదాయ మంత్రిని పిలుస్తారు. ఆయన అందుబాటులో ఉంటే వస్తారు.. లేదంటే లేదు. ఛైర్మన్‌ ఆఫీసు ప్రారంభోత్సవ సమయంలో మంత్రి కొట్టు అందుబాటులోనే ఉన్నారు. కానీ ఆయన్ని ఎవరూ ఆహ్వానించలేదట. దాంతో మంత్రీ వెళ్లలేదు. పైగా ఆలయ ఛైర్మన్‌ ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలంపల్లిదే లీడ్‌ రోల్‌. మంత్రి కొట్టుకు ఆహ్వానం అక్కర్లేదని ఎమ్మెల్యే వెలంపల్లే చెప్పారో లేక.. వెలంపల్లి మనసు తెలుసుకుని ఆలయ అధికారులే కొట్టుకు ఇన్విటేషన్‌ పంపలేదో కానీ.. అందుబాటులో ఉన్నా మంత్రి వెళ్లలేదు. ఆ మధ్య దుర్గగుడి పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా మంత్రి కొట్టు సత్యనారాయణకు ఆహ్వానం పంపలేదట. ఆ ఘటనపైనే కొట్టు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఇప్పుడు దుర్గ గుడిలో రెండో ఎపిసోడ్‌. మంత్రి.. మాజీ మంత్రి ఆధిపత్య పోరుకు దుర్గగుడి వేదికగా మారిందనే టాక్‌ నడుస్తోంది. మధ్యలో ఆలయ సిబ్బంది మాత్రం నలిగిపోతున్నారు. ఆయన మాట వింటే ఈయనకు కోపం.. ఈయన మాట వింటే ఆయనకు కోపం అని ఇద్దర్నీ లోలోపలే తిట్టుకుంటున్నారట సిబ్బంది.