Site icon NTV Telugu

Off The Record : పుట్టా మహేష్ డ్రగ్స్ ఎపిసోడ్ పై టీడీపీ రియాక్షన్‌ ఏంటి..?

Otr Putta Mahesh Drug Case

Otr Putta Mahesh Drug Case

Off The Record : ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు భావిస్తున్నారట ఏలూరు జిల్లా టిడిపి నాయకులు. ఈ బటర్‌ఫ్లై రియాక్షన్‌ ఎఫెక్ట్స్‌ మాకేంట్రా బాబూ… అని తల కొట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎంపీ పుట్టా మహేష్‌ ఎపిసోడ్‌ ఎక్కడ నియోజకవర్గంలో పార్టీ పుట్టి ముంచుతుందోనన్నది లోకల్‌ తమ్ముళ్ళ ఆవేదన. అసలు మాకు ఆయనగారు వద్దే వద్దని ఎన్నికలకు ముందు నుంచే చెబుతున్నామా….? అయినా పార్టీ పెద్దలు పట్టించుకోకుండా, ఇక్కడెవరూ లేరన్నట్టు ఎక్కడి నుంచో తెచ్చి మా నెత్తిన రుద్దారు. ఇప్పుడు చూడు ఏమైందో…. ఎంపీ డ్రగ్స్‌ కేసు ఎపిసోడ్‌తో ఏలూరు పరువు పోయిందంటూ గట్టిగానే మాట్లాడుకుంటున్నారట. ఇప్పటికైనా మా నాయకులకు కనువిప్పు కలిగితే అదే పదివేలు అన్నది ఏలూరు టీడీపీ లీడర్స్‌ మాట. గెలిచాక కూడా ఆయన లోకల్‌గా ఉన్నది లేదని, పుట్టా మహేష్‌ విజిటింగ్‌ ఎంపీగా నెలకో, రెండు నెలలకో ఒకసారి రావడం, స్పెషల్ ఎలివేషన్స్‌ ఇచ్చి పోవడం మినగా ఆయనవల్ల ఒరిగింది ఏమీ లేదని చెప్పుకుంటున్నారు.

ఎంపీగా నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేకపోగా… ఇప్పుడు డ్రగ్స్‌ కేసులో ఏలూరు ఎంపీ అన్న ట్యాగ్‌లైన్‌తో… అధిష్టానం సంగతేమోగానీ…. మాకు మాత్రం తల కొట్టేసినట్టుందన్నది లోకల్‌ టీడీపీ లీడర్స్‌ వాయిస్‌. అసలు ఇలాంటివి బయటపడకుండా ఉండటం కసమే చుట్టూ బలమైన కోటరీని మెయిన్‌టెయిన్‌ చేస్తున్నారా అంటూ ఘాటుగానే అడుగుతున్నారు కొందరు టీడీపీ నాయకులు. ఎప్పటినుంచో పార్టీలో ఉన్న స్థానిక నేతల్ని కాదని ఏరికోరి కడప జిల్లా నుంచి తీసుకువచ్చి మరీ… పార్టీ అధిష్టానం టిక్కెట్‌ ఇచ్చి, మేం గెలిపిస్తే…. చివరికి అందరి చీటీలు చింపేశారంటూ సీరియస్‌ వ్యాఖ్యలు చేస్తున్నారు ఏలూరు తెలుగుదేశం లీడర్స్‌. నాడు అందర్నీ కాదని పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడ్డామని, అదే ఇప్పుడు కొంపముంచిందని గుసగుసలాడుకుంటున్నారట. నిండా రెండేళ్ళు పూర్తవక ముందే పడ్డ డ్రగ్స్‌ మరకతో ఇప్పుడు ఏలూరు నియోజకవర్గం పరిధిలో పార్టీకి కూడా ఇబ్బందులు తప్పవన్నది లోకల్‌ అంచనా. గోదావరి జిల్లాలపై రాయలసీమ నేతల పెత్తనం ఏంటంటూ వైసీపీ హయాంలో పరోక్షంగా మిథున్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి టార్గెట్‌గా ప్రచారం చేసింది టీడీపీ. ఆ ప్రచారం ఎంతో కొంత కలిసొచ్చిందన్న అంచనాలు కూడా ఉన్నాయి. తీరా తనదాకా వచ్చేసరికి కడపకు చెందిన పుట్టా మహేష్‌ను ఏలూరు బరిలో దింపడంతో ఏమీ అనలేక కామ్‌గా ఉండిపోయింది పార్టీ కేడర్‌. ఇప్పుడు ఎంపీవల్ల పార్టీకి అంటుకున్న మరక ఏ మాత్రం మంచిది కాదన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. దీని ప్రభావం ఒక్క ఏలూరు లోక్‌సభ సీటుకే పరిమితం కాదని, మొత్తం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో టీడీపీ మీద ఉంటుందని చెప్పుకుంటున్నారు.

వైసీపీ చేతిలో ఇది గట్టి అస్త్రం అవుతుందని, తాము ఎలా సమర్ధించుకోవాలో అర్ధంకాని స్థితిలో ఉన్నామన్నది ఏలూరు తెలుగుదేశం నేతల మాట. గతంలో ఇదే పుట్టా మహేష్‌ను పక్కన ఉంచుకుని… గంజాయి, డ్రగ్స్ ని నిర్మూలిస్తానంటూ పార్టీ అధినేత చేసిన ఎన్నికల ప్రచార వీడియోల్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు వైసిపి కార్యకర్తలు. ఇక ఇదే సమయంలో టీడీపీ సీనియర్ లీడర్ మాగంటి బాబుకు మద్దతు పెరుగుతోంది. గతంలో రెండు సార్లు ఎంపీగా పనిచేసిన మాగంటికి మాటమాత్రమైనా చెప్పకుండా గత ఎన్నికల్లో పుట్టా మహేష్‌కు అవకాశం కల్పించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారట. నాడు సీనియర్లను కాదని.. పార్టీ అవసరాల పేరుతో ముందు వెనుక చూసుకోకుండా తీసుకున్న నిర్ణయాలకు ఇప్పుడు ఎవరు బాధ్యత తీసుకుంటారన్నది ఏలూరు తమ్ముళ్ల క్వశ్చన్‌. ఏలూరు ఎంపీ సీటుతో పాటు మొత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీ మీద ఎఫెక్ట్‌ పడకుండా అధిష్టానం ఎలా హ్యాండిల్‌ చేస్తుందో చూడాలని అంటున్నారు. వాళ్ళు చర్యలు తీసుకుంటారా లేదా అన్న సంగతి పక్కన పెడితే…. ఈ పరిస్థితుల్లో గోదావరి వాసుల్ని కన్విన్స్‌ చేయడం మాత్ర అంత తేలిక కాదన్న మాటలు టీడీపీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.

Exit mobile version