Site icon NTV Telugu

Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌ను అధిష్టానం పక్కన పెట్టిందా..? నేతల్లో అసంతృప్తి అందుకేనా..!

Telangana Congress

Telangana Congress

Off The Record:పార్టీ ప్లీనరీకి సిద్ధమవుతుంది కాంగ్రెస్‌. ఈనెల 24 నుంచి 26 వరకు జరిగే సమావేశాలు పార్టీకి కీలకం. ఈ ప్లీనరీ కోసం అధిష్ఠానం కీలక కమిటీలను వేసింది. ఆ కమిటీల్లో ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేతలకు ప్రాధాన్యం దక్కింది. కాంగ్రెస్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న ఏపీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డిని ఓ కమిటీకి చైర్మన్‌గా ప్రకటించింది. వీరితోపాటు కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, కొప్పుల రాజు, కేంద్ర మాజీ మంత్రి జేడీశీలం లాంటి నాయకులకు కమిటీలలో ప్రయారిటీ ఇచ్చారు. ఏపీలో పార్టీ ఉనికి కోల్పోతోందని అనుకుంటున్న తరుణంలో.. ఆ రాష్ట్ర నాయకులకు దక్కిన ఛాన్స్‌ చూశాక తెలంగాణ కాంగ్రెస్ నేతలు మనసు చిన్న బుచ్చుకున్నారట. వచ్చే ఆరేడు నెలల్లో ఎన్నికలు ఉన్న తెలంగాణను వదిలేయడంపై కినుకు వహించినట్టు తెలుస్తుంది. టీకాంగ్రెస్‌లో ఉన్న ముఖ్య నాయకులు.. ఎవరికీ కమిటీలో ప్రాధాన్యం ఇవ్వలేదని చర్చ సాగుతోంది. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహలకే కమిటీలలో చోటు లభించింది. పైగా ఏ ఒక్క కమిటీని లీడ్ చేసే బాధ్యతలు అప్పగించలేదు. వాస్తవానికి రాష్ట్రంలో చాలామంది సీనియర్లు ఉన్నా ఎవరినీ పరిగణనలోకి తీసుకోలేదు.

Read Also: Off The Record: పెద్దాపురం టీడీపీలో టికెట్‌ రచ్చ..!

తెలంగాణ కాంగ్రెస్‌ లీడర్లలో ప్లీనరీ కమిటీలలో ఒకరికి చోటు ఇస్తే ఇంకొకరు అలక వహిస్తారని అనుమానం వచ్చి ఉండొచ్చని కొందరి వాదన. అందుకే AICC తెలంగాణ నేతలపై దృష్టి సారించలేదా? లేక పీసీసీ చీఫ్‌కి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని కమిటీలో వేసి బుజ్జగించే ప్రయత్నం చేసిందా? అనే చర్చ కూడా నడుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో జానారెడ్డి.. వీహెచ్‌, పొన్నాల లక్ష్మయ్య.. కోదండరెడ్డి… లాంటి సీనియర్లు ఉన్నారు. వీరెవరినీ ఎంపిక చేయకపోవడంతో కొంత అసంతృప్తితో ఉన్నట్టు కనిపిస్తోంది. పార్టీ ప్లీనరీ కమిటీల్లో అవకాశం దక్కకపోయినా.. AICC కమిటీల్లో తెలంగాణకు పెద్దపీట వేస్తారని చెబుతున్నారు. CWCలో కూడా అన్యాయం జరుగుతోందని.. ఈ సారి దానిని సరిచేస్తారని కొందరు అభిప్రాయ పడుతున్నారు. అయితే ప్లీనరీ కమిటీల్లోనే రాష్ట్రాన్ని పక్కన పెట్టినప్పుడు AICC, CWC కమిటీల్లో ఎంత వరకు టీ కాంగ్రెస్‌ను పరిగణనలోకి తీసుకుంటారనేది మరికొందరి ప్రశ్న.

Exit mobile version