Site icon NTV Telugu

Off The Record: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు? ముగ్గురులో రెన్యువల్‌ ఎవరికి?

Trs

Trs

Off The Record: తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి సభ్యులుగా ఈసారి ఎవరికి అవకాశం వస్తుందనే ఉత్కంఠ అధికారపార్టీలో నెలకొంది. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో పదవీకాలం ముగిసే ముగ్గురులో ఒకరికి రెన్యువల్ ఛాన్స్ ఉంది. రెండేళ్లు మాత్రమే పదవీలో ఉన్న కూర్మయ్యగారి నవీన్‌కుమార్‌కు మరోసారి అవకాశం ఇస్తారని సమాచారం. మిగిలిన ఇద్దరు ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్ గౌడ్ ఔట్ అయినట్టే. గంగాధర్ గౌడ్‌ రెండుసార్లు MLA కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. వయసు మీద పడటం, అనారోగ్యం కారణంగా ఎలిమినేటికి ఈ సారి ఛాన్స్ లేదు. కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ ఈసారి శాసనమండలికి వెళ్లడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఉద్యమంలో కేసీఆర్‌ వెంట ఉన్న దేశపతి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. సీఎం ఆఫీసులో ఓఎస్డీగా చేశారు. తొమ్మిదేళ్లుగా MLC పదవులు ఖాళీ అయినపుడల్లా దేశపతి పేరు తెరపైకి వచ్చేది. తెలంగాణ భాషా సంఘం, సాంస్క్రతిక సారధి ఇలా బోర్డు చైర్మన్‌ పదవులకు ఒకప్పుడు దేశపతి పేరు వినిపించేది. మారిన పరిమాణాలతో ఎమ్మెల్యే కోటాలో దేశపతి పేరును దాదాపు ఫైనల్ చేసినట్లు సమాచారం. ఒకవేళ ఎమ్మెల్యే కోటా వద్దనుకుంటే కళాకారుడిగా గవర్నర్‌ కోటాలో పంపే ఛాన్స్ ఉంది. ఈ వారంలోనే దేశపతి పదవీపై ఉత్కంఠ వీడిపోనుంది.

Read Also: Off The Record: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుపై వైసీపీ ప్రత్యేక ఫోకస్‌..!

ఇక ఎమ్మెల్యే కోటాలో మూడో పదవీకి అలంపూర్ నియోజకవర్గానికి చెందిన చల్లా వెంకటరెడ్డిని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌.. బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత చల్లా పేరును వ్యూహాత్మకంగా ఎంపిక చేసినట్టు టాక్‌. అలంపూర్‌తోపాటు సరిహద్దుగా ఉన్న కర్నూలు జిల్లాలోనూ చల్లా కుటుంబానికి పేరుంది. కర్నూలు జిల్లా రాజకీయాల్లో చల్లాను క్రియాశీలకం చేయడానికి నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్యే చల్లా గులాబీ కుండువా కప్పుకొన్నారు. తెలంగాణలో ఏడు శాసనసమండలి సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో మూడు, గవర్నర్ కోటాలో రెండు, టీచర్ల కోటా ఒకటి, లోకల్ బాడీ కోటాలో మరొకటి ఖాళీ కానున్నాయి. ఎమ్మెల్యే కోటాలో మార్చి 29, గవర్నర్ కోటాలో మే 27లోపు ఎన్నిక ప్రక్రియ పూర్తి కావాలి. గవర్నర్ కోటాలో రాజేశ్వర్‌ రావు, ఫారుఖ్ హుస్సేన్‌, ఉపాధ్యాయుల కోటాలో కాటేపల్లి జనార్దన్ రెడ్డి, హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో జాఫ్రీ కొనసాగుతున్నారు. టీచర్‌, స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. మిగిలిన వాటికి వారం పదిరోజుల్లోనే షెడ్యూల్ రానుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీని మిత్రపక్షం ఎంఐఎంకు వదిలేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. టీచర్ల కోటా ఎమ్మెల్సీ విషయంలోనూ యూనియన్ల అభ్యర్థికి పరోక్షంగా మద్దతు ఇవ్వనుంది బీఆర్ఎస్‌.

Exit mobile version