Site icon NTV Telugu

Off The Record: అక్కడ టీడీపీలో రేషన్ మాఫియా కలకలం..!

Nellore Tdp

Nellore Tdp

Off The Record: నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కలకలం రేపుతోంది. ఏకంగా పౌర సరఫరాల శాఖలోని విజిలెన్స్ అధికారుల సహకారంతోనే అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నాడన్న వార్తలు జిల్లా టీడీపీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. నియోజకవర్గానికో దళారిని పెట్టుకుని.. జిల్లా కేంద్రంలో రీసైక్లింగ్ చేసి మరీ దందా నడిపిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ మాఫియా వ్యవహారాలు మొత్తం… ఓ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కనుసన్నల్లో జరుగుతున్నట్టు నెల్లూరు టీడీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం చాలా మందికి తెలిసినా… ఎమ్మెల్యేలుగాని, చివరికి మంత్రులు కూడా అడ్డుకోలేకపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సదరు రేషన్‌ డాన్‌ను ఎదురు వెళ్ళినప్పటికీ.. ప్రభుత్వంలో కీలకంగా ఉండే మంత్రులతో లాబీయింగ్ చేయించినట్టు సమాచారం. సివిల్‌ సప్లయ్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్ పట్టాభిరామిరెడ్డి కనుసన్నల్లోనే నెల్లూరుకు చెందిన ఓ వ్యాపారి వ్యవహారాలు చక్కబెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. నెల్లూరు రూరల్, సర్వేపల్లి, కోవూరు నియోజకవర్గాల నుంచి బియ్యాన్ని సేకరించి గుడిపల్లిపాడు సమీపంలోని రైస్ మిల్లులో రీసైక్లింగ్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

అలాగే… ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన మరో వ్యాపారి కూడా రేషన్ బియ్యం దందా చేస్తున్నట్టు తెలుస్తోంది. వీళ్ళిద్దరికీ సదరు డైరెక్టరే బాస్‌ అన్నది లోకల్‌ టాక్‌. ఒకవేళ ఎవరైనా అధికారులు దాడులు చేసినా.. ప్రభుత్వంలో నెంబర్ టూ గా భావించే ఓ మంత్రి పేరు చెప్పి బెదిరిస్తారట. గత ఎన్నికల సమయంలో మంత్రి నారాయణకి అత్యంత సన్నిహితంగా ఉన్న పట్టాభిరామిరెడ్డి….. ఇప్పుడు నెల్లూరు రేషన్ మాఫియాలో కింగ్‌పిన్‌ అన్న చర్చ అధికార పార్టీలోనే జరుగుతోంది.నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నెలకు సుమారు ఎనిమిది వేల టన్నుల రేషన్ బియ్యం పక్కదారి పడుతోందని, కోట్ల రూపాయల అక్రమార్జన జరుగుతోందని సివిల్ సప్లై అధికారులు లెక్కలుగడుతున్నారు. ఈ వ్యవహారంపై జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్ళారట. నియోజకవర్గాలలో అతని ఆగడాల్ని తట్టుకోలేకపోతున్నామని మొత్తుకున్నా…ఆయన కూడా రేషన్‌ మాఫియా జోలికి పోయేందుకు సంకోచించారని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇటీవల నెల్లూరు రూరల్, ఆత్మకూరు నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో రేషన్ బియ్యం బస్తాలు పట్టుబడ్డాయి. వాటిని విడిపించేందుకు సివిల్‌ సప్లయ్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ తీవ్ర స్థాయిలో అధికారుల మీద వత్తిడి తీసుకువచ్చారని, దీంతో విజిలెన్స్ ఆఫీసర్స్‌ సైతం ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక ఇచ్చారని సొంత పార్టీ నేతలే అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారట. పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ… సదరు డైరెక్టర్‌ తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ఈ వ్యవహరిస్తున్నారని పాత తరం టిడిపి నేతలు మొత్తుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆయన తీరుపై రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నా… అక్కడ తమ పరపతి చాలదేమోనన్న భయంతో ఆగిపోతున్నట్టు సమాచారం. ఈ రేషన్ మాఫియాపై ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో పాటు.. జనసేన నెల్లూరు నగర ఇన్ఛార్జ్‌ కిషోర్ స్పందించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా వ్యవహరిస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రేషన్ బియ్యాన్ని పెద్ద ఎత్తున రీ సైకిలింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న సదరు నేతపై రాష్ట్ర నాయకత్వం మౌనంగా ఉండటాన్ని నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ ఈ వ్యవహారంపై సీరియస్‌గా దృష్టి పెట్టడం లేదని, దీని వెనకున్న మతలబు ఏంటంటూ…. ఆఫ్‌ ద రికార్డ్‌లో ప్రశ్నించుకుంటున్నారట లోకల్‌ టీడీపీ లీడర్స్‌. చివరికి తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు రేషన్ మాఫియా కింగ్‌పిన్‌గా ఉన్న నాయకుడు ఇప్పుడు ఏకంగా టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి రేస్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో అలర్ట్‌ అయిన సీనియర్స్‌ సదరు వ్యక్తికి ఆ పోస్ట్‌ ఇస్తే…. తెలుగుదేశం పార్టీ పరువును చేజేతులా… పెన్నా నదిలో కలిపేసినట్టేనంటూ… త్రీ మెన్‌ కమిటీ దృష్టికి తీసుకు వెళ్ళినట్టు సమాచారం. అయినా తగ్గకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయని, వ్యతిరేక వర్గం కూడా రేషన్‌ మాఫియాకు జిల్లా అధ్యక్ష పదవి దక్కకుండా గట్టిగానే అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద రేషన్‌ బియ్యం వ్యవహారం సింహపురి టీడీపీలో చిచ్చు పెడుతోందన్నది లోకల్‌ వాయిస్‌.

Exit mobile version