Site icon NTV Telugu

Off The Record: టీడీపీ – జనసేన పొత్తుపై మిత్రులు ఆసక్తిగా ఉన్నారా ? మిత్రుడికి రాధా టికెట్ ఇప్పిస్తారా ?

Vangaveeti Radha

Vangaveeti Radha

Off The Record: పొలిటికల్‌ లీడర్స్‌…వంగవీటి రాధా, యలమంచిలి రవి మధ్య 20 ఏళ్ళ స్నేహ బంధం ఉంది. ఇప్పటికీ… ఇద్దరి మధ్య అదే చెక్కుచెదరని స్నేహం. 2004లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తొలిసారి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన రాధా బెజవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2009లో కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేసి ప్రజారాజ్యం కండువా కప్పుకున్నారు. ఆ ఎన్నికల్లోనే రాధా.. తన కుటుంబం మొదటి నుంచి పోటీ చేసి గెలుస్తున్న తూర్పు నియోజకవర్గం సీటుని స్నేహితుడు యలమంచిలి రవికి ఇప్పించారు. ఆ ఎన్నికల్లో రవి గెలవగా, ప్రజారాజ్యం అభ్యర్ధిగా విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసిన రాధా తొలిసారి ఓడిపోయారు. ప్రస్తుతం ఇద్దరూ మాజీలే. బెజవాడ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ నేతలిద్దరి భవితవ్యం ఇప్పడు క్యాడర్‌కు ఓ ప్రశ్నగా మిగిలిందట. వరుసగా ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండటం వల్ల రాజకీయ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోందని క్యాడర్ ఆవేదనగా ఉందట.

రాష్ట్ర విభజన తర్వాత వంగవీటి రాధా వైసీపీ తీర్థం పుచ్చుకోగా, యలమంచిలి రవి టీడీపీలో చేరారు. నాడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రవి తిరిగి తనకు అదే నియోజకవర్గం సీటు ఇస్తారని హామీ ఉండటంతో టీడీపీలో చేరారు. కానీ ఆ టికెట్ గద్దె రామ్మెహన్ కు ఇవ్వటంతో 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇక 2014లో వైసీపీ అభ్యర్థిగా తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండో సారి ఓటమి పాలయ్యారు రాధా. స్నేహితులు ఇద్దరూ చెరో పార్టీలో ఉన్నా కాలం కలిసి రాక మాజీలుగానే మిగిలారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక రవికి ఎమ్మెల్సీ ఇస్తారని, దుర్గగుడి ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ ఇస్తారని ప్రచారం జరిగినా అవేం ఆచరణలోకి రాలేదు. ఇక 2019 ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర కృష్ణాజిల్లాలో జరుగుతున్నటైంలో రాధా మాట్లాడి యలమంచిలి రవిని వైసీపీలోకి తీసుకున్నారు. అధికార టీడీపీకి రిజైన్ చేసి రవి వైసీపీలోకి చేరటం అప్పట్లో చర్చగా మారింది. అయితే రాధా మాట ప్రకారమే రవి వైసీపీలోకి వచ్చారని ఆయన సన్నిహితులు చెబుతారు.

ఈసారి యలమంచిలి రవి వైసీపీలోకి రాగానే వంగవీటి రాధా జగన్ తో విబేధిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు, 2019లో ఎన్నికల్లో రాధా పోటీ చేయలేదు. స్నేహితుడిగా ఆయన మాట మీద పార్టీలోకి వచ్చిన రవికి టికెట్ దక్కలేదు. 2019 తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చినా యలమంచిలి రవి మాత్రం పార్టీలో యాక్టివ్ గా లేరు. తన మిత్రుడు రాధా టీడీపీలో చేరటంతో తాను గతంలో రాజీనామా చేసి వచ్చిన టీడీపీలోకి తిరిగి వెళ్ళలేక రవి వైసీపీలోనే ఏకాకిగా… ఉన్నాం అంటే ఉన్నాం అన్నట్టు కొనసాగుతున్నారట. రాధా తీసుకునే రాజకీయ నిర్ణయాలు రవికి ఇబ్బందిగా మారుతున్నాయనేది ఆయన సన్నిహితుల మాట. ప్రస్తుతానికి రాధా పోటీ చేస్తారో లేదో కూడా ఆయన క్యాడర్ కి స్పష్టత లేదట. టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే రెండు పార్టీల్లో తనకున్న పరిచయాల ద్వారా రాధా ఈసారైనా రవికి టికెట్ ఇప్పిస్తారేమో అని ఆయన వర్గం ఎదురుచూస్తోంది. అది విజయవాడ తూర్పు అవుతుందా? మరోటా అన్నది కూడా క్లారిటీ లేదు. మరి ఇద్దరూ మాజీలు ఏం చేస్తారనేది తేలాలంటే మరో కొన్ని నెలలు ఆగాల్సిందే అంటున్నాయి రాజకీయ వర్గాలు.

Exit mobile version