Off The Record: శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా బాగా ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గం ఎచ్చెర్ల. కానీ… ఇక్కడ ఇప్పటికీ టీడీపీ ఇన్ఛార్జ్ లేరు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి గెలవగా… ఏడాదిన్నర కావస్తున్నా… ఇంతవరకు తమ గోడు వినే నాధుడు కరవయ్యాడని ఆవేదన పడుతున్నారు తమ్ముళ్ళు. టీడీపీకి దశాబ్దాలుగా సేవలందించిన చాలా మంది ఇన్ఛార్జ్ పదవికోసం ప్రయత్నాలు చేస్తున్నా… అధిష్టానం మాత్రం కిమ్మనడంలేదట. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు పాతుకుపోయే ప్రయత్నాల్లో ఉండటం టీడీపీ లీడర్స్‌ని కలవరపెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. మాజీ మంత్రి కళా వెంకటరావు కుమారుడు రామ్ మల్లిక్ నాయుడుతో పాటు మరో ఇద్దరు ముగ్గురు నాయకులు ఎచ్చెర్ల ఇన్ఛార్జ్ పదవి కోసం ఆవురావురుమంటున్నారు. కానీ… పార్టీ పెద్దల మనసులో ఏముందో తెలియక వాళ్ళంతా లోలోపల మధనపడుతున్నారట. మరోవైపు ఎచ్చెర్ల టీడీపీ వింత పరిస్దితిని ఎదుర్కొంటోంది. గతంలో టిక్కెట్ కోసం కుమ్ములాటలకు దిగిన కళా వెంకట్రావ్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వర్గాలు రెండూ ప్రస్తుతం నియోజకవర్గ కేడర్‌కు అందుబాటులో ఉండటం లేదట.
Read Also: ZPTC By Elections: కడప జిల్లా జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ట్విస్టుల మీద ట్విస్టులు..!
చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఉన్న కళా…తన ఫోకస్ మొత్తం అటువైపు పెట్టారు. ఇక విజయగనగరం ఎంపీ అయ్యాక కలిశెట్టి అప్పలనాయుడు కూడా… అయితే ఢిల్లీ… లేదంటే విజయనగరంలో ఉండటంతో ఎచ్చెర్ల టిడిపి నేతలంతా పనుల కోసం బీజేపీ ఎమ్మెల్యే చుట్టూ తిరగాల్సి వస్తోందట. అయితే.. ఆయన వాళ్ళని పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఎన్నికల సమయంలో కూటమి అభ్యర్ధిగా నడికుదిటిని భుజాల మీద మోశారు టీడీపీ కార్యకర్తలు. అయినాసరే…ఇప్పుడాయన తమను పట్టించుకోవడం లేదన్న ఆవేదన పెరుగుతోందట వాళ్ళలో. పైగా దశాబ్దాలుగా టీడీపీని నమ్ముకుని ఉన్న మేం.. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే దగ్గరికి ఏం అడగగలం, ఏమని చెప్పుకోగలమని ఆవేదనగా ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీలో సీనియర్స్ అయినా…. ఇతర పార్టీల నేతల ముందు చులకన అవుతున్నామని బాధపడుతున్నారట. తమ పార్టీకంటూ.. ఓ ఇన్ఛార్జ్‌ని పెడితే.. కష్ట సుఖాలు చెప్పుకుంటాం కదా అన్నది ఎచ్చెర్ల టీడీపీ నేతల మాట. అదే సమయంలో ఎమ్మెల్యే ఈశ్వరరావు తనదైన శైలిలో పావులు కదుపుతున్నారట.
Read Also: Ghati : పాపం అనుష్క.. ఎన్ని వాయిదాలు వేసినా లాభం లేకపాయే..
లోకల్ టీడీపీలోని రెండు గ్రూపుల మధ్య విభేదాల్ని తనకు అనుకూలంగా మల్చుకునే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి కళా వెంకట్రావ్ వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ… ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు టీంతో హాయ్ అంటే హాయ్ , బాయ్ అంటే బాయ్ అన్నట్టు వ్యవహరిస్తున్నారట. దీంతో ద్వితీయ శ్రేణి నేతలు లోలోన రగిలిపోతున్నట్టు సమాచారం. ఎచ్చెర్ల టీడీపీకో ఇన్ఛార్జ్‌ని నియమిస్తే… ఇలాంటి వాటికి చెక్ పడుతుంది కదా అన్నది స్థానిక నేతల అభిప్రాయం. ఈ క్రమంలోనే… నియోజకవర్గంలో జరుగుతున్న అవమానాలను పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్ళారట ఎచ్చెర్ల టిడిపి నేతలు. ఇక్కడే వాళ్ళకు ఇంకో డౌట్ కూడా ఉందని అంటున్నారు. ఇక్కడ ఇన్చార్జ్‌ని నియమించకుండా ఏదో శక్తి అడ్డుపడుతోందన్నది వాళ్ళ అనుమానం. ఆ శక్తి తమ పార్టీలోని సీనియర్ నాయకులా? లేక బీజేపీ ఎమ్మెల్యేనా అన్నది క్లారిటీ రావాల్సి ఉందని అంటున్నారు. మరోవైపు ఇన్ఛార్జ్ లేక లీడర్స్ తలోదారిన వెళ్తున్నారు. టీడీపీ అధిష్టానం ఇప్పుడే జాగ్రత్త పడకుంటే.. మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
