NTV Telugu Site icon

Off The Record: టీఎస్‌పీఎస్సీపై లీకేజీల మచ్చ..! చైర్మన్‌ కంట్రోల్‌ తప్పిందా?

Tspsc

Tspsc

Off The Record: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేపట్టింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత అంతా నోటిఫికేషన్లకు తగ్గట్టుగా ప్రిపేర్‌ అవుతున్నారు. కొన్ని పరీక్షలు కూడా జరిగాయి. మరికొన్ని టైం టేబుల్‌ ప్రకారం జరగాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో వచ్చిన సమస్య TSPSCని కుదిపేస్తోందనే చెప్పాలి. AE పోస్ట్‌లకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్‌ కావడం.. దానికి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లోని ఉద్యోగులే పాత్రధారులు కావడంతో సమస్య తీవ్రత ఇంకా పెరిగింది. రాజకీయ పక్షాలతోపాటు వివిధ విద్యార్ధి, యవజన సంఘాలు భగ్గుమన్నాయి. కమిషన్‌ ఆఫీసు దగ్గర ధర్నాలు చేపట్టాయి. ప్రస్తుతం కమిషన్‌ ఆఫీస్‌ ప్రాంగణంలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

Read Also: Off The Record: రేవంత్‌రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు?

ప్రస్తుతం అసిస్టెంట్‌ ఇంజనీరు పరీక్షను కమిషన్‌ రద్దు చేసింది. మరో రెండు పరీక్షలు వాయిదా పడ్డాయి. గత ఏడాది అక్టోబరులో జరిగిన గ్రూప్‌ వన్‌ పరీక్ష త్రిశంకు స్వర్గంలో ఉంది. ఓ విధంగా ప్రభుత్వం కూడా ఈ అంశంలో డిఫెన్స్‌లో పడిందనే చెప్పాలి. అలాగే TSPSC విశ్వసనీయత కూడా ప్రశ్నార్థకంగా మారింది. కమిషన్‌ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి పనితీరుపైనా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆఫీసును కంట్రోల్‌లో పెట్టడంలో జనార్దన్‌రెడ్డి విఫలం అయ్యారనే విమర్శలు ఊపందుకుంటున్నాయి. TSPSC రాజకీయాలకు అతీతంగా ఉండాలని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కమిషన్‌ ఛైర్మన్‌గా IAS అధికారిగా పనిచేసిన జనార్దన్‌రెడ్డిని నియమించారు. ఆయనైతే పరీక్షలన్నీ పక్కాగా నిర్వహిస్తారని అనుకున్నారు.

Read Also: Off The Record: అవంతిని టార్గెట్‌ చేసిన జనసేన..! వైసీపీ నేతలకు గాలం..!

అయితే జనార్దన్‌రెడ్డి మెతక వైఖరి కొంప ముంచిందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. వేదాంత ధోరణి కమిషన్‌లో పనికి కాదని.. స్పీడ్‌గా నిర్ణయాలు తీసుకోవాలని పలువురు సూచించారట. అవన్నీ వర్కవుట్‌ కాకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష చేయాల్సిన దుస్థితి వచ్చింది. ఛైర్మన్‌కు సాంకేతిక నైపుణ్యం లేకపోవడంతో.. ఆఫీసు సిబ్బందిపైనే ఎక్కువ ఆధారపడ్డారనే ఆరోపణలు జనార్దన్‌రెడ్డిపై వస్తున్నాయి. ఆయన కఠినంగా ఉంటే సిబ్బంది తోక జాడించేవారు కాదని.. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఉపయోగం లేకుండా పోయిందని అనుకుంటున్నారు. అసలు కమిషన్‌లోని రహస్య ఛాంబర్లలోకి పెన్‌డ్రైవ్‌లు తెచ్చుకునేంత ధైర్యం సిబ్బందికి ఎలా వచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి చూసీ చూడనట్టు వ్యవహరించడం వల్లే తమకేం కాదనే లెక్కలేని తనానికి సిబ్బంది వచ్చారని టాక్‌. ఏతా వాతా ఇప్పుడు అన్నీ వేళ్లూ కమిషన్‌ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి సమర్థతవైపు చూపెడుతున్నాయి. కీలక బాధ్యతల్లో ఉండి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. ఐఏఎస్‌ అధికారిగా ఎలా ఉన్నప్పటికీ.. కమిషన్‌ ఛైర్మన్‌గా ఆయనలోని చేతకాని తనం బయట పడిందని కమీషన్‌ వర్గాలు.. రాజకీయ పక్షాలు అభిప్రాయ పడుతున్నాయట.