Site icon NTV Telugu

Off The Record: తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తోటి వైసీపీ నేతలతోనే కయ్యాలు పెట్టుకుంటున్నారా..?

Thopudurthi Prakash Reddy

Thopudurthi Prakash Reddy

Off The Record: 2024 ఎన్నికల్లో తగిలిన ఘోరమైన దెబ్బ నుంచి వైసీపీ దాదాపుగా కోలుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రకరకాల కార్యక్రమాలతో ప్రజల్లో ఉండేందుకు ప్లాన్‌ చేస్తోంది పార్టీ అధిష్టానం. నియోజకవర్గాల్లో నాయకులు కూడా అందుకు తగ్గట్టే గేరప్‌ అవుతున్నారు. ఈ క్రమంలోనే… రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదపుర్తి ప్రకాష్‌రెడ్డి కూడా అన్ని కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. రామగిరి ఎంపీపీ ఎన్నిక, హంద్రీనీవా కాల్వకు లైనింగ్ వంటి అంశాలతో జనంలోకి బాగానే వెళ్లారాయన. అలాగే… తన రాజకీయ ప్రత్యర్థి అయిన పరిటాల కుటుంబాన్ని కూడా తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. అంతవరకే ఉంటే అదో లెక్క. కానీ… రాను రాను తోపుదుర్తి లెక్కలు మారిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు నియోజకవర్గంలో. ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ నాయకుల్ని కూడా టార్గెట్‌ చేస్తుండటం వైసీపీలో కలకలం రేపుతోంది. ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత… చాన్నాళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నారు ప్రకాష్‌రెడ్డి. అది చూసి అసలాయన ఇక యాక్టివ్‌ పాలిటిక్స్‌ చేస్తారా అన్న డౌట్స్‌ కూడా వచ్చాయట చాలా మందికి. సరిగ్గా… అలాంటి సమయంలోనే నియోజకవర్గంలోకి ఎంటరయ్యారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.

ఇక రాప్తాడు నాదేనన్నట్టు తెగ తిరిగేశారాయన. ఒక దశలో అయితే… వచ్చే ఎన్నికల్లో రాప్తాడు వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవేనన్న రేంజ్‌లో చెప్పుకున్నారు. అదే ఊపులో మాధవ్‌ కొన్ని తేడా పనులు కూడా చేశారట. ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన వారిని సస్పెండ్ చేసింది పార్టీ. అలాంటి వారిని మాధవ్ చేరదీయడం వివాదాస్ఫమైంది. చివరకు ఆ పంచాయతీ అధిష్టానం వరకు వెళ్ళిందట. దీంతో మాధవ్ సైలెంట్ అయిపోయారు. కానీ… తోపుదుర్తి మాత్రం తాను రీ ఛార్జ్‌ అయి వచ్చాక మాధవ్‌ను టార్గెట్‌ చేసుకున్నారన్నది వైసీపీ వర్గాల టాక్‌. ఇక అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పై కూడా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే. పార్టీ ఆఫీసులో ప్రెస్‌మీట్‌ కూడా పెట్టకుండా చేస్తున్నారటూ ఆసహనం వ్యక్తం చేశారాయన. ఈ వివాదం ఇంకా కొనసాగుతుండగానే… ధర్మవరం నియోజకవర్గంలో త్వరలో తాను పార్టీ కార్యాలయం ప్రారంభిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ కేంద్రం రాప్తాడులో కాకుండా ఆయన పార్టీ కార్యాలయాన్ని ధర్మవరంలో ఎందుకు ఓపెన్‌ చేయాలనుకున్నారన్న విషయమై తెగ చర్చలు జరిగాయి. రాప్తాడు సెగ్మెంట్‌ పరిధిలోని కనగానపల్లి, రామగిరి, చెన్నే కొత్తపల్లి మండలాలు ధర్మవరం సమీపంలో ఉంటాయి. దీంతో తాను కార్యక్రమాలు నిర్వహించాలన్నా.. ప్రెస్మీట్లు పెట్టాలన్నా… అనంతపురం రావాలంటే ఇబ్బంది అవుతోంది కాబట్టి… అక్కడికి దగ్గరలో ఉన్న ధర్మవరంలో పార్టీ ఆఫీస్‌ పెడతాన్నది తోపుదుర్తి వాదన.

కానీ… దీనిపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలంటే ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చని,మారుతున్న టెక్నాలజీని వాడుకుంటే… అదేం పెద్ద విషయం కాదన్నారు. ముందు ఆ పని చేయకుండా ఆఫీసుకు రిబ్బన్‌ కట్‌ చేస్తే ఉపయోగం ఏంటంటూ ఘాటు రియాక్షనే వచ్చింది. అసలు రాప్తాడు మాజీ ఎమ్మెల్యేకి ధర్మవరంలో పనేంటన్నది కేతిరెడ్డి క్వశ్చన్‌. ఇలా…ప్రకాష్ రెడ్డి వరుసగా సొంత పార్టీ నాయకులతో కయ్యానికి దిగుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మొన్నటికి మొన్న పార్టీ పిలుపునిచ్చిన ఓ కార్యక్రమం నిర్వహించేందుకు కూడా ప్రకాష్ రెడ్డి ధర్మవరం నియోజకవర్గాన్ని ఎంచుకోగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఏకంగా అధిష్టానం దగ్గరికి వెళ్లి సీరియస్‌గా చెప్పినట్టు సమాచారం. ఆయన ధర్మవరంలో కార్యక్రమాలు నిర్వహిస్తే.. తాను చేయబోనని తేల్చేశారట. దీంతో… ఇలా సొంత పార్టీ లీడర్స్‌తో గిల్లికజ్జాలు పెట్టుకుని తోపుదుర్తి ఏం సాధించాలనుకుంటున్నారన్న చర్చలు జరుగుతున్నాయి అనంతపురం పొలిటికల్ సర్కిల్స్‌లో.

Exit mobile version