Off The Record: అధికారం పోగానే పార్టీని వదిలేయడం, తిరిగి పవర్ రాగానే ఘర్ వాపసీ అనడం సమకాలీన రాజకీయాల్లో సహజమైపోయింది. అంతా మా ఇష్టం అన్నట్టుగా జంపింగ్ జపాంగ్‌లు గెంతులేస్తుంటే… అటు రాజకీయ పార్టీలు కూడా రకరకాల కారణాలు, అవసరాలతో ఇలాంటి బ్యాచ్‌ని ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. దీంతో ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీలోకి చేరడం చాలామందికి పరిపాటిగా మారింది. రాజకీయ పార్టీలు కూడా అదే మన బలం అనుకుంటుండటంతో.. అలాంటివాళ్ళ పని తేలికవుతోంది. అదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో కూడా రిపీట్ అవబోతోందా? పాత వాళ్ళ కోసం పీసీసీ గేట్లెత్తేసినట్టేనా అన్న చర్చ మొదలైంది. సోమవారం జరిగిన పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవడంపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయట. పవర్ లేనప్పుడు వదిలేసి వెళ్ళిన వాళ్ళని తిరిగి పార్టీలోకి తీసుకోవాలని డిసైడై ఆ మేరకు విస్తృత స్థాయి సమావేశం వేదికగా పిలుపునిచ్చింది పీసీసీ నాయకత్వం. అయితే… పాత వాళ్ళయినా సరే… వెళ్ళి మళ్ళీ వచ్చినోళ్ళకు పదవులు ఇవ్వబోమని, పార్టీ కోసం పని చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది. సరే…. వచ్చాక వాళ్ళకు పోస్ట్‌లు ఇస్తారా? లేదా? అన్నది వేరే సంగతి.
కానీ… అలా పిలుపునివ్వడం మాత్రం మెజార్టీ కాంగ్రెస్ నేతలకు నచ్చడం లేదట. ముందు ఇక్కడ ఉన్నవాళ్ళకే దిక్కు లేదని అంటుంటే… బయటికి వెళ్ళిపోయినవాళ్ళని కూడా రప్పించి ఏం చేద్దామనుకుంటున్నారంటూ పార్టీలో టాక్ మొదలైంది. రకరకాల వలస నాయకులతో ఇప్పటికే పార్టీ కిటకిటలాడుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు చాలామంది. వీళ్ళలో కొందరికి టికెట్స్ వచ్చాయి.. ఇంకొందర్ని పదవులు వరించాయి. కానీ… దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉండి, ఎన్నికల్లో కష్టపడ్డ చాలా మందికి అవకాశాలు రాకుండా పోయాయి. దీనికి తోడు..ఎన్నికల తర్వాత పది మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ రాగం పాడుతున్నారు. వాళ్ళు లాంఛనంగా పార్టీలో చేరారా లేదా అన్న చర్చను కాసేపు పక్కనపెడితే… ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నారన్నది పరిశీలకుల మాట. ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో…. కాంగ్రెస్ నాయకులే పరాయి వాళ్ళుగా మారిపోయిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేల అనుచరుల పేరుతో కొత్తగా వచ్చిన వాళ్ళకే నియోజకవర్గాల్లో అవకాశాలు దక్కుతున్నాయి తప్ప… మమ్మల్ని అస్సలు పట్టించుకోవడం లేదన్న అసహనం ఆ పది సెగ్మెంట్స్‌లోని కాంగ్రెస్ ద్వితీయ శ్రేణిలో పెరుగుతోంది. ఉన్నవాళ్ళకే దిక్కులేని ఈ పరిస్థితుల్లో… బయటికి వెళ్లిన వాళ్ళని మళ్ళీ వెనక్కి రండని పిలవడం ఎందుకన్న చర్చ జరుగుతోంది.
Read Also: Whatsapp Group: దొంగను పట్టించిన వాట్సప్ గ్రూప్.. వాట్సపా మజాకా..
క్లిష్ట సమయంలో పార్టీని వదిలేసి పోయిన వారిని.. అధికారంలోకి రాగానే ఆహ్వానించడం ఏంటన్నది ఎక్కువ మంది నేతల ప్రశ్న. మరోవైపు సుమారు 25 నియోజక వర్గాల్లో కొత్త…పాత పంచాయతీ నడుస్తోంది. వాటి మీదనే ఇప్పటిదాకా ఫోకస్ పెట్టకుండా… పోయిన వాళ్ళు మళ్లీ రండి, ఘర్ వాపసీ అంటూ పిలుపులు ఇవ్వడం కరెక్ట్ కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది కాంగ్రెస్ పార్టీలో. బయట ఉన్న నేతలు తిరిగి రావడం వల్ల తలనొప్పులు తప్పితే ఉపయోగం ఉండబోదని, దానికి బదులు ఉన్న పంచాయితీల్ని సెటిల్ చేసుకుంటేనే ఎక్కువ ఉపయోగం అన్న అభిప్రాయం బలపడుతోంది గాంధీభవన్‌లో. పాత కొత్త నేతలు కలిసి పని చేసేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకుండా… మళ్లీ గెట్లెత్తితే…. తలకు మించిన భారం అవుతుందంటున్నారు ఎక్కువ మంది సీనియర్స్. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా… ఈ పాత…కొత్త పంచాయితీ మీద ఇప్పటిదాకా దృష్టి పెట్టలేదు. పిలిచి మాట్లాడితే చాలావరకు సమస్యలు సద్దుమణిగే అవకాశం ఉన్నా… ఆ పని మాత్రం జరగడం లేదంటున్నారు పార్టీ నాయకులు. చెయ్యాల్సిన పని చేయకుండా… ఇప్పుడు కొత్తగా.. రండి బాబు రండని హారతి పళ్ళేలతో రెడీ అయిపోతే… సమస్యలు పెరగడం తప్ప పైసా ప్రయోజనం ఉండదన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి గాంధీభవన్‌లో. ఈ వాదనను పార్టీ పెద్దలు చెవికెక్కించుకుంటారా లేదా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.
