NTV Telugu Site icon

Off The Record: రేవంత్ సర్కార్ ఆపరేషన్ బుల్డోజర్.. పొలిటికల్‌ హాట్‌ టాపిక్‌..!

Operation Bulldozer

Operation Bulldozer

Off The Record: హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌లో ఓ ఫామ్ హౌజ్ కూల్చివేత తెలంగాణలో పొలిటికల్‌ హాట్‌ టాపిక్‌ అయింది. కబ్జాసురులతో పాటు.. రాజకీయ వర్గాల్లోనూ దీని మీద పెద్ద చర్చే జరుగుతోంది. నిన్న మొన్నటి దాకా యూపీలో యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వం చేసిన ఆపరేషన్ బుల్డోజర్ గురించి టీవీల్లోనే చూశాం. కానీ, తాజాగా శంషాబాద్ ఫామ్ హౌజ్ కూల్చివేతతో.. తెలంగాణలోనూ ఆ తరహా స్పెషల్‌ ఆపరేషన్‌ మొదలైందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. భూ కబ్జా, కిడ్నాప్‌లకు పాల్పడుతూ ప్రజలను భయపెడుతున్న దుండగులపై తొలిసారి ఆపరేషన్‌ బుల్డోజర్‌ ను ప్రయోగించారు తెలంగాణ పోలీసులు. భూకబ్జాలతో పాటు మారణాయుధాలతో బెదిరించడం, కిడ్నాప్‌ చేసి ఫామ్‌హౌస్‌ల్లో బంధించటం వంటి ఘోరాలకు పాల్పడుతోంది ఓ ముఠా. ముఠా ఆటకట్టించిన రాజేంద్రనగర్ పోలీసులు.. 17 మందిని అరెస్ట్ చేశారు.

Read Also: Union Budget 2024: స్మార్ట్‌ఫోన్‌ కొనాలనే వారికి శుభవార్త.. ఆ ఫోన్లకు కస్టమ్స్ సుంకం తగ్గింపు

అనుమతులు లేకుండా నిర్మించి.. సంఘ విద్రోహక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకున్న ఫామ్‌హౌస్‌ను మున్సిపల్‌, రెవెన్యూ అధికారులతో కలిసి నేలమట్టం చేశారు పోలీసులు. ఫక్రుద్దీన్‌, సుజాత్‌అలీ అనే రౌడీషీటర్లు 20-30 మందితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు గద్దలా వాలిపోతోంది ఈ ముఠా. విదేశాల్లో ఉన్న, వృద్ధాప్యంలో ఉన్న ఓనర్లు, వెనకాముందు ఎవరూ లేని బలహీనులను లక్ష్యంగా చేసుకుని కబ్జాలకు పాల్పడుతున్నారు. అలాంటివారి ఖాళీ స్థలాలను కొనుగోలు చేసినట్టు నకిలీ పత్రాలు సృష్టించి.. సర్వే నంబర్లను తారుమారు చేసి కబ్జా పెడుతోందీ ముఠా. గండిపేటలో ఒక వైద్యుడి స్థలాన్ని కబ్జాచేసి బెదిరించారు ముఠా సభ్యులు. ఈ వివాదంలో ఎమ్మార్పీఎస్‌ నేత నరేందర్‌ను కిడ్నాప్‌ చేసి, శంషాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో బంధించి, చిత్రహింసలు పెట్టారు. అత్తాపూర్‌లోని అక్బర్‌ హిల్స్‌లో ఉన్న 500 గజాల స్థలాన్ని కబ్జాచేసి, ఆ స్థలంలోకి ఎవరూ రాకుండా మారణాయుధాలు, వేట కుక్కలతో తిష్టవేశారు. బాధితుల ఫిర్యాదుతో రాజేంద్రనగర్‌ డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌.. స్థానిక పోలీసులు, ఎస్‌వోటీ తో కలిసి ప్రధాన నిందితుడు సుజాత్‌ అలీని ముంబైలో అరెస్టు చేశారు. మొత్తం 17 మందిని అదుపులోకి తీసుకున్నారు.

Read Also: Minister Narayana: వైజాగ్‌ అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుపై మంత్రి నారాయ‌ణ సమీక్ష..

శంషాబాద్‌ ధర్మగిరి ఆలయ సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఫామ్‌హౌస్‌ కేంద్రంగా కబ్జాలు, బలవంతపు సెటిల్‌మెంట్లు, కిడ్నాప్‌లు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. దాన్ని నేలమట్టం చేశారు. ఈ ఆపరేషన్ బుల్డోజర్ ఎపిసోడ్‌తో పొలిటికల్ సర్కిల్స్‌ లోనూ దడ పుడుతోందట. కబ్జ్జాసురుల్లో ముందువరుసలో ఉంది రాజకీయ నేతలే. నేరుగా దందాలు చేస్తున్న వారు కొందరైతే… వెనకుండి అనుచర గణంతో వ్యవహారం నడుపుతున్న బడా నేతలు మరికొందరు. రాజేంద్రనగర్ లో మొదలైన ఆపరేషన్ బుల్డోజర్.. సిటీ అంతటా అమలైతే పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారట సదరు కబ్జాకోరులు. కానీ… సాధారణ ప్రజానీకంలో మాత్రం దీనిమీద సానుకూలత వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది. నానా కష్టాలు పడి రూపాయి రూపాయి పోగేసి కొనుక్కున్న స్థలాల్ని వాడెవడో వచ్చి ఆక్రమిస్తుంటే… ఏమీ చేయలేని స్థితిలో ఉన్నవాళ్ళకు ఇదో గొప్ప రిలీఫ్‌ అన్న భావన వ్యక్తం అవుతోంది కొందరిలో. కాకుంటే… అతి సర్వత్రా అన్నట్టు ఏదీ శృతి మించకూడదన్న సున్నితమైన హెచ్చరికలు సైతం వినిపిస్తున్నాయి. అరాచక శక్తుల విషయంలో మాత్రం రాజీ లేకుండా ఉండాలన్నది ఎక్కువ మంది అభిప్రాయం.