NTV Telugu Site icon

Off The Record: రేవంత్‌రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు?

Revanth Reddy

Revanth Reddy

Off The Record: గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. ఆయన్ను ఓడించేందుకు అధికారపార్టీ కొడంగల్‌లో సర్వ శక్తులు ఒడ్డి సక్సెస్‌ అయ్యింది. తర్వాత మల్కాజ్‌గిరి లోక్‌సభకు పోటీ చేసిన రేవంత్‌ ఎంపీగా గెలిచారు. అప్పటి నుంచి రేవంత్ కొడంగల్‌ వదిలేశారనే ప్రచారం జరిగింది. నియోజకవర్గాన్ని తన సోదరుడు తిరుపతిరెడ్డికి అప్పగించారు రేవంత్‌. దాంతో తిరుపతిరెడ్డే పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ.. ఇటీవల కొడంగల్‌కు రేవంత్‌ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో కొత్త చర్చ మొదలైంది. పైగా కొడంగల్‌ నుంచే పోటీ చేస్తానని పీసీసీ చీఫ్‌ వర్గం నుంచి లీకులు కూడా బలంగా వస్తున్నాయి.

Read Also: Off The Record: అవంతిని టార్గెట్‌ చేసిన జనసేన..! వైసీపీ నేతలకు గాలం..!

వాస్తవానికి మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రేవంత్‌ పోటీ చేస్తారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. పీసీసీ చీఫ్‌ ఇక్కడ పోటీ చేస్తే ఆ ప్రభావం చుట్టుపక్కల నియోజకవర్గాలపైనా ఉంటుందని వ్యూహకర్త సునీల్‌ కనుగోలు సర్వేలో తేల్చారట. దాంతో ఉప్పల్‌, ఎల్బీ నగర్‌, మేడ్చల్‌, కల్వకుర్తి నియోజకవర్గాల్లో ఏదో ఒకటి రేవంత్‌ ఎంచుకుంటారని అనుకున్నారు. కానీ.. ఆ ప్రచారాలను తోసిరాజని.. కొడంగల్‌ నుంచే పోటీ చేస్తానని సన్నిహితుల దగ్గర చెబుతున్నారట రేవంత్‌రెడ్డి. లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్‌కు లీడ్‌ ఇచ్చిన ఎల్బీ నగర్‌ నుంచే పోటీ చేయాలని ఆయనపై స్థానిక కేడర్‌ నుంచి ఒత్తిడి ఉంది. పైగా ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని సొంత సామాజికవర్గం కూడా కలిసి వస్తుందని చెప్పారట. ఇలా ఎన్ని లెక్కలు ఉన్నా.. కొడంగల్‌లో మాత్రం పార్టీ కేడర్‌.. అనుచరులు చెల్లాచెదురు కాకుండా జాగ్రత్త పడ్డారు రేవంత్‌. తిరుపతిరెడ్డి కూడా శ్రేణులకు అందుబాటులో ఉండటంతో కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారట.

Read Also: Tourist Attractions: ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే 10 పర్యాటక ప్రాంతాలు

గతంలో కొడంగల్‌ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుర్నాథరెడ్డిని కాంగ్రెస్‌లో చేర్పించేందుకు మంతనాలు జరుగుతున్నాయి. అది కూడా రాజకీయంగా కలిసి వచ్చే అంశంగా కేడర్‌ అభిప్రాయ పడుతోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇక ఆలస్యం చేయకుండా.. కొడంగల్‌లో రేవంత్‌ అనుచరులు కూడా వేగం పెంచుతున్నారట. అంతా కదన రంగంలోకి దూకాలని స్పష్టం చేస్తున్నారట. దీంతో నియోజకవర్గంలో వేడి రాజుకుంటోంది. కాంగ్రెస్‌ వ్యూహాలకు తగ్గట్టుగా ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డితోపాటు.. అధికారపార్టీ కూడా రణతంత్రం రచిస్తుండటంతో ఈసారి హైఓల్టేజ్‌ పోరు తప్పదని అనుకుంటున్నారు.