NTV Telugu Site icon

Off The Record: మళ్లీ యాక్టివ్ మోడ్‌లోకి సోము వీర్రాజు..!

Somu Veerraju

Somu Veerraju

Off The Record: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమువీర్రాజు రాష్ట్ర వ్యవహారాల్లో రీ ఛార్జ్‌ అయినట్టు కనిపిస్తున్నారట. ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలతో ఉన్న పరిచయాలతో లోకల్‌గా మరోసారి పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో అనారోగ్యంగా కారణంగా బెడ్ ఎక్కినట్టు చెప్పిన సోము వీర్రాజు… ఫలితాలు వెలువడిన మరుసటి రోజునుంచే… నాకు తగ్గిపోయిందోచ్‌ అంటున్నారట. ఈసారి ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీ టిక్కెట్‌ ఆశించారు సోము. టిక్కెట్‌ నాకుగాక ఇంకెవరికి వస్తుందన్న ధీమాతో నియోజకవర్గం మొత్తం భారీగా ఫ్లెక్సీలు కూడా వేయించేసుకున్నారాయన. తీరా… పురందరేశ్వరి పేరు ఖరారయ్యాక అనారోగ్యం పేరుతో మాయమైపోయారు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు. ప్రధానమంత్రి రాజమండ్రి ఎన్నికల బహిరంగ సభలో మాత్రం తళుక్కున మెరిసి తిరిగి కనిపించకుండా పోయారు వీర్రాజు. రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు టిడిపికి వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యవహారాల వల్లే… టిక్కెట్‌ ఇవ్వకుండా ప్రక్కన పెట్టారని చెబుతారు ఆయన వర్గీయులు. అయినా సరే… తనకు దక్కకున్నా… ఇతరులకు అడ్డుపడటానికి గట్టిగానే ప్రయత్నించారన్నది రాజకీయ వర్గాల్లో ఉన్న చర్చ.

రఘురామకృష్ణం రాజుకు నరసాపురం బిజెపి ఎంపీ టికెట్ రాకుండా అడ్డుపడింది వీర్రాజేనన్న వాదన ఉంది. అదే టిక్కెట్‌ను తన అనుచరుడు శ్రీనివాస వర్మకు ఇప్పించుకోగలిగారని అంటారు. తర్వాత రాజమండ్రి ఎంపీగా గెలిచిన దగ్గుబాటి పురందేశ్వరికి కేంద్ర మంత్రి పదవి దక్కకుండా అడ్డుపడి తన అనుచరుడు శ్రీనివాస్ వర్మకు ఇప్పించుకోగలిగారని గుసగుసలాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. పైగా ఇప్పుడు అంతా తాను ఊహించినట్టే… ఎన్నికల్లో ఎన్డీఏ అఖండ మెజార్టీ సాధించి రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిందని డబ్బా కొట్టుకుంటున్నారట ఆయన. అయితే ఇప్పుడు బీజేపీలోఅందరిదీ ఒకటే ప్రశ్న. ఒకే డౌట్‌. కీలకమైన ఎన్నికల టైంలో పని చేయకుండా సోము వీర్రాజు ఇన్నాళ్లు ఏమైపోయారు? ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారన్న చర్చ జరుగుతోంది. ఆ చర్చల సంగతి ఎలా ఉన్నా…. తన రాజకీయ భవిష్యత్‌ కోసం ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారన్న మాటలు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి.

సీనియర్ అయిన తనకు టికెట్ రాకపోవడాన్ని బూచిగా చూపించి…ఢిల్లీ స్థాయిలో ఉన్నత పదవి పొందే దిశగా అడుగులేస్తున్నట్టు అనుమానిస్తున్నాయి రాజకీయ వర్గాలు. తన విషయంలో సానుభూతితో ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రముఖుల ద్వారా లాబీయింగ్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ముందుగా రాజ్యసభ సీటు దక్కించుకుని తర్వాత కేంద్ర మంత్రి కావాలన్నది ఆయన ప్లాన్‌గా తెలుస్తోంది. అలా వీలవకుంటే గవర్నర్ పదవి అయినా దక్కుతుందనే ఆశాభావంతో ఉన్నారట ఆయన. కానీ… గవర్నర్ పదవి అయితే రాజకీయ భవిష్యత్తు ముగుస్తుందని, అందుకే చిట్ట చివరి వరకు రాజ్యసభ సీటు టార్గెట్‌తోనే పనిచేయాలనుకుంటున్నట్టు సమాచారం. తన రాజకీయ జీవితంలో వచ్చే రెండు నెలలు కీలకంగా భావిస్తున్నారని, ఏం జరుగుతుందో చూడాలంటున్నారు వీర్రాజు సన్నిహితులు.