Site icon NTV Telugu

Off The Record: సిక్కోలు జనసేనలో అసంతృప్తి పెరుగుతుందా..?

Srikakulam Jana Sena

Srikakulam Jana Sena

Off The Record: శ్రీకాకుళం జిల్లా జనసేనలో అసంతృప్తి చాపకింద నీరులా విస్తరిస్తోందట. పార్టీ ఆవిర్భావం నుంచి నిబద్ధతతో పనిచేస్తున్నా ఫలితం లేకుండా పోతోందని కీలక నేతలు ఆవేదన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తమకు పార్టీ, ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని భావించిన నేతలు ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలతో అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి కట్టబెడుతున్నారన్నది వాళ్ళ ఆవేదన. అధినేత పవన్ కల్యాణ్ పిలుపుతో రాజకీయాలలోని వచ్చిన తాము ప్రభుత్వం పదవులు ఆశించడం లేదని, కనీసం పార్టీ కోసం చేసిన కృషిని కూడా గుర్తించి కమిటీల్లో చోటు కల్పించకపోవడం ఏంటని అంటున్నారు ద్వితీయ శ్రేణి నేతలు. దశాబ్దానికిపైగా పార్టీ కండువాను భుజాలపై వేసుకొని మోస్తుంటే… ఇప్పుడు ఒక సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత ఇస్తూ మిగతా వాళ్ళను పట్టించుకోవడం లేదంటున్నారు ఇతరులు.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కాపులతో పాటు , కాళింగ, వెలమ సామాజికవర్గాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మరో వైపు యాదవులు , మత్స్యకారులు కూడా పెద్ద ఎత్తున జనసేనకు మద్దతుగా నిలబడుతున్నారు. వారికి సైతం ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోతోందన్న ఆవేదన పెరుగుతోంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ పరంగా కూటమి ధర్మాన్ని అనుసరించి దక్కిన పదవుల్లో అత్యధికం కాపులకు ఇవ్వడం ఏంటన్నది మిగతా కులాల ప్రశ్న. కాపులకు ఛైర్మన్‌ పదవులు ఇచ్చి మిగతా వాళ్ళకు డైరెక్ట్ పోస్ట్‌లతో సరిపెట్టారన్నది ప్రధాన అభియోగం. పీఎస్‌సీఎస్‌ అధ్యక్షులుగా రాజాం , శ్రీకాకుళం , హిరమండలం , పాలకొండలలో కాపులకు మాత్రమే కేటాయించారని అంటున్నారు. పార్టీ పరంగా చూసుకున్నా… జిల్లా అధ్యక్షడితో పాటు రెండు ఉపాధ్యక్షపదవులు , కార్యదర్శులతో సహా… మెత్తం కార్యవర్గం అంతా కాపులతో నింపేయడం ఏంటని అంటున్నారు. ఐతే ఈ విషయాలను బయటకు చెప్పలేకపోతున్న ఇతర ప్రధాన సామాజిక వర్గాల నాయకులు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో కాపులకు వైసిపి , టిడిపిల్లో ప్రాధాన్యత లేదన్న టాక్‌ నడుస్తోంది. అలా… రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న కాపులకు జనసేన ఆకర్షిస్తోందట. ఐతే ఇతర కులాలను కూడా కలుపుకునిపోతేనే సిసలైన రాజకీయం తప్ప… ఒకే కులానికి పరిమితమైతే ఎదుగుదల ఎలాగన్న చర్చ జనసేన వర్గాల్లోనే జరుగుతోంది.

Exit mobile version