Site icon NTV Telugu

Off The Record: తాడిపత్రి వైసీపీలో దృశ్యం మారబోతోందా..? పెద్దారెడ్డి సీటుకి ఎసరు పెడుతున్నారా?

Kethireddy Pedda Reddy

Kethireddy Pedda Reddy

Off The Record: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దారెటు..? ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇదే హాట్ టాపిక్. పోలీస్‌ ఆంక్షల కారణంగా… సొంత నియోజకవర్గం తాడిపత్రికి వెళ్లలేరు. 14 నెలల నుంచి ఆయన టౌన్‌లోకి రాకుండా ఇటు జేసీ ప్రభాకర్‌రెడ్డి, అటు పోలీసులు అడ్డుకుంటున్నారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానంటూ తన సైన్యాన్ని సిద్ధం చేస్తారు జేసీ. నువ్వు అటు వైపు చూసినా… లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందంటారు పోలీసులు. దీంతో… సొంత ఇంటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు పెద్దారెడ్డికి. ఇదంతా ఆయన ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వ్యవహరించిన తీరుకు ప్రతిఫలమేనన్నది జేసీ మాట. అప్పట్లో ప్రభాకర్‌రెడ్డితో పాటు ఆయన కుమారుడు, వర్గీయులపై కేసులు పెట్టించి జైలుకు పంపించడం, అలాగే జేసీ ప్రధాన అనుచరుడు ఎస్వీ రవీంద్ర రెడ్డి అలియాస్ పొట్టి రవిని ఏకంగా జిల్లా బహిష్కరణ చేయడం వంటివి ఇప్పుడు పెద్దారెడ్డిని వెంటాడుతున్నాయట. గతంలో కోర్టు ఆర్డర్లు ఉన్నా, హ్యూమన్ రైట్స్ ఆదేశించినా పెద్దారెడ్డి లెక్క చేయలేదంటున్నారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కూడా హైకోర్టును ఆశ్రయిచంగా.. ఈ సారి కచ్చితమైన డేట్ టైం సూచించి.. ఆ సమయానికి పోలీసులే ఆయన్ని తాడిపత్రికి తీసుకెళ్లాలని ఆదేశించింది.

Read Also: Hyderabad Crime: ఓ మైనర్ బాలుడు కిరాతకంగా హత్య చేస్తాడా?

అంతే కాదు.. ఎవరైనా అడ్డుకుంటే అదనపు బలగాలను ప్రయోగించాలని కూడా స్పష్టంగా చెప్పింది. దాంతో ఇక నాకు లైన్‌ క్లియరైందని పెద్దారెడ్డి భావించినా… పోలీసులు మాత్రం లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందంటూ అడ్డుకున్నారు . పైగా కోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద అప్పీలుకు వెళ్లారు. దీంతో మూడు వారాల పాటు స్టే విధించింది హైకోర్ట్‌. ఇప్పుడిక పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లలేరు. ఒకవేళ ఏదో.. బలవంతంగా అడుగు పెట్టగలిగినా… అక్కడ యాక్టివ్‌ పాలిటిక్స్ చేయలేరు. ఈ పరిస్థితుల్లో…అక్కడ వైసీపీ సంగతి ఏంటన్నది అసలు ప్రశ్న. ఇప్పటికే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినప్పటి నుంచి తాడిపత్రిలో వైసీపీ కార్యకలాపాలు లేవు. అందుకు కారణం.. జేసీ అంటే భయం ఒకటైతే.. ఆ భయాన్ని ఎదుర్కొనే పెద్దారెడ్డి లేకపోవడం మరొకటి అన్న చర్చ నడుస్తోంది. ఇలా ఎంత కాలం ఉంటుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఇది ఇలాగే కొనసాగి… పార్టీ యాక్టివిటీస్ లేకపోతే తాడిపత్రి నియోజకవర్గంలో పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోందట వైసీపీ కేడర్‌లో. సరిగ్గా ఇక్కడే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొందరు స్థానిక నాయకులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ పెద్దారెడ్డి తప్ప… వైసీపీ తరపున ఎవరైనా రాజకీయాలు చేసుకోవచ్చని స్పష్టంగా చెబుతున్నారు జేసీ ప్రభాకర్‌ రెడ్డి. అంతే తప్ప…మాజీ ఎమ్మెల్యే కొడుకులు, కోడళ్లను కూడా రానివ్వబోనని ప్రతిజ్ఞ చేశారాయన.

Read Also: Off The Record: రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వెనుక పెద్దలెవరు?

అందుకే ఈ ఛాన్స్‌ని నేనెందుకు వాడుకోకూడదని ఆలోచిస్తున్నారట వైసీపీలో ఒకప్పుడు కీలకంగా ఉన్న రమేష్ రెడ్డి. ప్రస్తుతం ఆయన తాడిపత్రి వైసీపీలో బలమైన నేతగా ఉన్నారు. ఇంజనీరింగ్ కాలేజీ ఉంది.గతంలో నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా పనిచేశారు. 2014 నుంచి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నా… పెద్దారెడ్డి కారణంగా ఛాన్స్ దక్కలేదన్న అసంతృప్తి ఉందట. ప్రస్తుతం పెద్దారెడ్డి నియోజకవర్గంలోకి రాకపోవడం.. పార్టీ కార్యక్రమాలు ముందుకు సాగకపోవడాన్ని ఆసరా చేసుకుని ప్రత్యామ్నాయంగా తాను ఎదగాలనుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. పెద్దా రెడ్డి కుటుంబం తప్ప అన్న క్లాజ్‌ తనకు ఉపయోగపడుతుందన్నది రమేష్‌రెడ్డి ఆశగా తెలుస్తోంది. గత మునిసిపల్ ఎన్నికల్లోనూ 11 చోట్ల రమేష్ రెడ్డి తన అనుచరులతో నామినేషన్లు వేయించారు. అందుకే పెద్దా రెడ్డి – రమేష్ రెడ్డి మధ్య ఆధిపత్యపోరు చాలా కాలం నుంచి ఉందని చెబుతున్నాయి వైసీపీ వర్గాలు. ఇప్పుడు పెద్దా రెడ్డి స్థానంలో సమన్వయకర్త అయ్యేందుకు రమేష్ రెడ్డి చాప కింద నీరులా ప్రయత్నాలు చేస్తున్నారన్నది పార్టీ వాయిస్‌. దీనికి వైసీపీలోని ఓ వర్గం లోలోన సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది కీలకంగా మారింది.

Exit mobile version