Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వానికి కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి శిరోభారంగా తయారైంది. ఆధిపత్యం కోసం జరుగుతున్న పోటాపోటీ చర్యలు వ్యక్తిగత ప్రతిష్ఠను, పార్టీ ఇమేజ్ ను బజారులో పెడుతున్నాయి. ఈ దిశగా కొన్ని జిల్లాల్లో వ్యవహారాలు హద్దులు దాటిపోగా…..ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయ వాతావరణం నివురుగప్పి కనిపిస్తోంది. కూటమిలో ఒకరంటే…ఒకరికి పడకపోవడం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే మొదలైపోతే….ఇటీవల ఎంపీలు, ఎమ్మెల్యేలకు అస్సలు పొసగడం లేదు. ఒక విధంగా గ్రూప్ రాజకీయాలు కట్టి ప్రభావితం చేసుకునే వరకు వ్యవహారం వెళ్ళింది. జిల్లాలో 15 అసెంబ్లీ…మూడు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. వైసీపీ గెలుచుకున్న అరకు ఎంపీ., పాడేరు,అరకు ఎమ్మెల్యే సీట్లు మినహాయిస్తే….కూటమి ఖాతాలో 12 అసెంబ్లీ…రెండు ఎంపీ స్థానాలు ఉన్నాయి. వీటిలో జనసేన గెలుచుకున్న యలమంచిలి., విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్, వంశీకృష్ణ యాదవ్….వైజాగ్ ఎంపీ శ్రీ భరత్ లు మాత్రమే కొత్త ముఖాలు. మిగిలిన నేతలంతా రెండేళ్లు అంత కంటే ఎక్కువ సార్లు గెలిచిన వాళ్లు కాగా….సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పీకర్ గానూ…..వంగలపూడి అనిత హోం మంత్రిగానూ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం నుంచి గెలిచిన సీనియర్ ఎమ్మెల్యేలున్న చోట సొంత పార్టీలోనే అంతర్గత విభేదాలు ఉంటే….జనసేన శాసనసభ్యులకు, టీడీపీ ఇంచార్టీలకు ఎక్కడా పొసగడం లేదు.
కూటమి ధర్మం ప్రకారం ఎమ్మెల్యేనే అల్టిమేట్ అని ప్రభుత్వం విస్పష్టంగా చెప్పేస్తోంది. కుమ్ములాడుకుని రోడ్డున పడితే కష్టమేనని సంకేతాలు పంపించింది. దీంతో కడుపు మండిన కూటమి నేతలు ఎమ్మెల్యేల వ్యవహార శైలి మీద ఎప్పటికప్పుడు ఫిర్యాదుల పరంపరను కొనసాగిస్తున్నారట. శాసనసభ్యులు అవినీతి, అక్రమాలు, పక్షపాత ధోరణిపై ఆధారాలతో సహా రిపోర్టులు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్థిక వ్యవహారాలు, మైనింగ్, లిక్కర్ సిండికేట్లు వంటివి ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నాయి. ఆ దిశగా ఎమ్మెల్యేలు నాలుగు ఆకులు ఎక్కువ చదివితే….కీలకమైన కార్పొరేషన్ల చైర్మన్ లు, సీనియర్ నేతలదీ అదే పంథా. ఈ దిశగా కొన్ని వ్యవహారాలు బహిర్గతం అవ్వడం….రాజకీయ వేడిని రాజేయడం పరిపాటిగా మారింది. ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, అడ్మినిస్ట్రేషన్లను పిల్లర్లుగా ప్రకటించుకుంటే…..అంతర్గత వ్యవహారాల కారణంగా ఇమేజ్ కు డ్యామేజ్ జరుగుతోందని ఇటీవలి పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం కీలక సర్వే చేయించినట్టు తెలిసింది. ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్ ల పనితీరు, అవినీతి అంశాలపై చేసిన సర్వేలో “పీపుల్స్ టచ్” బాగా పూర్ గా ఉందని…పదవుల్లో ఉన్న నేతలు ప్రజల తో “డిటాచ్ ” గానూ…..సొంత వ్యవహారాలతో బాగా “అటాచ్డ్ ‘ గానూ ఉన్నట్టు సర్వే తేల్చిందట.
అవినీతి, పబ్లిక్ ఇంటరాక్షన్, పాలనలో భాగస్వామ్యం, ప్రభుత్వం పని విధానాన్ని సమర్ధవంతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం సహా మొత్తం 9 అంశాలపై “పీపుల్స్ టచ్” సర్వే జరిగినట్టు తెలిసింది. కొందరి పెర్ఫార్మెన్స్ బాగుంటే ఈ నివేదికలో చాలా మంది ఎమ్మెల్యేల పనితీరుపై నెగెటివ్ రిమార్క్స్ బాగా ఎక్కువ వచ్చిందట. కొందరు ప్రజల దగ్గర కంటే పబ్లిసిటీకి ప్రాధాన్యత ఇస్తుంటే…మరికొందరు నియోజకవర్గంలోనే ఉంటున్నా జనానికి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండటం లేదనేది ఫీడ్ బ్యాక్. కొందరు ఎమ్మెల్యేలు అయితే రాజకీయంగా నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారనే భావన ఉంది. వెరసి ఐదు మార్కులు కూడా దాటని శాసన సభ్యులు ఎంత మంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఇప్పటికే శాసన సభ్యుల వ్యక్తిగత వ్యవహారాలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. తీరు మార్చుకోకపోతే కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి పదేపదే హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా లిక్కర్, మైనింగ్ అంశాలలో కొందరు ఎమ్మెల్యేలు ప్రత్యక్ష, పరోక్ష భాగస్వామ్యం పట్ల ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుందని తెలిసింది. ఇక, ఓట్లేసిన జనానికి సీనియర్లు అందుబాటులో ఉన్నా….కొందరు శాసన సభ్యులు అహంభావంతో వ్యవహరిస్తున్నారనే ఫీడ్ బ్యాక్ ఉండట. విపత్తులు, ఇతర సమస్యలు తలెత్తినప్పుడు నేరుగా ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగితే తప్ప…స్థానిక ఎమ్మెల్యేలు చొరవ ప్రదర్శించడం లేదనేది పెద్ద వెలితి. ఇందుకు ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. ఈ పరిస్థితి మారకపోతే భారీ మెజారిటీతో ఓటేసిన ప్రజలను సంతృప్తికి గురిచేయడం సాధ్యం కాదనేది పొలిటికల్ టాక్. దీంతో పీపుల్స్ టచ్ తగ్గించిన నేతలకు స్పెషల్ క్లాసులు తీసుకొనే ఛాన్స్ ఉందని కూటమి వర్గాలు చెప్పుకుంటున్నాయి.
