Off The Record: ఊహించని విధంగా పొలిటికల్ స్క్రీన్ మీదికి వచ్చి… జనసేన తరపున ఎమ్మెల్యే అయిన చిర్రి బాలరాజు వ్యవహారం ఇటు పార్టీకి, అటు ఆయన అనుచరగణానికి కూడా తలనొప్పిగా మారిందట. పోలవరం నుంచి ఎన్నికై రెండేళ్లు కూడా పూర్తవుకముందే వివాస్పద ఎమ్మెల్యేల లిస్ట్ టాప్ ప్లేస్‌లోకి చేరిపోయారాయన. అవినీతి ఆరోపణలు ఒకవైపు, వ్యక్తిగత వ్యవహారాలతో డ్యామేజ్ మరోవైపు కలగలిసి పార్టీ అధినేతతో చివాట్లు తినాల్సిన పరిస్థితి. అలాగే… ఇచ్చిన డెడ్‌లైన్‌లోపు వివాదాలన్నిటినీ పరిష్కరించుకుని ఎమ్మెల్యే నార్మల్‌కు వస్తారా అన్నది ఇప్పుడు నియోజకవర్గంలో ఇంట్రస్టింగ్ టాపిక్. అదే సమయంలో… రెండేళ్లుగా లేనిది నాలుగు వారాల్లో మారతారా…? అసలు అది అయ్యేపనేనా అన్న పెదవి విరుపులు సైతం వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే ఇమేజ్ అంతలా డ్యామేజ్ అవడానికి, అధినేత పవన్‌కళ్యాణ్ డెడ్ లైన్ పెట్టిమరీ వ్యవహారాలు చక్కబెట్టుకోమని చెప్పడానికీ వెనుక కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు ఆయన అనుచరులు. గత ఎన్నికల్లో జనసేన టికెట్ తెచ్చుకోవడం దగ్గర్నుంచి ఎమ్మెల్యేగా గెలిచే వరకు వెనక ఉండి నడిపిన నేతలందరినీ ఉన్నఫళంగా పక్కన పెట్టేశారట బాలరాజు.
ప్రతి వ్యవహారంలోనూ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు గట్టిగా ఉన్నట్టు జనసేన నాయకులే… గుసగుసలాడుకుంటున్నారు. మట్టి తవ్వకాల దగ్గరనుంచి, ఇసుక తరలింపు వరకు, పేకాట స్థావరాల నుంచి క్రికెట్ బెట్టింగులు నడిపే బ్యాచ్‌లన్నిటిని వెనకేసుకుని రావడమే… కొంపముంచిందని అంటున్నారు ఆయన అనుచరులు. ఏరు దాటే వరకు ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న అన్నట్టుగా ఎమ్మెల్యే తీరు మారిపోవడం వల్లే బాలరాజుకు శత్రువులు పెరిగిపోయారంటూ ఆయన సన్నిహిత వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. ఇటీవల పార్టీ అధినేత పిలిచి మరీ…. చీవాట్లు పెట్టడంతో… చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు పరిస్థితి మారిపోయిందని అంటున్నారు. అంత జరిగినా….ఇప్పటికీ ఆయన వ్యవహార శైలిలో మార్పు కనిపించడం లేదని స్థానికంగా మాట్లాడుకుంటున్నారు. నియోజకవర్గంలో చేయాల్సిన అభివృద్ధి పనుల విషయాన్ని పక్కన పెట్టి సొంత వ్యవహారాలు చక్కబెట్టుకోవడంలో నిమగ్నమైన ఎమ్మెల్యే తీరుపై పార్టీ వర్గాలు ఎప్పటికప్పుడు అధిష్టానానికి సమాచారం ఇస్తూనే ఉందట జనసేనలో కీలకంగా వ్యవహరించే ఓ వర్గం. తనకి అనుకూలంగా ఉండే వర్గాన్ని మాత్రమే దగ్గరికి చేర్చుకుంటున్న ఎమ్మెల్యే…. అటు టీడీపీ, ఇటుజనసేన అభివృద్ధికి కృషి చేసిన నాయకులను పక్కన పెడుతున్నారట.
అయితే అధినేత ఆదేశాలతో ఇప్పుడు అదే క్యాడర్‌ను ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా చేయకుంటే.. పదవీ కాలం పూర్తయ్యలోపే కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుందని అంటున్నారు పోలవరం కూటమినేతలు. బాలరాజు విషయంలో అధినేత ఇచ్చిన నాలుగు వారాల గడువులోపు అభివృద్ధి పనులను పరుగులు పెట్టించడం, వ్యక్తిగత వ్యవహారాలను సెట్ చేసుకోవడం, కేడర్‌ని ఏకతాటిపైకి తీసుకురావడం లాంటివి చేయాల్సి ఉంది. వీటిలో ఏ ఒక్కటి జరగకపోయినా ఎమ్మెల్యే పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్టు అవుతుందంటున్నారు అక్కడి నేతలు. భవిష్యత్తులో నియోజకవర్గంలో పట్టు చేజారకుండా ఉండేందుకు టిడిపి క్యాడర్ యాక్టివ్ కావాలంటూ ఆ పార్టీ అధిష్టానం ఇప్పటికే తమ్ముళ్లకు పిలుపునిచ్చినట్లు సమాచారం. దీంతో డ్యామేజ్ ను కవర్ చేసుకునేందుకు ఎమ్మెల్యే ప్రాధాన్యతను తగ్గించి త్రీ మెన్ కమిటీ ద్వారా నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పర్యవేక్షించే ఏర్పాట్లు చేసే దిశగా జనసేన అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ఎమ్మెల్యే అధికారంలో ఉన్నా….ఆయన పవర్‌ను మాత్రం కట్ చేసే ఆలోచనలో ఉందన్నమాట. మార్పులు జరక్కుంటే మాత్రం… స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి పరాభవం తప్పదనే లెక్కలున్నాయి. మరి డెడ్‌లైన్ దాటే లోపు పోలవరం ఎమ్మెల్యే దారికొస్తారో లేదో చూడాలి.
