Site icon NTV Telugu

Off The Record: కోవర్టుల టెన్షన్‌..? మళ్లీ పాయకరావుపేటపై వంగలపూడి అనిత ఫోకస్‌

Vangalapudi Anitha

Vangalapudi Anitha

Off The Record: ఇంట గెలిచి.. రచ్చ గెలవాలనేది పెద్దల మాట. కానీ, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితది మాత్రం విచిత్రమైన పరిస్థితి. 2014 ఎన్నికల ముందువరకు వంగలపూడి అనిత గురించి పొలిటికల్ సర్కిల్స్‌లో ఉన్న గుర్తింపు అంతంత మాత్రమే. పాయకరావుపేటలో పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచాక తక్కువ సమయంలోనే నియోజకవర్గ రాజకీయాలపై పట్టు సాధించేందుకు ఆమె ఎత్తుగడలు వేశారు. దాంతో ఆమె ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ.. తిరిగి టికెట్‌ ఇస్తే ఓడిస్తామని లోకల్‌ లీడర్స్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఆ ఎఫెక్ట్ 2019 ఎన్నికల నాటికి అనితకు గట్టిగానే తగిలింది. టీడీపీ హైకమాండ్‌ పాయకరావుపేట టికెట్‌ నిరాకరించి రెండు జిల్లాల అవతలకు నెట్టేసింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు అనిత. పాయకరావుపేట పుట్టిల్లు అయితే కొవ్వూరు మెట్టినిల్లు అని సెంటిమెంటు పండించేందుకు ఆమె చేసిన ప్రయత్నం 2019లో అట్టర్ ఫ్లాప్ అయింది. కొవ్వూరులో మాజీ మంత్రి జవహర్‌ వర్గం కూడా అనితను వ్యతిరేకించింది.

అదే సమయంలో పాయకరావుపేటలో టీడీపీ నుంచి బరిలో ఉన్న డాక్టర్‌ బంగారయ్య సైతం ఓడిపోయారు. ఆ ఎన్నికలు కాగానే బంగారయ్య వైసీపీలోకి జంప్‌ కొట్టేశారు. దాంతో తిరిగి పాయకరావుపేటకు రావడానికి సర్వశక్తులు ఒడ్డారు అనిత. తన మీద ఉన్న వర్గ రాజకీయాల ముద్రను చేరుపుకొనేందుకు ఆమెకు సీనియర్ల సహకారం లభించింది. ఇంతలో టీడీపీ మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు కావడం.. టీడీపీ పొలిట్‌బ్యూరోలో చోటు దక్కడంతో అనితకు చాలా ధైర్యం వచ్చిందట. వచ్చే ఎన్నికల్లో తనకు పాయకరావుపేట సీటు గ్యారెంటీ అనే ధీమాతో ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే అనిత దూకుడు పెంచాక.. అసలు కథ స్టార్ట్ అయింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో మాజీ మంత్రులు గంటా, అయ్యన్న వర్గాల మధ్య విభేదాలు బహిరంగ రహస్యం. మొదట్లో గంటా వర్గానికి అనిత దగ్గరగా ఉండేవారు. పాయకరావుపేటలో కాపు నాయకులతో గంటాకు సాన్నిహిత్యం ఉండటమే దానికి కారణం. తర్వాత అనిత స్వతంత్రంగా రాజకీయాలు చెయ్యాలనే ధోరణిలోకి రావడంతో సమస్యలు వచ్చాయి. తన టికెట్‌కు ఎసరు పెట్టేందుకు గట్టి ప్రయత్నం జరిగిందని.. అందువల్లే తన రాజకీయ భవిష్యత్ కొంతకాలం అయోమయంలో పడిందని అనిత గుర్తించారట. గంటాతోనూ.. పాయకరావుపేటలో గంటా వర్గంతోనూ గ్యాప్‌ పాటిస్తున్నారు ఈ మాజీ ఎమ్మెల్యే. ఇంతలో అయ్యన్న కూటమికి చేరువయ్యారు అనిత.

వచ్చే ఎన్నికల్లో తన తిప్పలు తాను పడదాము అనుకుంటుంటే మళ్లీ పాయకరావుపేట టీడీపీలో అలజడి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనిత అనుమానిస్తున్నారట. ఇటీవల కాలంలో గంటా పాయకరావుపేటలో పర్యటిస్తున్నారు. రంగా విగ్రహం ఆవిష్కరణ, ఆలయాల దర్శనాలు ఇలా ఏదో ఒక కారణంతో గంటా వెళ్లివస్తున్నారు. గంటా తన నియోజకవర్గానికి వచ్చిన సమాచారం అనితకు ఉండటం లేదట. పైగా అనిత ముఖ్య అనుచరులను గంటా పిలుపించుకుని మాట్లాడడం మాజీ ఎమ్మెల్యేను కలవర పెడుతున్నాయట. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటే టీడీపీకి పాయకరావుపేటలో ప్లస్ అవుతుంది. అదే సమయంలో కాపు నాయకత్వం ఒక గొడుగు కిందకు వచ్చి ప్రత్యేక వర్గంగా మారితే అనితకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయితే టీడీపీలో గంటా మాటకు ప్రాధాన్యం తగ్గిందని.. అయ్యన్న ఇమేజ్‌ పెరిగిందని టాక్‌ నడుస్తోంది. ఈ పరిణామం తనకు పాయకరావుపేటలో కలిసి వస్తుందని అనిత భావిస్తున్నారట. అయితే ఎన్నికలు సమీపించే కొద్దీ ఆశావహులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే గంటా వర్గీయులుగా ముద్రపడ్డ ఒకరిద్దరు పాయకరావుపేటపై ప్రత్యేక దృష్టి పెట్టారట. ఈ వ్యవహారాలను అనిత వర్గం ఓ కంట కనిపెడుతూనే ఉంది. గత ఎన్నికల్లోనూ, ఇప్పుడు టికెట్‌ రాజకీయాల వెనుక మాజీ మంత్రి గంటా వర్గం ఉందని నిర్ధారించుకుని జాగ్రత్త పడుతున్నారట అనిత. ఎప్పటికప్పుడు పరిస్థితులను వాటి వెనుక లోగుట్లను హైకమాండ్‌కు చేరవేస్తున్నట్టు భోగట్టా.

Exit mobile version