Site icon NTV Telugu

Off The Record: అక్కడ టీడీపీ కేడర్‌కు దిక్కు లేకుండా పోయిందా? ఇంఛార్జ్‌ పట్టించుకోవడం లేదా?

Otr Tpt Tdp

Otr Tpt Tdp

Off The Record: తెలుగుదేశం పార్టీ కంచుకోట తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం. కానీ గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన కోటాలో వెళ్ళింది. రెండు పార్టీల లీడర్స్‌, కేడర్‌ అంతా కలిసి పనిచేశారు, భారీ మెజార్టీతో ఆరణి శ్రీనివాస్‌ ఎమ్మెల్యే అ్యయారు అది డిఫరెంట్‌ స్టోరీ. కానీ… ఇప్పుడు అసలు సమస్య అంతా… టీడీపీ కార్యకర్తలదేనట. బలం ఉన్న చోటే పార్టీకి దిక్కుమొక్కు లేకుండా పోయిందని బహిరంగంగానే అంటున్నారు తమ్ముళ్ళు. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్‌, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు స్టేట్ బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనరీ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌ పదవి ఇచ్చింది కూటమి ప్రభుత్వం. అయినాసరే…. ఆమె పార్టీ కోసం పని చేయడంలేదని, ఆ మాటకొస్తే… అసలు తిరుపతిలో టీడీపీ ఇన్ఛార్జ్‌ ఉన్నారా లేరా అన్న సందేహం కలుగుతోందని పార్టీ ద్వితీయ శ్రేణి కూడా అంటోంది. బలమైన పునాదులున్న నియోజకవర్గంలో వైసీపీ హయాంలో సుగుణమ్మ పార్టీని గాలికి వదిలేశారని, అది ఇప్పటికీ కొనసాగుతోందని చెబుతున్నారు తెలుగుదేశం కార్యకర్తలు. ఇక 2014-19 మధ్య పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుగుణమ్మ, ఆమె అల్లుడు సంజయ్ నిర్వహించిన భూదందాలు, అక్రమాలు చాలానే ఉన్నాయని చెబుతున్న లోకల్‌ టీడీపీ లీడర్స్‌…. ఇప్పుడు కూడా….ఆమె వ్యవహార శైలిలో మార్పు లేదని అంటున్నారు.

పార్టీ అధికారంలో ఉన్నాసరే…. తమ సమస్యలను చెప్పుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్లాలో అర్ధంకాని స్థితిలో ఉన్నామంటున్నారు స్థానిక కార్యకర్తలు. నడిపించే బలమైన నాయకత్వం లేకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో… పదేళ్లుగా పడుతున్న ఇబ్బందులు చాలు, ఇకనైనా ఆమె నుంచి విముక్తి కల్పించాలంటూ స్థానిక నేతలు, కార్యకర్తలు తిరుపతి-అమరావతి మధ్య షటిల్‌ చేస్తున్నట్టు సమాచారం. పనిలోపనిగా సుగుణమ్మ మన కోసం పనిచేయకపోగా… వైసీపీ వాళ్ళకు సహకరిస్తున్నారంటూ కొన్ని ఆధారాలు కూడా పార్టీ పెద్దలకు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఆమెకు అసలు వైసీపీతో సంబంధం లేకపోతే తిరుపతి టీడీఆర్ బాండ్ల కుంభకోణం విషయంలో ఎందుకు నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చి, రాష్ట్రస్థాయిలో చైర్మన్ పదవి తీసుకున్నాక కూడా మాజీ ఎమ్మెల్యే వైసీపీ మనిషిలాగే వ్యవహరిస్తున్నారంటూ కాస్త ఘాటుగానే రియాక్ట్‌ అవుతున్నారట తమ్ముళ్ళు. మొన్నటి గోశాల వివాదం నుంచి నిన్నటి కల్తీ నెయ్యి వ్యవహారం వరకు రోజుకో వివాదాన్ని తెరపైకి తెస్తున్న భూమన కరుణాకర్ రెడ్డి గురించి ఒక్కరోజైనా సుగుణమ్మ మాట్లాడారా అంటూ నగరంలో ఏ ఇద్దరు తమ్ముళ్ళు కలసినా చర్చించుకుంటున్నార.‌‌ కల్తీ నెయ్యి విషయంలో సరైన సమాధానం చెప్పాలంటూ ఓవైపు పార్టీ అధినేత చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే భూమన మాట్లాడిన మాటల్ని ఏకంగా అసెంబ్లీలోనే ప్రదర్శించి చూపారు.

ఇంత జరుగుతున్నా… తిరుపతి ఇన్ఛార్జ్‌గా ఉన్న సుగుణమ్మ మాత్రం… అసలు భూమన ఎవరో తెలియనట్టుగా ఉంటున్నారని మండి పడుతున్నట్టు సమాచారం. అసలు మేడమ్‌ ఎందుకిలా వ్యవహరిస్తున్నారంటూ ఆరా తీసిన కొందరికి ఆసక్తికరమైన విషయాలు తెలిశాయట. పనితీరు సరిగా లేదన్న కారణంతో ఇన్ఛార్జ్‌ పదవి నుంచి తొలగించాలనుకుంటున్నారని, ఆ విషయం తెలిసే.. సుగుణమ్మ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. పోస్టు పోతుందని తెలిసే… ఈ మధ్యకాలంలో సొంత వ్యాపారాలు ప్రారంభించారని, కొత్త స్కూల్ పెట్టడం కూడా అందులో భాగమేనన్నది తమ్ముళ్ళ మాట. ఎలాగూ పదవి పోతుంది కాబట్టి…. ఇప్పుడు అన్ని విషయాల మీద అనవసరంగా రియాక్ట్‌ అయిపోయి శత్రువుగా మారడం ఎందుకన్న ఉద్దేశ్యంతో సుగుణమ్మ కామ్‌ ఉంటున్నట్టు చెప్పుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. ఇదే సమయంలో మరో వాదన సైతం వినిపిస్తోంది తెలుగుదేశం సర్కిల్స్‌లో. గతంలో ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చక్రం తిప్పిన అల్లుడు సంజయ్ ఇప్పటికీ నగరంలో అడపాదడపా భూకబ్జాలు చేస్తూనే ఉన్నారన్న ఆరోపణలున్నాయి. కొద్ది రోజుల క్రితం తిరుచానూరు సర్కిల్ దగ్గర స్థలాన్ని ఆక్రమించారంటూ వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దీనిపై టీడీపీ హైకమాండ్‌కు ఫిర్యాదులు వెళ్ళాయటా‌. ఇలా వరుస వివాదాలకు తోడు పార్టీ పెద్దల నుంచి వచ్చిన సమాచారంతోనే సుగుణమ్మ సైలెంట్‌గా ఉన్నారన్న చర్చ జరుగుతోంది తిరుపతిలో. నామినేటెడ్‌ పదవి ఇచ్చినా యాక్టివ్‌గా లేకపోవడం, వైసీపీ ఆరోపణల మీద రియాక్ట్‌ అవకపోవడం, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం లాంటి వాటన్నిటినీ పరిశీస్తున్న వారు మాత్రం… ఒక క్లారిటీ రావడంతోనే ఆమె వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని అంటున్నారు. టెంపుల్‌ సిటీ టీడీపీ పరిణామాలు ఎలా మారతాయో చూడాలి మరి.

Exit mobile version