Site icon NTV Telugu

Off The Record: ఆ రిటైర్డ్‌ ఆఫీసర్‌ కూటమి సర్కార్ పై అప్రకటిత యుద్ధం చేస్తున్నారా..?

Ab Venkateswara Rao

Ab Venkateswara Rao

Off The Record: ఏబీ వెంకటేశ్వరరావు….. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్‌. సర్వీసులో ఉన్నప్పుడు గత వైసీపీ ప్రభుత్వం మీద ఒక రకంగా ఆయన యుద్ధమే చేశారన్నది విస్తృతాభిప్రాయం. అదే సమయంలో టీడీపీ సానుభూతిపరుడన్న ముద్ర కూడా గట్టిగానే ఉండేది. కానీ… ఇప్పుడాయన కూటమి సర్కార్‌ మీద కూడా అప్రకటిత యుద్ధం చేస్తున్నారా అన్నది కొత్త డౌట్‌. ఏబీవీ చర్యలు కూడా దాన్నే సూచిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి, కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక కూడా ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీ సానుభూతిపరుడనే ముద్రే ఉండేది. అందుకు తగ్గట్టుగానే… అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం ఆయనకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌ పదవి ఇచ్చింది. పైకి చెప్పకున్నా.. అక్కడి నుంచే అసలు తేడాలు మొదలయ్యాయన్నది పొలిటికల్‌ టాక్‌. ప్రభుత్వం పదవి అయితే ఇచ్చిందిగానీ… ఇంతవరకు బాధ్యతలు తీసుకోలేదు ఏబీవీ. తన స్థాయికి ఆ పోస్ట్‌ చాలా చిన్నదని వెంకటేశ్వరరావు భావిస్తున్నట్టు, ఆయనన ఇంకేదో పెద్ద పోస్ట్‌ ఆశించినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారంలో వాస్తవం ఎంతో తెలియదుగానీ… ఆ తర్వాతి నుంచే ఆయన ప్రభుత్వంతో, టీడీపీ పెద్దలతో టచ్‌ మీ నాట్‌ అన్నట్టుగా ఉంటున్నారట. పైగా… ఆయన చర్యలు కూడా పంటికింద రాయిలా మారుతున్నాయన్న చర్చ నడుస్తోంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో. ఒకప్పుడు టీడీపీ సొంత మనిషి అన్న ముద్ర పడ్డ ఏబీ వెంకటేశ్వరరావు… ఇప్పుడు చాలా అంశాల్లో ప్రభుత్వం టార్గెట్‌గా విమర్శిస్తున్నారు. ఆలోచనాపరుల వేదిక అని ఒక ప్లాట్‌ఫాం ఏర్పాటు చేసి రకరకాల అంశాలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు పెడుతూ…ఒక రకంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు.

ముందుగా… సీఎం చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్ మీద తీవ్రంగా స్పందించారు ఏబీవీ. అసలా ప్రాజెక్ట్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, నదుల అనుసంధానం వృధా ప్రయాస అన్నారాయన. ఏబీవీ వాదనలో వాస్తవం ఉంటే ఉండవచ్చుగానీ…కూటమి సర్కార్‌లో ఆయన నోటి నుంచి అలాంటి మాటల్ని ఊహించలేదంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు. ఇక తాజాగా కందుకూరు ఘటన మీద కూడా ఘాటుగానే రియాక్ట్‌ అయ్యారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఆర్ధిక లావాదేవీలో, ఇతర సమస్యలతోనో హత్యలు జరిగితే… ఆ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎందుకు ఆర్ధిక సాయం చేయాలని నిలదీశారాయన. ఎవడో వచ్చి హత్యకు కులం రంగు పులిమితే…. దానికి ప్రభుత్వం భుజాలు తడుముకోవడం, ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం ఏంటి? రేపట్నుంచి రాష్ట్రంలో ఇలాంటి హత్యలు జరిగితే… అన్ని కేసుల్లో ఇలాగే వ్యవహరిస్తారా అంటూ… ఘాటుగా ప్రశ్నించారు మాజీ ఐపీఎస్‌. ఆయన వాదనతో ఏకీభవించేవాళ్ళు ఉండవచ్చు, విభేదించే వాళ్ళు ఉండవచ్చుగానీ… ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరు మాత్రం పొలిటికల్‌ హాట్‌ టాపిక్‌ అవుతోంది.

అలాగే…గతంలో కోడి కత్తి శీనును కలవడాని కోనసీమలో పర్యటించారాయన. ఇదే ఊపులో ఇక ఉత్తరాంధ్ర పర్యటనకు కూడా సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు ఆయన సన్నిహితులు. దాంతో… ఇక ప్రభుత్వాన్ని గట్టిగానే టార్గెట్‌ చేయాలని డిసైడైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే విద్యుత్‌ టెండర్స్‌కు సంబంధించి ఆయన రాయలసీమలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆ విషయంలో పరోక్షంగా సీఎం చంద్రబాబునే లక్ష్యంగా చేసుకుని మాట్లాడినట్టు అంచనా వేస్తున్నారు. తామే విద్యుత్తు సంస్కరణలకు ఆద్యులమని చెప్పుకునే పెద్ద మనుషులు కాంట్రాక్ట్‌లను ఒకే సంస్థకు ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారాయన. ఇలాగైతే… గత ప్రభుత్వాని,ఈ ప్రభుత్వానికి తేడా ఏంటన్నది ఆయన క్వశ్చన్‌. విద్యుత్‌ రంగంలో పెద్ద మాఫియా ఉందన్నారు ఏబీ వెంకటేశ్వరరావు. ఇదంతా చూస్తుంటే…. ఆయన ముందు ముందు కూడా ఇదే ధోరణి కొనసాగించే అవకాశాలు ఉన్నాయని…. ఇంకా డోస్‌ పెంచే ఛాన్స్‌ కూడా ఉందని అంచనా వేస్తున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. ఆయన సబ్జెక్ట్‌లను ఎంచుకునే విధానం కూడా ప్రత్యేకంగానే ఉందని అంటున్నారు. జనానికి బాగా రీచ్‌ అయ్యే, విస్తృత చర్చ జరిగే కులం, నీరు, విద్యుత్‌ వంటి అంశాలను ఎంచుకుని తీవ్ర స్థాయి విమర్శలు చేయడమంటే… పైకి కనిపించకుండా గట్టిగా డ్యామేజ్‌ చేయడమేనన్నది కొందరి అభిప్రాయం.

ఇలాంటి అంశాల మీద ఎంత ఎక్కువ చర్చ జరిగితే అధికారంలో ఉన్నవాళ్ళకు అంత నష్టం జరుగుతుందని, అది ఇప్పటికిప్పుడు పైకి కనిపించకుండా… పోలింగ్‌ బూత్‌లో ప్రభావం చూపుతుందని అంటున్నారు. మరోవైపు ఏబీవీ సొంత రాజకీయ పార్టీ పెట్టే అవకాశం కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయోనన్న డిస్కషన్‌ గట్టిగా జరుగుతోంది. ఓవరాల్‌గా… ఒకప్పుడు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే ఏబీ వెంకటేశ్వరరావు ఈ టర్న్ తీసుకోవడం, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా జనంలోకి వెళ్ళడం మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. అటు ప్రతిపక్షం వైసీపీ కూడా ఈ పరిణామాల్ని నిశితంగా గమనిస్తోందట.

Exit mobile version