Site icon NTV Telugu

Off The Record: భారీ మెజార్టీతో గెలుపు.. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు ఆ ఎమ్మెల్యే తీరు..!

Arani Srinivasulu

Arani Srinivasulu

Off The Record: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పోటీ చేసి గెలిచిన ఏకైక అసెంబ్లీ సీటు తిరుపతి. ఆరణి శ్రీనివాసులు ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఉమ్మడి జిల్లాలో పోటీ చేసింది ఒకే సీటు అయినా…ఎన్నికల టైంలో… ఆ గెలుపు సౌండ్ మాత్రం రాయలసీమ మొత్తంలో ప్రతిధ్వనించింది. చివరి నిమిషంలో సీటు దక్కినా… 60వేలకు పైగా భారీ మెజారిటీతో ఆరణి విజయం సొంతం చేసుకోవడం గురించి అప్పట్లో బాగా మాట్లాడుకున్నారు. ఎన్నికలకు ముందు వరకు వైసీపీ ఎమ్మెల్యే గా ఉన్న శ్రీనివాస్‌కు సీటు ఇవ్వడాన్ని తిరుపతి టిడిపి, జనసేన నేతలు తీవ్రంగా వ్యతిరేకించినా.. పవన్ కళ్యాణ్ మాత్రం ఆయనవైపే మొగ్గారు. సరే… పెద్దోళ్ళు నిర్ణయం తీసుకున్నారు, ఇక చేసేదేముందనుకుంటూ… అంతా కలిసి పని చేయడంతో భారీ మెజార్టీ సాధ్యమైందన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం. ఇక గెలిచాక… చాలామంది ఎమ్మెల్యేల్లాగే… ఆరణి కుటుంబ సభ్యులు కూడా సీన్‌లోకి ఎంటరైపోయారు. ఆగడాలు శృతిమించుతున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తడంతో…. డైరెక్ట్‌గా పవన్‌కళ్యాణ్‌ జోక్యం చేసుకుని ఎమ్మెల్యేకి క్లాస్‌ పీకినట్టు చెప్పుకున్నారు. అది నిజమేనా అన్నట్టు కొన్నాళ్ళుగా…. ఆరోపణల పరంపర తగ్గిపోయింది. ఆరణి కూడా తిరుపతి నగర అభివృద్ధి మీదే దృష్టి పెట్టారన్న మాటలు వినిపిస్తున్నాయి. అంతవరకు బాగానే ఉందని అనుకుంటున్నా…. ఈ మధ్యకాలంలో మాత్రం ఆయన వ్యవహారం గురించి కూటమి నేతల్లో కొత్త చర్చ జరుగుతోందట. ఎమ్మెల్యే కేవలం శంకుస్థాపనలు, సమస్యల పరిష్కారం అంటూ తిరుగుతున్నారు తప్ప… రాజకీయంగా ఏ మాత్రం శ్రద్ధ తీసుకోవడం లేదని, అది వైసీపీకి అలుసుగా మారుతోందని మాట్లాడుకుంటున్నట్టు తెలిసింది.

Read Also: IND vs AUS: స్మృతి మందాన దెబ్బ.. ఆసీస్ అబ్బా.. ఆస్ట్రేలియాపై భారత్ భారీ విజయం!

ఎమ్మెల్యేకి ఇప్పటికీ సొంత పార్టీలోని కొందరితో పాటు… టీడీపీ నాయకులతో కూడా గ్యాప్‌ ఉన్నట్టు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అయినాసరే… ఆ గ్యాప్‌ని తగ్గించుకునేందుకు ఆరణి వైపు నుంచి చొరవలేదని కూటమి నాయకులు అసహనంగా ఉన్నారట. పైగా… నియోజకవర్గంలో మారుతున్న తాజా రాజకీయ పరిస్థితుల్లో ఆయన మౌనం ఎందుకంటూ కూటమి కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. ఓవైపు తిరుపతి వైసీపీ లీడర్స్‌ చెలరేగుతున్నా… ఇక్కడ ఆరణి శ్రీనివాస్‌ వైపు నుంచి మాత్రం నో రియాక్షన్‌ అంటూ స్థానిక నాయకులు కొందరు జనసేన అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ముఖ్యంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను, టీడీపీని టార్గెట్ చేసుకుంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న విమర్శలకు ఆశించిన స్థాయిలో కాదు కదా… అసలు ఎదుర్కొనే కనీస ప్రయత్నం కూడా ఎమ్మెల్యే వైపు నుంచి జరగడం లేదని రగిలిపోతున్నారట జనసైనికులు. భూమన కరుణాకర్ రెడ్డి గోశాల సహా…. తిరుమల టార్గెట్‌గా పలు వివాదాలను తెరపై తెస్తూ… రోజుకో ప్రెస్ మీట్‌తో ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, మొత్తం ప్రభుత్వాన్నే ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంటే‌‌… స్థానిక ఎమ్మెల్యేగా ఉంటూ… ఆరణి శ్రీనివాస్‌ ఎందుకు కౌంటర్ చేయలేకపోతున్నారని సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారట జనసేన కార్యకర్తలు. నగర అభివృద్ధి అంటూ ఎమ్మెల్యే తిరగడం వందకు వంద శాతం కరెక్టేగానీ…
అదే సమయంలో ప్రత్యర్థులు ప్రభుత్వాన్ని డ్యామేజ్‌ చేస్తుంటే… చూస్తూ ఊరుకోవడం కూడా కరెక్ట్‌కాదు కదా అన్న మాటలు వినిపిస్తున్నాయి కూటమి నాయకుల నుంచి. తాజాగా భూమన ఓ విగ్రహ వివాదాన్ని తెరపైకి తెచ్చి సనాతన ధర్మ యోధుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు… అదే స్థాయిలో ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును టార్గెట్ చేశారాయన. అది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌..

అయితే… ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందనిఖండించాల్సిన ఎమ్మెల్యే.. ఆ బాధ్యత ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారట జనసైనికులు. స్థానిక టిడిపి నేతలు కొందరు భూమన తీరును ఖండించారు తప్ప ఎమ్మెల్యే మాత్రం… నాకేం తెలియదు అన్నట్టు ఉండటంపై జనసేన పెద్దలు కూడా అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. రాయలసీమలో గెలిచిన ఏకైక బలిజ సామాజి వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఆరణి. ఆయన రికార్డ్‌ మెజార్టీతో గెలిచినప్పుడు వినిపించిన సౌండ్‌ ఇప్పుడేమైందంటూ… సెటైర్స్‌ వేస్తున్నారు కూటమి నాయకులు. తాను తిరుమలకు కూడా ఎమ్మెల్యేని అన్న సంగతిని ఆయన మర్చిపోయారా? లేక వైసీపీలో ఉన్నప్పటి పాత పరిచయాలు గుర్తుకువచ్చి ఇప్పుడు నోరు పెగలడం లేదా అంటూ ఘాటుగా రియాక్ట్‌ అవుతున్నారు తిరుపతి జనసైనికులు. ఇదే సమయంలో మరో వాదనా వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పనీపాటా లేకుండా రోజుకొక ప్రెస్ మీట్ పెట్టి తిరుమల కొండ లక్ష్యంగా ఏదో ఒక అసత్య ప్రచారం చేస్తుంటారని, ఆయన చేసే టైంపాస్‌ పాలిటిక్స్‌కు ప్రతిరోజు నేను రియాక్ట్‌ అవ్వాల్సిన అవసరం లేదన్న అభిప్రాయంతో ఆరణి ఉన్నారంటూ వెనకేసుకొస్తున్నారు ఆయన సన్నిహితులు. కానీ… ప్రతిదానికీ రియాక్ట్‌ అవకున్నా… తీవ్ర స్థాయి ఆరోపణలు వచ్చి, పార్టీకి, ప్రభుత్వానికి పెద్ద డ్యామేజ్‌ జరుగుతున్నప్పుడు, మత పరంగా సున్నితమైన వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకోకుంటే… ఇక ఎమ్మెల్యే ఉండి కూడా ఏం లాభం అన్నది తిరుపతి కూటమి నేతల క్వశ్చన్‌.

Exit mobile version