Off The Record: తెలంగాణ కేబినెట్‌లో హెవీ వెయిట్స్‌కు కొదవలేదు. ఎవరికి వారు నేనే సీఎం అని ఫీలయ్యే బ్యాచ్ కూడా బాగానే ఉందని చెప్పుకుంటారు. ఈ పరిస్థితుల్లో… తాజాగా ఒకరిద్దరి వ్యవహారశైలి కాస్త అనుమానాస్పదంగా ఉందట. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలక అంశాలపై సమాచారం తెలుసుకునేందుకు వాళ్ళు వేరే రూట్‌లో ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇతర శాఖల సంగతి సరే… చివరికి సొంత డిపార్ట్‌మెంట్‌లో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు కూడా…. సమాచారం కావాలంటూ ఆర్టీఐకి దరఖాస్తులు చేస్తున్నారట. దీంతో… ఆయా విభాగాల అధికారులు సొంత మంత్రికే ప్రాధాన్యం ఇవ్వడం లేదా… లేక బ్యాక్‌గ్రౌండ్ స్టోరీస్ వేరే ఉన్నాయా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం సచివాలయ వర్గాల్లో… దీని గురించే హాట్ హాట్‌గా మాట్లాడుకుంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపు డిసెంబర్‌తో రెండేళ్లు పూర్తవుతుంది. ఈ రెండేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల వివరాలు కావాలని ఒకరిద్దరు మంత్రులు అడుగుతున్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ నిర్ణయాలతో పాటు పలు శాఖల్లో జరుగుతున్న పనుల వివరాలు తెలుసుకునేందుకు నానా తంటాలు పడుతున్నట్లు సమాచారం.
కేబినెట్‌లో కీలకంగా భావిస్తున్న మంత్రులు భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని సమాచార సేకరణ చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా వివిధ సంస్థలు, వ్యక్తులకు కేటాయించిన భూములు, అలాగే కాంట్రాక్టు పనుల కోసం దాఖలైన టెండర్ల వివరాలను ఏకంగా ఆర్టీఐ ద్వారా అడుగుతున్నట్టు తెలుస్తోంది. పనులు దక్కించుకునేందుకు ఎన్ని కంపెనీలు టెండర్లు వేశాయి? ఆయా కంపెనీలు సమర్పించిన టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్స్ వివరాలు ఇవ్వాలని దరఖాస్తుల్లో పేర్కొంటున్నట్టు సమాచారం. అందుకు తగ్గట్టే… జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు తమ పరిధిలోని సమాచారాన్ని ఇస్తున్నారని తెలుస్తోంది. కొందరు ఆఫీసర్లు సదరు ఆర్టీఐ అప్లికేషన్స్‌కు స్పందించకుంటే… మంత్రి మనుషులు ఫోన్ చేసి మరీ… తమదైన పద్ధతిలో వేధిస్తున్నారట. రాష్ట్ర మంత్రులు అడిగిన సమాచారం ఇవ్వని అధికారులు ఎవరు? ఏఏ శాఖల్లో సమాచార శాఖ హక్కు ద్వారా దరఖాస్తు చేసుకున్నారంటూ సెక్రటేరియెట్‌లో తెగ ఆరా తీసేస్తున్నారు పలువురు. మంత్రులు అడిగితే వారి పరిధిలో ఉండే సమాచారాన్ని వెంటనే ఇస్తారు? అలాంటిది ఇప్పుడు మినిస్టర్ అడిగినా సమాచారం ఇవ్వడం లేదంటే అధికారులు మంత్రులను పట్టించుకోవడం లేదా? లేక తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనన్న భయమా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ సంగతి ఎలా ఉన్నా…రాష్ట్ర ప్రభుత్వం వివిధ సందర్భాల్లో తీసుకున్న కీలక నిర్ణయాల వివరాలు తెలుసుకుని సదరు మంత్రులు ఏం చేస్తారన్న ప్రశ్నలు కొత్తగా తలెత్తుతున్నాయి. అందులోనూ… ఆర్టీఐ కింద అప్లయ్ చేస్తున్నారంటే… రికార్డెడ్‌గా తెలుసుకోవాలనుకుంటున్నారా? అంత పకడ్బందీగా సమాచారం సేకరించి ఏం చేస్తారన్నది బిగ్ క్వశ్చన్. అధికారికంగా వివరాలు ఉండి పోతాయని మంత్రులు భావిస్తున్నారా? లేక వాళ్ళ ఆలోచన వేరే ఉందా? అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.
